
ఏ రాష్ట్రంలోనైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అందరి కంటే ఎక్కువ లాభపడేది విమానాయన సంస్థలే. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కనీసం నెలకు రెండుసార్లు ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ పెద్దలని కలిసి వస్తుండాలి. తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి తాను రాహుల్ గాంధీ ఉద్యోగినని స్వయంగా చెప్పుకున్నారు కనుక మరీ తప్పదు.
ఈ 18 నెలల్లో నెలకు రెండు లేదా మూడుసార్లు చొప్పున ఢిల్లీ వెళ్ళి వస్తూనే ఉన్నారు. వారం పది రోజుల క్రితమే వెళ్ళి ముగ్గురు మంత్రులను నియమించుకోవడానికి అనుమతి సాధించుకొని వచ్చారు. మొన్న ఆదివారం వారు ముగ్గురూ ప్రమాణ స్వీకారాలు చేశారు కూడా.
Also Read – తెలంగాణ రాజకీయాలతో కూడా ఏపీకి తలనొప్పులేనా?
ఇప్పుడు వారికి ఏ మంత్రిత్వ శాఖలు కేటాయించాలో కనుగొనేందుకు మళ్ళీ ఢిల్లీ వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీలతో సమావేశమయ్యి చర్చిస్తున్నారు.
మొత్తం ఆరుగురు మంత్రులను నియమించుకునే అవకాశం ఉండగా, ఏడాదిన్నర పాలన తర్వాత కేవలం ముగ్గురిని నియమించుకోవడానికి మాత్రమే కాంగ్రెస్ అధిష్టానం అనుమతించడమే విచిత్రం అనుకుంటే, నియమించిన వారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాకుండా కాంగ్రెస్ అధిష్టానమే మంత్రిత్వ శాఖల కేటాయింపులు నిర్ణయిస్తుండటం ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నాయని గ్రహించడం లేదు.
Also Read – వైఎస్ స్పూర్తి.. వద్దు పైనున్న ఆయన బాధపడతారు!
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాలన ఢిల్లీ నుంచే సాగుతుందని బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పదేపదే చెప్పిన మాట వాస్తవమని ఇప్పుడు నిరూపితమవుతోంది.
రెండు వారాల క్రితం హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పెంచగా, సోమవారం నుంచి తెలంగాణ ఆర్టీసీ కూడా విద్యార్ధుల నెలవారి బస్సు పాసు ఛార్జీలు విపరీతంగా పెంచేసింది. వారితో పాటు సామాన్య ప్రజానీకం ఉపయోగించే నెలవారి పాసుల ఛార్జీలు కూడా భారీగా పెంచేసింది. కనుక బిఆర్ఎస్ పార్టీ వెంటనే ఆందోళనలు మొదలుపెట్టేసింది.
Also Read – అమరావతి టూ పొదిలి అంతా వ్యూహాత్మకమే?
ఎన్నికలలో ఓటమి, ఫిరాయింపులు, కల్వకుంట్ల కుటుంబంలో కీచులాటలు, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కేసు, ఎఫ్-1 రేసింగ్ కేసు, కేసీఆర్ అజ్ఞాతవాసం వంటి అనేక కారణాలతో బిఆర్ఎస్ పార్టీ చాలా బలహీనపడగా, దానికి కాంగ్రెస్ పార్టీయే ఊపిరి ఊదీ ఆయువు పోసి బ్రతికించుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇది యాదృచ్ఛికమనుకోలేము.
గతంలో కేసీఆర్ గంగిగోవు వంటి కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడం వల్లనే అత్యంత శక్తివంతమైన బీజేపి తెలంగాణలో బలపడింది… అని రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధిష్టానం గ్రహించడం వల్లనే రాష్ట్రంలో మళ్ళీ బీజేపి బలపడకుండా ఉండేందుకు బిఆర్ఎస్ పార్టీని బ్రతికించుకుంటున్నారేమో?