ఏపీలో మంత్రులు వాయి శాఖలకు సంబందించి రోజూ ఏం పనులు చేస్తుంటారో తెలీదు. అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాలలో ఏం అభివృద్ధి పనులు చేస్తున్నారో, ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారో లేదో తెలీదు. కానీ తెల్లారగానే అందరూ టంచనుగా సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌లని విమర్శిస్తూ, ఎద్దేవా చేస్తుంటారని అందరికీ తెలుసు. టిడిపి, జనసేనలు ఏం చేస్తున్నాయో గమనిస్తూ స్పందించడమే వారి రోజువారీ డ్యూటీ అన్నట్లు వ్యవహరిస్తుంటారు.
టిడిపి, జనసేనలు ఏదైనా అంశం మీద మాట్లాడగానే అందరూ వారిపై సోషల్ మీడియాలో మూకుమ్మడి దాడి చేసేందుకు పోటీలు పడుతుంటారు. టిడిపి, జనసేనలు ఏ విషయంపై మాట్లాడినా టక్కున ఘాటుగా, వ్యంగ్యంగా బదులివ్వగల సమర్ధులు వైసీపీ నేతలు. అయితే మూడు అంశాలపై మాత్రం వైసీపీలో ఎవరూ మాట్లాడే సాహసం చేయరు. 1. వివేకానంద రెడ్డి హత్య కేసు, 2. వైఎస్ షర్మిల, 3. రాష్ట్రాభివృద్ధి.
1. వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణని సుప్రీంకోర్టు తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేస్తే వైసీపీలో ఎవరూ కిక్కురుమనలేదు. వివేకా హత్య కేసు గురించి టిడిపి ఎన్ని విమర్శలు చేస్తున్నా, ఎంతగా ఎద్దేవా చేస్తున్నా మౌనంగా భరించేస్తుంటారు తప్ప ఎవరూ సమాధానం చెప్పారు. చెపితే మరిన్ని కొత్త సమస్యలు పుట్టుకొచ్చే ప్రమాదం ఉంటుందని భయం కావచ్చు.
2. వరంగల్ జిల్లా వైఎస్ షర్మిలపై టిఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసి ఆమె కార్వాన్‌కి నిప్పు పెడితే వైసీపీలో ఎవ్వరూ నోరు విప్పలేదు. ఈరోజు హైదరాబాద్‌లో పోలీసులు ఆమెను కారుతో సహా క్రేన్ సాయంతో పోలీస్ స్టేషన్‌కి తరలిస్తున్నప్పుడు, ఆమెపై కేసు నమోదు చేసినప్పుడు, ఆమెను పలకరించడానికి విజయమ్మ బయలుదేరితే పోలీసులు ఆమెను కూడా గృహనిర్బందం చేసినప్పుడు ఏపీ వైసీపీ నేతలు ఎవరూ స్పందించలేదు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే “వైఎస్ షర్మిలకి జరిగిన ఘటనలు చాలా బాధాకరం,” అని జాగ్రత్తగా పదాలు లెక్కబెట్టుకొని చెప్పిన్నట్లు చెప్పి చేతులు దులుపుకొన్నారు. ఆమెకి మద్దతుగా మాట్లాడితే అక్కడ ఆమెకు ఇబ్బందులు పెరిగిపోతాయి. వ్యతిరేకంగా మాట్లాడితే ఇక్కడ ఏపీలో విమర్శలు భరించాల్సి ఉంటుంది. కనుక అందరూ సైలెంట్ మోడ్‌లో ఉండిపోవడమో లేదా తమ ఫేవరెట్ విలన్స్ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌లని విమర్శిస్తూ కాలక్షేపం చేసేస్తుంటారు.
3. ఈ మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో గుంతలు పడిన రోడ్లు, నానాటికీ పెరిగిపోతున్న అప్పులు మాత్రమే కనిపిస్తున్నాయి తప్ప రాష్ట్రాభివృద్ధి శూన్యం. అందుకే రాష్ట్రాభివృద్ధి గురించి మాట్లాడమంటే వైసీపీ నేతలు ఆవు కధ చెప్పుకొన్నట్లు అటు తిప్పి ఇటు తిప్పి సంక్షేమ పధకాల గురించే మాట్లాడుతుంటారు. వారి దృష్టిలో రాష్ట్రాభివృద్ధి అంటే సంక్షేమ పధకాలే. “నైవేద్యం పెట్టక నీరసించిపోయాను కానీ నైవేద్యం పెడితే నా మహిమ చూపిస్తానన్నట్లు, మూడున్నరేళ్ళలో మూడు రాజధానులతో కాలక్షేపం చేసేసిన మమ్మల్ని జనం నమ్మి మరో ఛాన్స్ ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పినా చెప్పవచ్చు.



