వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా పరిశ్రమలను ఏర్పాటు చేయలేకపోయినా, కనీసం నడుస్తున్నవాటికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తూ, రాజకీయ కారణాలతో వాటి జోలికి వెళ్ళకుండా ఉంటే అదే పదివేలు అనుకొనే పరిస్థితి నెలకొంది.
దేశవిదేశాలో అత్యంత ప్రసిద్దమైన ఎక్సైడ్ బ్యాటరీస్ వంటి కంపెనీకి గట్టి పోటీ ఇస్తున్న అమర్ రాజా బ్యాటరీస్ ఒక్కటే. చిత్తూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీలలో 15,126 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
తిరుపతి సమీపంలో ఉన్న అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీ 2010లో ఆసియాలో బెస్ట్ అండర్ బిలియన్ కంపెనీలలో ఒకటిగా ఫోర్బ్స్ జాబితాలో నిలిచింది. ఇదే కంపెనీకి 2020లో ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్, సర్వీసులోని ఇంజనీరింగ్ విభాగం కింద మరో ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించింది.
ఇంత మందికి ఉద్యోగాలు కల్పిస్తూ, దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకొన్న అమర్ రాజా బ్యాటరీస్ టిడిపికి చెందిన గల్లా రామచంద్రనాయుడు, గళ్ళ జయదేవ్‌లకు చెందినది కావడమే నేరంగా మారింది. వైసీపీ ప్రభుత్వం దానికి కాలుష్య నియంత్రణ మండలితో ఫిబ్రవరిలో షోకాజ్ నోటీస్ జారీ చేయించింది. దీనిపై ఆ కంపెనీ యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఆ షోకాజ్ నోటీసుపై స్టే విధించడమే కాకుండా తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు అమర్ రాజా బ్యాటరీస్‌పై ఎటువంటి చర్యలు చేపట్టరాదని, దాని జోలికి వెళ్లవద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అధికారంలో ఉన్న వైసీపీ ప్రతిపక్ష టిడిపితో రాజకీయంగా పోరాడాలనుకొంటే ఎంతైనా పోరాడవచ్చు. కానీ దానిని రాజకీయంగా దెబ్బ తీసేందుకు ఆ పార్టీకి చెందిన నేతల ఆర్ధిక మూలాలను దెబ్బ తీసే ప్రయత్నంలో వారి పరిశ్రమలపై ఈవిదంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంటే, ఇక రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు, పెట్టుబడులు రమ్మంటే వస్తాయా?
ఒకవేళ టిడిపి నేతలు స్థాపించిన పరిశ్రమలు రాష్ట్రానికి వద్దనుకొంటే, ప్రస్తుతం తమ ప్రభుత్వమే అధికారంలో ఉంది వైసీపీ నేతలే పెట్టుబడులు పెట్టి రాష్ట్రంలో ఎక్కడికక్కడ పరిశ్రమలు స్థాపించి తమ ప్రభుత్వానికి గొప్ప పేరు తేవచ్చు కదా?



