తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తన 1000 రోజుల పాలనను ప్రజాపాలనగా అభివర్ణిస్తూ సంబరాలు చేసుకుంటే, ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ మాత్రం రేవంత్ 1000 రోజుల పాలన విధ్వంసకరంగా ఉందంటూ పోరాటాలకు సిద్దమయ్యింది.
ఈ 1000 రోజుల పాలనలో రేవంత్ సర్కార్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తూ ఇటు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, అటు సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తూ, యువతకు ఉపాధి కల్పిస్తూ, రైతులకు, మహిళలకు భరోసా అందిస్తూ ముందుకు సాగుతోందంటూ కాంగ్రెస్ తన 1000 రోజుల పాలనకు 100 మార్కులు వేసుకుంది.
ఇటు విపక్ష బిఆర్ఎస్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తైన ఇప్పటికి రేవంత్ సర్కార్ ఎన్నికల హామీలను నెరవేర్చడం లేదంటూ ఈ 1000 రోజుల విధ్వంశం పాలన పై పోరుబాట అంటూ సెప్టెంబర్ 2 – 8 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టేందుకు బిఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చింది.
అయితే ఒకపక్క అధికార కాంగ్రెస్ మరోపక్క విపక్ష బిఆర్ఎస్ ఇలా రోజులు లెక్కపెట్టుకుంటూ ఒకరి మీద మరొకరు విమర్శలు చేసుకుంటున్నాయి. అయితే ఈ రెండు పార్టీల నేతలు ఒక్కసారి ఈ 1000 రోజులలో పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి తాము చేసిందేమిటో.? చెయ్యాల్సిందేమిటో.? అసలు పార్టీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలేమిటో అనేదాని మీద ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటారా.?
ముందుగా విపక్ష బిఆర్ఎస్ విషయానికొస్తే, అసలు ఈ 1000 రోజులలో ప్రతిపక్ష నేతగా, గత పదేళ్ల రాష్ట్ర ముఖ్యమంత్రి గా కేసీఆర్ ఒక్కరోజైనా అసెంబ్లీ కి వచ్చారా.? ప్రజా సమస్యల మీద గళం విప్పారా.? ప్రభుత్వం పై పోరాటం చేసారా.? కనీసం తన పైన, కేటీఆర్, హరీష్ పైన నమోదైన కేసుల మీదైనా స్పందించారా.? ప్రభుత్వాన్ని సవాల్ చేసారా.?
హైడ్రా వంటి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల మీద కూడా మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కనీసం పెదవి కూడా విప్పలేదు. అటు కుమార్తె కవిత గత బిఆర్ఎస్ ప్రభుత్వం పై అవినీతి ఆరోపణలు చేస్తున్నా, బిఆర్ఎస్ కీలక నేతలను గుంటనక్క అంటూ అవహేళన చేస్తున్నా పార్టీ అధినేతగా కేసీఆర్ కనీసం కవిత వ్యాఖ్యలను ఖండించేందుకు కూడా సుముఖత చూపడం లేదు.
ఇప్పటికి తెలంగాణ లో బిఆర్ఎస్ రాజకీయానికి ఆంధ్రానే ఆధారంగా ఉండడం, ఏపీ – తెలంగాణ అంటూ అదే పాత ప్రాంతీయవాద రాజకీయంతో ముందుకెళ్లడం బిఆర్ఎస్ ఫెయిల్యూర్ అనాలా.? పార్టీ అధినేత ఫామ్ హౌస్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సోషల్ మీడియాలో, పార్టీ కీలక నేతలు అజ్ఞాతంలో అన్నట్టుగా బిఆర్ఎస్ రాజకీయం సాగుతుంది.
ఇక అధికార కాంగ్రెస్ విషయానికొస్తే ఈ 1000 రోజులలో రేవంత్ సర్కార్ గత బిఆర్ఎస్ ప్రభుత్వం మీద నాటి నాయకులు, మంత్రుల మీద అనేక అవినీతి ఆరోపణలు, అక్రమాల విమర్శలు చేసింది. అయితే అవన్నీ కూడా కేవలం విమర్శలకు పరిమితం అవ్వడం ఏ ఒక్క కేసులోను ప్రభుత్వం చర్యలతో ముందుకు రాకపోవడం, ఆదారాలను ప్రజల ముందు పెట్టకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం డొల్ల తనాన్ని బయటపెట్టినట్టయ్యింది.
గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేలకోట్ల అవినీతి అంటూ కాళేశ్వరం నుంచి ఫార్ములా ఈ కార్ రేసింగ్ వరకు, అలాగే ఫోన్ టాపింగ్ నుంచి గురుకుల టెండర్లలో అక్రమాల వరకు అనేక కేసులలో బిఆర్ఎస్ నేతలపై అధికార కాంగ్రెస్ నుంచి ఆరోపణలు ఎదురయ్యాయి. కానీ ఇప్పటికి ఏ ఒక్క కేసులోనూ ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు.
ఇక ఈ 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో అప్పుడే అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. ఏకంగా ఒక మంత్రి కుమార్తె సీఎం రేవంత్, ఆయన సోదరుల టార్గెట్ గా అవినీతి ఆరోపణలు చేసింది. ఇక చిన్నా రెడ్డి మరో జీవన్ రెడ్డి కానున్నారా అన్న పరిస్థితులు నెలకొన్నాయి.
కోమటిరెడ్డి రాజగోపాల్ వ్యవహారం ఇప్పటికి పార్టీలో సద్దుమనగలేదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ 1000 రోజులలో అభివృద్ధి కార్యక్రమాల కన్నా వివాదాల కేంద్రంగానే ఎక్కువగా వార్తలలో నిలిచిందని చెప్పాలి. ఇటు అధికార కాంగ్రెస్ తమ పాలనకు అప్పుడే 1000 రోజులు గడిచిపోయాయి అని ఇచ్చిన ఎన్నికల హామీల అమలుకు తోడు రాష్ట్ర అభివృద్ధి మీద ద్రుష్టి పెట్టాలి.
అటు విపక్ష బిఆర్ఎస్ కూడా తమ ఐదేళ్ల ప్రతిపక్ష కాలంలో ఇప్పటికే 1000 రోజులు పూర్తి అయిపోయాయని రోజులు లెక్కపెట్టుకోకుండా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఎత్తిచూపాలి. కేసీఆర్ సైతం ప్రజా తీర్పుకి గౌరవం ఇచ్చి చట్ట సభలలో ప్రజాసమస్యల మీద గళం విప్పితే అది కేసీఆర్ తో పాటుగా బిఆర్ఎస్ కు రాజకీయ లబ్దిగా మారుతుంది.
అలాకాకుండా ఇరు పార్టీల నేతలు ఇలా రోజులు లెక్కపెట్టుకుంటూ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ వచ్చేది మేమే అంటూ జబ్బలు చరచుయకుంటే రాజకీయాలలో ప్రజలు ఎప్పుడు ఎవరి వైపు ఎందుకు మొగ్గు చూపుతారు అనేది ఊహించడం కష్టమే సుమీ.!







