సంక్రాంతి కొట్లో అరడజను సినిమాలు – ఎవరికోసమీ పంతాలు

six movies releasing on sankranthi 2023ఏదైనా ఊళ్ళో జాతర జరిగితే వచ్చే జనాల సంఖ్యని బేరీజు వేసుకుని అక్కడ దుకాణాలు పెట్టుకుని వ్యాపారాలు చేసుకోవడం అన్ని చోట్ల చూసేదే. ఉదాహరణకు ఒక గుడికి పండగ రోజుల్లో లక్ష మంది వస్తారనుకుంటే నూటా యాభై దుకాణాలు అవసరమనుకుందాం. ఓ పది ఇరవై ఎక్కువైనా ఇబ్బంది ఉండదు. హ్యాపీగా బిజినెస్ జరిగిపోతుంది. అలా కాకుండా ఏకంగా అయిదు వందల కొట్లు పెట్టారనుకోండి. అప్పుడేమవుతుంది. ఎవరికీ పూర్తి కస్టమర్లు రాక ఎక్కువ శాతం దివాలా తీస్తారు. కాబట్టే డిమాండ్ సప్లై సూత్రాన్ని పాటించాలని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. ఇప్పుడీ ఎకనామిక్స్ పాఠాలకు సంక్రాంతికి లింక్ ఏంటనేగా డౌట్. అక్కడికే వద్దాం.

జనవరిలో వచ్చే మహా బాక్సాఫీస్ పండక్కు ఒకటి రెండు కాదు ఏకంగా ఆరు సినిమాలు రెడీ అయ్యాయి. ముందు విజయ్ వారసుడు అన్నారు. మొదట్లో ఆ డబ్బింగే అనుకున్నారు కానీ నిర్మాత దిల్ రాజు కావడంతో ఇప్పుడదే ఏకు మేకై కూర్చుంది. తర్వాత వాల్తేరు వీరయ్య ప్రకటించారు. మెగాస్టార్ వస్తే ఇంకేం కలెక్టన్ల పండగేనని బయ్యర్లు సంబరపడ్డారు. తర్వాత వీరసింహారెడ్డి నేనూ అప్పుడే వస్తానంటూ పంతం పట్టాడు. ఇద్దరి నిర్మాత ఒకరే అయినా ఎవరి మాట కాదనలేక రిస్క్ కు సిద్ధపడ్డారు. చప్పుడు చేయకుండా షూటింగ్ జరుపుకున్న అజిత్ తునివు నాకూ పొంగల్ కావాలంటూ మంకు పట్టడమే కాదు అందరికంటే ముందు 11కే రావడానికి రెడీ అయ్యాడు

ADVERTISEMENT

సరే వీళ్ళందరూ అగ్ర హీరోలు కాబట్టి ఓపెనింగ్స్ విషయంలో ధీమాగా ఉన్నారనుకుందాం. కానీ విద్యావాసుల అహం అనే ఎవరికీ తెలియని ఒక చిన్న సినిమాని 14కి దింపడం వెనకాల నిర్మాతల ఎత్తుగడ ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఏదో ఓటిటి కండీషన్ కోసం అలా చేస్తున్నారో లేక నిజంగా అంత అదిరిపోయే కంటెంట్ అందులో ఉందో వాళ్ళకే తెలియాలి. మరోపక్క యువి సంస్థ సంతోష్ శోభన్ కళ్యాణం కమనీయంని కూడా వీటి మధ్యే రిలీజ్ చేయడం వెనుక ఎత్తుగడ అంతు చిక్కడం లేదు. యువికి వి సెల్యులాయిడ్ పేరుతో థియేటర్ల చైన్ ఉన్న విషయం తెలిసిందే. కేవలం ఆ కారణంగా విడుదల చేయడం వెనుక లాజిక్ బ్రహ్మరహస్యమే.

ఇక్కడ ఎవరి ప్రయోజనాలు ఏంటనేది పక్కనపెడితే పరస్పరం దెబ్బతినే సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫిలిం ఛాంబర్లు డిస్ట్రిబ్యూటర్లు ఎంత మొత్తుకున్నా దిల్ రాజు మరీ ఎక్కువ మెట్టు దిగే సూచనలు కనిపించడం లేదు. ఎంత చిన్నవైనా సరే విద్యావాసుల అహం, కళ్యాణం కమనీయంకు కొందరు పంపిణీదారుల మద్దతు ఉండటంతో చిరంజీవి బాలకృష్ణలకు ఎక్కువ సంఖ్యలో దక్కాల్సిన థియేటర్లలో ఖచ్చితంగా కోత వేసుకోక తప్పదు. ఆరేడు స్క్రీన్లు మాత్రమే ఉండే చిన్న సెంటర్లలో పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. ఇదంతా మైత్రిని అదుపు చేయడానికి వేస్తున్న ఎత్తుగడగా కొందరు కామెంట్లు చేస్తుంటే పండగ బెనిఫిట్ పెద్ద హీరోలకు మాత్రమే దక్కాలా అంటూ మరికొందరు అంటున్నారు. మొత్తానికి రోజుకో మలుపు తిరుగుతున్న సంక్రాంతి కథ ఏ కంచికి చేరుతుందో.

ADVERTISEMENT
Latest Stories