చేతకాని హైకమాండ్‌దే పెత్తనం!!!

Revanth Reddy Delhi Visits

రేవంత్ రెడ్డి తెలంగాణ సిఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ రెండున్నరేళ్ళలో 63సార్లు ఢిల్లీ వెళ్ళారు… అని బీఆర్ఎస్‌ పార్టీ పద్దులో వ్రాసుకుంది. నేడు 64వ సారి ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారని గుర్తు చేసింది.

కాంగ్రెస్‌ పార్టీలో ఇది మామూలే కావచ్చు. కానీ చిన్న చిన్న నిర్ణయాలకు కూడా సిఎంలను ఢిల్లీకి రప్పించుకోవడం దేనికి? వారికి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్చ ఉండదా? అంటే రెండు రాజ్యసభ సీట్లకు అభ్యర్ధులను ఖరారు చేసేందుకు సిఎం ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ అధిష్టానం అనుమతి తీసుకోవాల్సి వస్తోంది. కనుక కాంగ్రెస్‌ సిఎంలకు ఆ అధికారం ఉండదనే అనుకోవాల్సి ఉంటుంది.

ADVERTISEMENT

జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ పదేపదే విఫలం అవుతుంటుంది. బిజేపిపై ఏమాత్రం పైచేయి సాధించలేకపోతోంది. కనీసం ఇండియా కూటమిలో మిత్రపక్షాల చేత ‘రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్ధి’ అని అనిపించలేకపోతోంది. ఏవిధంగా చూసినా సమర్ధత లేని కాంగ్రెస్‌ అధిష్టానం, సమర్ధంగా, చాలా తెలివిగా రాజకీయాలు చేస్తున్న సిఎం రేవంత్‌ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకొని ఆదేశాలు జారీ చేస్తుండటం విడ్డూరమే కదా?

ఇలాంటి పెత్తందారీ పోకడల వల్లనే యూపీఏ ప్రభుత్వం అధికారం కోల్పోయిందనే సంగతి మరిచినట్లుంది. అయితే ‘సిఎం రేవంత్‌ రెడ్డి పర్యటనలు ఢిల్లీకి డబ్బు మూటలు మోసేందుకే… ప్రతీసారి ఓ కొత్త సాకుతో వెళ్ళి వస్తుంటారు.. కాంగ్రెస్‌ అధిష్టానానికి కప్పం చెల్లించి సిఎం పదవి కాపాడుకుంటున్నారు. కాంగ్రెస్‌ అధిష్టానం ఆ డబ్బుని ఇతర రాష్ట్రాలలో ఎన్నికల కోసం ఖర్చు చేస్తుంటుంది…’ అని ఈ పద్దు మెయిన్‌టెయిన్ చేస్తున్న బీఆర్ఎస్‌ పార్టీ వాదిస్తుంటుంది.

బీఆర్ఎస్‌ పార్టీ సోషల్ మీడియాలో, బయట పదేపదే చేస్తున్న ఈ ఆరోపణలతో కాంగ్రెస్‌ పార్టీ. ప్రభుత్వం పట్ల తెలంగాణ ప్రజలలో వ్యతిరేకత పెరుగుతుందని తెలిసి ఉన్నా సిఎం రేవంత్‌ రెడ్డితో సహా కాంగ్రెస్‌ మంత్రులు అందరూ స్పందించకుండా మౌనంగా ఉండిపోవడం మరో విశేషం. అంటే వారి మౌనం అంగీకరమనుకోవచ్చా?

ఏది ఏమైనప్పటికీ సిఎం రేవంత్‌ రెడ్డి విజయవంతంగా 64సార్లు ఢిల్లీ పర్యటనలు చేశారు. మిగిలిన రెండున్నరేళ్ళలో మరో 164 పర్యటనలు చేయడం ఖాయమే.

కనుక ఈ పర్యటనల పద్దు మెయిన్‌టెయిన్ చేస్తున్న బీఆర్ఎస్‌ పార్టీ, వీటి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో కూడా ఆ నోటితోనే చెప్పేస్తే అందరూ సంతోషిస్తారు కదా?

ADVERTISEMENT
Latest Stories