ఏపీలో షర్మిల, తెలంగాణలో కవిత ఇద్దరి కథలు అందరికీ తెలిసినవే. వారిరువురూ తాము పనిచేసి ఎంతగానో వెనకేసుకొచ్చిన పార్టీలను ఇప్పుడు తీవ్రంగా విమర్శిస్తున్నారు. రాకీలు కట్టిన తమ అన్నలపైనే ఇద్దరూ కత్తులు దూస్తున్నారు.
కేసీఆర్ అవినీతి సంపాదనలో వాటాల కోసమే కల్వకుంట్ల కుటుంబంలో అందరూ కీచులాడుకుంటున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
అవినీతి సొమ్ములో వాటాల కోసం జగన్, విజయమ్మ, షర్మిల ముగ్గురూ కోర్టుకు ఎక్కారని టీడీపి నేతలు ఎద్దేవా చేస్తున్నారు.
వారి ఆస్తుల పంచాయితీలు పక్కన పెట్టి చూస్తే ఈ యుద్దాలతో షర్మిల, కవిత రాజకీయంగా ఏం సాధించగలరు? అనే ఆలోచిస్తే సంతృప్తికరమైన సమాధానం దొరకదు.
షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ ఏపీలో వైసీపీ, కూటమి పార్టీలు చాలా బలంగా ఉన్నందున కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ ఏపీలో అధికారంలోకి రాలేదు. కనుక షర్మిల అటువంటి పార్టీని అంటిపెట్టుకొని ఉండటం కేవలం రాజకీయ కాలక్షేపానికి మాత్రమే పనికి వస్తుంది.
ఒకవేళ ఆమెకు రాజ్యసభ సీటు ఇస్తే అది ఆమెకు బోనస్ కిందే లెక్క. ఇంతకు మించి కాంగ్రెస్ పార్టీతో ఆమె ఏమీ సాధించలేకపోవచ్చు.
కానీ కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి పేరుతో ఒంటరి పోరాటం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు గెంటేసిన తర్వాత తెలంగాణ రాజకీయాలలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకోవాలని పట్టుదలగా ఉన్నారు. కనుక ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడాలి కానీ బీఆర్ఎస్ పార్టీతో పోరాడుతున్నారు. ఎందుకు? అనే సందేహం అందరికీ కలుగుతోంది.
కాంగ్రెస్‌తో ఎంత పోరాడినా అంత ఎఫెక్టివ్‌గా ఉండదు. రోటీన్ పొలిటికల్ ఫైట్ అని జనం పట్టించుకోరు. అదే తండ్రి, అన్న, బావ నిన్న మొన్న వరకు కలిసి పనిచేసిన సొంత పార్టీ నేతలతో యుద్ధం చేస్తే ప్రజలను ఆకట్టుకోవడం సులువు.
ఆమె ఏరోజు ఏం మాట్లాడుతారోనని ప్రజలు కూడా ఆసక్తిగా వింటారు. ఆమె రాజకీయ మనుగడకి ఇది చాలా అవసరం. కనుకనే బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకుంటున్నారు.
ఆమె వలన బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా ఇంకా నష్టం జరుగుతోంది. కనుక అది కూడా ఆమెను ధీటుగానే ఎదుర్కోక తప్పదు. దాని వలన ఆమె పాపులారిటీ పెరుగుతుందని, ఆమె మరిన్ని అవినీతి రహస్యాలు బయటపెడితే తమకే నష్టమని బీఆర్ఎస్ పార్టీ వెనకంజ వేస్తోంది.
కానీ యుద్ధం మొదలైంది కనుక మధ్యలో శాంతి ఒప్పందాలకు తావుండదు. కనుక ఆమెతో బీఆర్ఎస్ పార్టీ యుద్ధం చేయక తప్పదు.
ఈ యుద్ధం ప్రత్యేకత ఏమిటంటే, దీనిలో ఒకరినొకరు ఓడించుకోగలరు కానీ ఎవరు గెలిచే అవకాశం లేదు. ఎందుకంటే, అందరికీ అవినీతి మరకలున్నాయి. వారి యుద్ధంలో ఎవరెవరు ఎంతెంత అవినీతికి పాల్పడ్డారో వారి నోటితో వారే చెప్పుకున్నప్పుడు ఎలా గెలుస్తారు?
నదులన్నీ సముద్రంలో కలిసినట్లు చివరాఖరికి ఆమె బీజేపిలో చేరిపోయి, బీఆర్ఎస్ పార్టీ బీజేపిలో విలీనమైపోతే ఈ యుద్ధాలు ముగిసిపోవచ్చు.







