President Droupadi Murmuరాష్ట్రపతి ఏటా శీతాకాలంలో హైదరాబాద్‌, బొల్లారం వద్ద గల రాష్ట్రపతి నిలయంలో నాలుగైదు రోజులు బస చేయడం ఆనవాయితీ. కనుక రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 26 నుంచి 30 వరకు 5 రోజుల పాటు అక్కడ బస చేయనున్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మద్య సఖ్యత ఉనంతకాలం ఇటువంటి పర్యటనలకి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. అన్నీ సహజంగా జరిగిపోతాయి. కానీ తెలంగాణ సిఎం కేసీఆర్‌ కేంద్రంపై కత్తులు దూస్తున్నందున, రాష్ట్రపతి పర్యటన ఆయనకి ఇబ్బందికరంగా మారబోతోంది. ఇక రాష్ట్రపతి పర్యటనలో పర్యటించబోయే ప్రాంతాలను చూస్తే ప్రత్యేకంగా ఎంపిక చేసినట్లుగా కనిపిస్తాయి.

రాష్ట్రపతి ద్రౌపదీ ద్రౌపదీ ముర్ము హైదరాబాద్‌కి వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్‌, ముఖ్యమంత్రి, సీఎస్, డిజిపి తప్పనిసరిగా స్వాగతం పలకాలి. ఆమెకి స్వాగతం పలకడానికి కేసీఆర్‌కి ఇబ్బంది లేదు. కానీ తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో కలిసి ఆమెకి స్వాగతం పలకాల్సి రావడమే కేసీఆర్‌కి నచ్చని విషయం.

Also Read – ఒకే బాటలో గురుశిష్యులు… ఎవరు కాదంటారు?

ఆ తర్వాత గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రాష్ట్రపతి ముర్ము గౌరవార్ధం ఆదేరోజు సాయంత్రం రాజ్‌భవన్‌లో విందు ఏర్పాటు చేస్తారు. గవర్నర్‌పై కూడా కత్తులు దూస్తున్న కేసీఆర్‌ దానికి హాజరుకావడం ఇబ్బందికరమే.
ఇక రాష్ట్రపతి ముర్ము పర్యటనలో రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ వద్ద త్రిదండి చిన్న జీయర్ స్వామితో భేటీ అయ్యి అక్కడ ఆయన ఏర్పాటు చేసిన శ్రీరామానుజాచార్యులవారి విగ్రహాన్ని సందర్శిస్తారు. కొన్ని నెలల క్రితం ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్‌ పర్యటనకి వచ్చినప్పుడు శ్రీరామానుజాచార్యులవారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ సందర్భంగా త్రిదండి చిన్న జీయర్ స్వామి ప్రధాని నరేంద్రమోడీని నోరారా ప్రశంశించారు. అప్పటి నుంచే కేసీఆర్‌ ఆయనకి కూడా కటీఫ్ చెప్పేసి దూరంగా పెట్టారు.

ఆయన సలహాలు, సూచనలతోనే కేసీఆర్‌ యాదగిరిగుట్టని యాదాద్రిగా అద్భుతంగా తీర్చిదిద్దారు. కానీ ఆయనని ఆహ్వానించకుండానే యాదాద్రి పునరుద్ఘాటన చేసేశారు. కేసీఆర్‌ ఇంతగా ద్వేషిస్తున్న త్రిదండి చిన్న జీయర్ స్వామితో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భేటీ అవుతుండటం యాదృచ్చికమనుకోలేము. బహుశః కేసీఆర్‌ని రెచ్చగొట్టేందుకే కేంద్రం ఆమె షెడ్యూల్‌ని ఈవిదంగా రూపొందించి ఉండవచ్చు.

Also Read – శర్మ సేవలు సమాప్తం..సారధి సూర్య కు శుభారంభం..?

హైదరాబాద్‌ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న యాదాద్రిని సిఎం కేసీఆర్‌ వందల కోట్లు ఖర్చు పెట్టి అద్భుతంగా తీర్చి దిద్దారు కనుక రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటిస్తారనుకోవడం సహజం. కానీ ఆమె పర్యటన షెడ్యూల్‌లో యాదాద్రి లేదు! ఒకవేళ యాదాద్రి ఉంటే సిఎం కేసీఆర్‌ తప్పకుండా ఆమె వెంట వెళ్ళి ఆమెకి దగ్గర ఉండి ఆలయాన్ని చూపించి, ఆమె నోటి ద్వారా ప్రశంశలు అందుకొనే అవకాశం ఉండేది. కానీ ఆమె యాదాద్రికి బదులు కేసీఆర్‌ పర్యటించడానికి ఇష్టపడని భద్రాచలానికి వెళుతున్నారు! ఆ తర్వాత వరంగల్ రామప్ప గుడికి వెళుతున్నారు.

ఇక ఆమె హైదరాబాద్‌లో బస చేసినప్పుడు ప్రతిపక్ష నేతలు ఆమెని మర్యాదపూర్వకంగా కలుస్తారు. వారు మరిచిపోకుండా కేసీఆర్‌ నియంతృత్వ పాలన గురించి ఆమె చెవిలో వేస్తారు. ఇదీ కేసీఆర్‌కి చాలా ఇబ్బంది కలిగించే విషయమే. కనుక రాష్ట్రపతి ద్రౌపదీ ద్రౌపదీ ముర్ము తెలంగాణ పర్యటన కేసీఆర్‌కి చాలా ఇబ్బందికరంగానే మారబోతోందని భావించవచ్చు.

Also Read – వైసీపిలో అందరూ భస్మాసురులేనా?