పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నల్ల కుభేరులు అక్రమాలకు పాల్పడకుండా కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా మరో సంచలన అత్యవసర ఆదేశాన్ని జారీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ ఆర్డినెన్స్ ప్రకారం రద్దయిన 500, 1000 రూపాయిల నోట్లు ఎవరి వద్దయినా 10,000 రూపాయల విలువకు పైగా ఉంటే, దానిని ఆర్ధిక నేరంగా పరిగణించనున్నారు.
రద్దయిన పెద్ద నోట్లు కలిగి పట్టుబడిన వారికి 50 వేల జరిమానా లేదా పట్టుబడిన సొమ్ముకు అయిదు రెట్లు జరిమానా విధించే విధంగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని సమాచారం. అంతేగాక, ఈ నేరానికి పాల్పడితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పురపాలక మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో విచారణ జరిపించి, జరిమానాను కూడా విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. నిజానికి ఈ నెల 30 తరువాత కూడా రద్దయిన నోట్లను రిజర్వ్ బ్యాంక్ కౌంటర్లలో జమ చేసుకోవచ్చు.
అయితే ఇందుకు సంబంధించిన గ్రేస్ పీరియడ్ ను ఈ నెల 30వ తేదీలోపే ఈ ఉత్తర్వులను జారీ చేయాలని కేంద్ర సర్కారు భావిస్తోంది. నవంబరు 8కి ముందు దేశంలో మొత్తం 15.44 లక్షల కోట్ల పెద్ద నోట్లు చలామణీలో ఉన్న విషయం తెలిసిందే. వాటిలో ఈ నెల 13 వరకు 12.44 లక్షల కోట్లు జమ అయినట్టు ఆర్బీఐ తెలిపింది. ఈ నెల 30 గడువు లోపు బ్యాంకుల్లో 13 లక్షల నుంచి 13.5 లక్షల కోట్లు డిపాజిట్ అవుతుందని భావిస్తున్నారు. మిగిలిన మొత్తాన్ని ఆర్బీఐ కౌంటర్లలో జమ కాకుండా నియత్రించేందుకు సరికొత్త నిబంధనలను తెచ్చే క్రమంలో కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తోంది.



