బీఆర్ఎస్‌ తప్ప మరొకటి ఉండొద్దనుకుంటే…

Telangana political landscape showing BRS dominance and emerging new parties

రాజకీయ పార్టీల స్థాపనకు రకరకాల కారణాలు ఉంటాయి. అవి హేతుబద్దంగా ఉన్నప్పుడు ప్రజలు వాటిని ఆదరిస్తారు… తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం టీడీపి, తెలంగాణ సాధన కోసం బీఆర్ఎస్‌ పార్టీలు ఆవిర్భవించినప్పుడు వాటికి ప్రజలు బ్రహ్మరధం పట్టారు.

మతం ప్రాతిపదికన రాజకీయాలు చేసే మజ్లీస్, బిజేపి వంటి పార్టీలను కూడా ప్రజలు ఆదరిస్తూనే ఉన్నారు. లౌకికవాదానికి కట్టుబడి ఉండే కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారు.

ADVERTISEMENT

సినీ పరిశ్రమ గ్లామర్‌ని సొమ్ము చేసుకోవాలనే ఆశతో వచ్చిన ప్రజారాజ్యం పార్టీని కూడా ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదు. కానీ రాజకీయాలలో నిలబడలేమని షటర్ దించేశారు.

విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటమే ధ్యేయంగా ప్రజారాజ్యం పరుగు నిలిపిన చోటు నుంచే రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన జనసేన, అవమానాలు, ఆటుపోట్లు తట్టుకొని నిలబడినందుకు, రాష్ట్రం పట్ల దాని నిబద్దతని చూసి ప్రజలు ఆదరించారు.

రాష్ట్ర విభజన అనివార్యమని, కనుక సమైక్యాంధ్ర కోసం కాకుండా విభజిత ఏపీ ప్రయోజనాల కోసం పోరాడాలని మాజీ ఐఏఎస్ అధికారి, లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ చెప్పినందుకు ప్రజలు అయన చెంప పగులగొట్టారు.

సమైక్యాంధ్రకి చివరి సిఎంగా చేసిన కిరణ్ కుమార్‌ రెడ్డి, తన అధిష్టానం చెప్పినట్లుగా చకచకా రాష్ట్ర విభజనకు ఏర్పాట్లు చేస్తూనే రాష్ట్ర విభజనని వ్యతిరేకిస్తూ డ్రామా ఆడారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆ డ్రామాతో తనకి మంచి మైలేజ్ వచ్చిందనే గుడ్డి నమ్మకంతో సమైక్యాంధ్ర పార్టీతో వస్తే ప్రజలు చెప్పుతో కొడితే రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వచ్చింది.

రాష్ట్ర విభజనతో ఏపీ, ఏపీ కాంగ్రెస్‌ నష్టపోయినా పర్వాలేదు… తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే చాలనుకున్నందుకు ఏపీ కాంగ్రెస్‌ పార్టీని నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయింది.

దాని సమాధి రాళ్ళతో పునాది వేసుకున్న వైసీపీ వైఎస్సార్ ఆకస్మిక మృతి, ఆ సానుభూతి, ఆయన పేరు, ఫోటో, ఇమేజ్‌తో ప్రజలను ఆకట్టుకోగలిగింది.

అక్రమాస్తుల కేసులో ఆ పార్టీ అధినేత 16 నెలలు జైల్లో గడిపినా ప్రజలు ఆయనకు ఒక్క చాన్స్ ఇచ్చారు. కానీ ఆయన అవినీతిని బయటపెట్టి జైలుకి పంపించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ జై భారత్ నేషనల్ పార్టీతో వస్తే ప్రజలు తిరస్కరించారు. నీతి, నిజాయితీ, విలువల కంటే కుల సమీకరణలు, పార్టీల సీనియారిటీకే ప్రజలు ప్రాధాన్యం ఇచ్చారు.

ఇలా ఒక్కో పార్టీ ఒక్కో కారణం, ఒక్కో ఆలోచనతో పుడుతుంది. వాటిలో ఆటుపోట్లను తట్టుకొని నిలబడగలవి మనుగడ సాగిస్తుంటాయి లేనివి కాలగర్భంలో కలిసిపోతుంటాయి.

తెలంగాణలో ఇప్పటికే మజ్లీస్‌తో కలిపి నాలుగు ప్రధాన పార్టీలున్నాయి. తెలంగాణలో వామపక్షాలు బలంగానే ఉన్నాయి.

అయినా తెలంగాణలో ఇంకా రాజకీయ శూన్యత ఉందని ప్రొఫెసర్ కోదండరాం, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌, తీన్మార్ మల్లన్న, కేఏ పాల్, ఇప్పుడు కల్వకుంట్ల కవిత ఇంకా చాలా మంది భావిస్తున్నారు.

తెలంగాణలో బీఆర్ఎస్‌ పార్టీ తప్ప మరో పార్టీ ఉండకూడదని కేసీఆర్‌ అనుకుంటే ఇప్పుడు అక్కడే పుట్టగొడుగుల్లా కొత్త పార్టీలు పుట్టుకొస్తూనే ఉన్నాయి.

ఏపీలో ఓ వైపు కూటమి, మరో వైపు వైసీపీ మాత్రమే ఉన్నాయి. ఏపీలో వామపక్షాలు ఉన్నా లేనట్లే లెక్క. కానీ ఏపీలో రాజకీయ శూన్యత ఉందని ఎవరూ అనుకోవడం లేదు! ఎందుకంటే కుల సమీకరణాల లెక్కలు పక్కాగా ఉన్నాయి. వాటిని బ్రేక్ చేయలేమని అందరికీ తెలుసు కనుక!

ADVERTISEMENT
Latest Stories