పార్టీ నుంచి బహిష్కరించగలదు కానీ… లీగల్‌గా ఎదుర్కోగలదా?

Sajjala-Rama-Krishna-Reddy-Andhra-Pradeshఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ చేసి పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినందుకు నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (నెల్లూరు రూరల్), ఆనం రామనారాయణ రెడ్డి(వెంకటగిరి)లతో పాటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి(ఉదయగిరి), ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ)లని పార్టీలో నుంచి తక్షణం సస్పెండ్ చేస్తున్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ప్రకటించారు.

ADVERTISEMENT

ఆ నలుగురుని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాదు కావాలంటే శాస్వితంగా బహిష్కరించగలమని మంత్రి అంబటి రాంబాబు ఈరోజే సెలవిచ్చారు. కానీ వారు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే వైసీపీ, ప్రభుత్వం గానీ వారిని ఎదుర్కోగలదా?అంటే లేదనే న్యాయనిపుణులు చెపుతున్నారు.

ఎందుకంటే, ప్రత్యేకించి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీలు తమ ఎమ్మెల్యేలకు ఫలానా అభ్యర్ధికే ఓటు వేయాలని విప్ జారీ చేయడానికి వీల్లేదు. కనుక వారు క్రాస్ ఓటింగ్ చేసినందుకు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని న్యాయస్థానంలో చెప్పలేదు. అలాగే రహస్య బ్యాలెట్ ద్వారా ఈ ఎన్నికలు జరిగినప్పుడు, తమ ఎమ్మెల్యేలు ఎవరికి ఓట్లు వేస్తున్నారని నిఘా పెట్టకూడదు. కానీ ఎవరెవరు ఎవరెవరికి తొలి, ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు వేయాలో ఎమ్మెల్యేలందరికీ వైసీపీ ముందే ఆదేశాలు జారీ చేసి, వారు ఎవరికి ఓట్లు వేస్తున్నారో కనుగొనేందుకు ప్రత్యేకమైన కోడింగ్ విధానాన్ని కూడా వైసీపీ రూపొందించుకొంది.

ఈ విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి, పలువురు మంత్రులతో సహా క్రాస్ ఓటింగ్ చేసిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా మీడియాకు చెప్పారు. ఈ కోడింగ్ విధానం ద్వారా ఎవరు క్రాస్ ఓటింగ్ చేశారో కనిపెట్టామని చెపుతూ ఈ నలుగురు ఎమ్మెల్యేలని పార్టీలో సస్పెండ్ చేస్తున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. తద్వారా రహస్య బ్యాలెట్ విధానాన్ని తమ పార్టీ ఉల్లంఘించిందని బాహాటంగా చాటింపువేసుకొన్నట్లయింది కదా?

కనుక ఒకవేళ ఆ నలుగురు ఎమ్మెల్యేలు లేదా వారిలో ఎవరైనా కేంద్ర ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేసినా లేదా హైకోర్టుకి వెళ్ళినా ఈ వ్యవహారం వైసీపీ మెడకు చుట్టుకోవడం ఖాయం.

ADVERTISEMENT
Latest Stories