రాజకీయాలలో ఎన్నికలు, ఓట్లు పదవులు, అధికార పక్షం, ప్రతిపక్షం ఎంత సాధారణమో, ఇప్పుడు కేసులు, నోటీసులు, విచారణలు, జైలు, బెయిలు వంటివి కూడా అంతే సర్వసాధారణం అయ్యాయి.
కనుక ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవారు మేము అధికారంలోకి వస్తే ఇంతకు ఇంతా ప్రతీకార చర్యలు తప్పవని ముందే చెప్పేస్తున్నారు. కనుక భవిష్యత్ రాజకీయాలు చాలా భయానకంగా ఉండబోతున్నాయి.
రాజకీయ పార్టీల మధ్య ఆధిపత్యపోరు సర్వసాధారణమే. కానీ వాటితో ప్రజలను కూడా చీల్చుతుండటం, ప్రజలు కూడా పార్టీలు వారీగా విడిపోతున్నారు. చివరికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మద్య రాజకీయ చర్చ జరిగితే ఆవేశంతో కొట్లాడుకునే పరిస్థితి కనిపిస్తోంది.
ఇది చాలా ఆందోళనకరమైన విషయమే. కానీ దీని తీవ్రతను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ మార్పు లేదా విభజన ఏవిధంగా ఆందోళనకరమైనదంటే, కులమతాల గురించి రెండు ముక్కలు చెప్పుకోవాలి.
ఇప్పటికే కులాల మద్య పోరాటాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మతం పేరుతో ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. కానీ రాజకీయ పార్టీలు కులమతాలతో రాజకీయాలు చేయడం మానుకోవడం లేదు. పైగా కులాలు, మతాల వారీగా ప్రభుత్వంలో శాఖలు, మంత్రులు కూడా ఏర్పాటు చేసుకుంటున్నాయి.
అదేవిధంగా ఇప్పుడు పార్టీలవారీగా కూడా ప్రజలను చీల్చుకుంటున్నాయి, ప్రజలు కూడా పార్టీల వారీగా చీలిపోతున్నామని గ్రహించడం లేదు. అందుకే ఎప్పుడూ ఇంటి గడప దాటి బయటకు రాని వృద్ధులు, మహిళలు కూడా పార్టీల కండువాలు కప్పుకొని రోడ్లపై కనిపిస్తున్నారు.
ఎన్నికల సమయంలో పార్టీలు వారికి డబ్బు, బిర్యానీ ప్యాకెట్లు వగైరా ఇచ్చి ప్రచారం కోసం వాడుకుంటాయి. కనుక వాటి కోసమే వచ్చే వారితో ఎటువంటి ఇబ్బంది ఉండదు.
కానీ పార్టీల కోసం రోడ్లపై వీరంగం వేసే వారితోనే సమస్య. వారు ఆ పార్టీ ప్రభావంలో ఉన్నారు. దాని కోసం కండువాలు, జెండాలు పట్టుకుంటే పర్వాలేదు. కానీ కర్రలు, కత్తులు కూడా పట్టుకొని రప్పా రప్పా అంటున్నారు. వారిని మరో పార్టీకి చెందిన కార్యకర్తలు ఎదుర్కొంటున్నారు. రెండు పార్టీలకు చెందిన ఆ కార్యకర్తలు సామాన్య ప్రజలే కదా? వారి చేత కర్రలు, కత్తులు పట్టిస్తున్నది రాజకీయ పార్టీలే కదా?
ఈవిధంగా పార్టీల వారీగా ప్రజల చీలికలు వస్తే సమాజంలో నానాటికీ అశాంతి పెరుగుతుందే తప్ప తగ్గదు. కానీ రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాలే ముఖ్యమనుకుంటున్నాయి తప్ప సమాజంలో చీలికలు సృష్టించడం మంచిది కాదని అనుకోవడం లేదు. అలాగని ప్రజలు వెనక్కు తగ్గడం లేదు. ఇలాంటి రాజకీయ చైతన్యం దేశానికి, రాష్ట్రాలకి, ప్రజలకి కూడా ప్రమాదకరమే.




