ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అమరావతిలో ‘క్వాంటం వ్యాలీ’కి సిఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి డా.జితేంద్ర సింగ్ కలిసి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి డా.పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేశ్, నీతి ఆయోగ్ సభ్యుడు డా.వికె. సారస్వత్, ఐబీఎం, టిసీఎస్, ఎల్&టి కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
అమరావతి పరిధిలోని ఉద్దండరాయునిపాలెంలో 50 ఎకరాల విస్తీర్ణంలో 90 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మొత్తం 8 బహుళ అంతస్తుల భవనాలతో ‘క్వాంటం వ్యాలీ’ నిర్మించబోతోంది. ఎల్&టి కంపెనీ క్వాంటం వ్యాలీ భవన నిర్మాణ బాధ్యతలు చేపడుతోంది.
ప్రీ-ఫ్యాబ్రికేటడ్ విధానంలో ఈ భవనాలు నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. కనుక ఈ ఏడాది ఆగస్ట్ నాటికి మొదటి భవనం సిద్ధం చేసిన డిసెంబర్‌లోగా క్వాంటం కంప్యూటర్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నేడు భూమిపూజ జరిగింది కనుక వీలైనంత త్వరలోనే భవన నిర్మాణ పనులు మొదలుపెడతామని ఎల్&టి కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
ఈ సందర్భంగా డా.వికె. సారస్వత్ మాట్లాడుతూ, “దేశంలో మొట్టమొదటి క్వాంటం వ్యాలీ ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, వారి ప్రభుత్వం పట్టుదల, చొరవ వల్లనే క్వాంటం వ్యాలీ ఏర్పాటవుతోంది. ఏఐ తర్వాత క్వాంటం టెక్నాలజీ ఈ ప్రపంచాన్ని శాశించబోతోంది.
కనుక కేంద్ర ప్రభుత్వం కూడా దేశంలో ‘క్వాంటం కంప్యూటింగ్’ని ప్రోత్సహించేందుకు రాష్ట్రాలకు సహాయ సహకారాలు అందిస్తోంది. అయితే ‘క్వాంటం కంప్యూటింగ్’ వ్యవస్థలో శిక్షణ ఇచ్చేందుకు ఈ రంగంలో మంచి పరిజ్ఞానం, అనుభవం ఉన్న ఫ్యాకల్టీని ముందుగా ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరం. అప్పుడే ఈ రంగంలో యువతకి తగిన అర్హతలు, మంచి నైపుణ్యం సాధించగలుగుతారు,” అంటూ ‘క్వాంటం కంప్యూటింగ్’ టెక్నాలజీకి సంబంధించి అనేక ఆసక్తికర విషయాలు తెలియజేశారు.
కేంద్ర మంత్రి డా.పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, “ఒకప్పుడు మన దేశానికి కంప్యూటర్లు అవసరమా?అని చాలా మంది అడిగేవారు. ఆ తర్వాత ఇంటర్నెట్ అవసరమా? అని అడిగేవారు? ఇప్పుడు అలాంటివారే ‘క్వాంటం కంప్యూటింగ్’ అవసరమా? అని అడుగుతున్నారు. ఇదివరకు ఈ ప్రశ్నలు అడిగినవారికి ఎప్పుడో జవాబులు లభించాయి. అదేవిధంగా ‘క్వాంటం కంప్యూటింగ్’ అవసరమా? అని అడుగుతున్నవారికి కూడా రేపు తప్పక జవాబు లభిస్తుంది,” అంటూ అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేయాలనే ఆలోచన చేసి దానిని కార్యాచరణకు పట్టుదలగా కృషి చేసిన ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని అభినందించారు.
CM Chandrababu Naidu at Quantum Valley Foundation Ceremony@ncbn #QuantumValley #Amaravati https://t.co/99VxXwSDuT
— M9 NEWS (@M9News_) February 7, 2026






