భాష ప్రయుక్త రాష్ట్రాల సాధనలో భాగంగా తెలుగు భాష కోసం, తెలుగు జాతి కోసం ప్రత్యేక రాష్ట్రం అంటూ 58 రోజుల పాటు నిరాహారదీక్ష చేపట్టి ప్రాణాలు అర్పించిన చిరంజీవి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు.
ఆయన 125 వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆయన 58 రోజుల నిరాహారదీక్షకు ప్రతీకగా 58 అడుగుల ఎత్తుగల పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి బాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ ఆవిష్కరించారు.
6.8 ఎకరాల విస్తీర్ణంలో 150 కోట్ల అంచనా వ్యయంతో మొదలైన మొదటి దశ నిర్మాణ పనులు కేవలం 190 రోజులలో ముగించగలిగారు. అయితే ఇందులో ప్రముఖ పాత్ర వహించిన ఆర్యవైశ్య సంఘ కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ ని సీఎం, మంత్రి లోకేష్ అభినందించారు.
అయితే తెలుగు జాతి కోసం వస్తే ప్రత్యేక రాష్ట్రం పొతే నా ప్రాణం అంటూ ఒక జాతి గుర్తింపు కోసం, ఒక దీక్ష గౌరవాన్ని పెంచి తన ప్రాణాలను తృణప్రాయంగా విడిచిపెట్టిన పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ పేరు ఉన్నంతకాలం చిరంజీవే అవుతారు.
అలాగే రాష్ట్ర విభజనతో గాయపడిన ఆంధ్రప్రదేశ్ గుర్తింపు కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల గౌరవం కోసం వైసీపీ చేసిన ఎన్నో అవమానాలను, మరెన్నో అవహేళలను తట్టుకుని నిలబడిన అమరావతి సైతం చిరంజీవే అని చెప్పాలి. వైసీపీ ఐదేళ్ల పాలనలో సమాధిగా మారిన అమరావతి అరణ్యరోదన చేసింది.
వరద ప్రాంతమని, ముంపు నగరమని, నిర్మాణాలకు అనువైన ప్రాంతం కాదని, వేశ్యల నగరమని ఇలా వైసీపీ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదేళ్ల పాటు అమరావతి పై ఎన్ని నీలి నిందలు మోపి అనాధల నడిరోడ్డున పడేసింది. అయినా కూడా వాటన్నిటిని తట్టుకుని 2024 లో ఏపీ రాజధానిగా అమరావతి తిరిగి పట్టాభిషేకం చేసుకుంది.
ఇలా తెలుగు భాష కోసం, తెలుగు జాతి కోసం పొట్టి శ్రీరాములు 58 రోజుల నిరాహారదీక్ష చేసి ప్రాణాలర్పించి అమరజీవిగా మారితే, ఇక ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తింపు కోసం, గౌరవం కోసం అమరావతి ఐదేళ్లపాటు అరణ్యవాసం చేసి తన ఉనికి నిలబెట్టుకుంది.
అయితే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కోసం ఉద్యమించిన పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏపీ గుర్తింపు కోసం పోరాడిన అమరావతిలో నిర్మించడం నిజంగా శ్రీరాములు కూటమి ప్రభుత్వం ఇచ్చే అత్యంత విలువైన నివాళనే చెప్పాలి. ఇలా ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం ఉద్యమించిన అమరజీవి – అమరావతి ఇద్దరు చిరంజీవులే అవుతారు.




