తిరుమల నెయ్యి టెండర్లు: ఇందాపూర్ పై ఆరోపణలు, టీటీడీ క్లారిటీ

Tirumala ghee tenders controversy with TTD clarification on Indapur Dairy allegations

తిరుమల నెయ్యి సరఫరా కోసం విడుదల చేసిన కొత్త టెండర్లపై రాజకీయ వివాదం ముదిరింది. వైసీపీ ఆరోపణలు చేస్తుండగా, టీటీడీ మాత్రం అన్ని ప్రక్రియలు పారదర్శకంగా జరిగాయని స్పష్టం చేసింది.

శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఇందాపూర్ డెయిరీకి టెండర్లు ఇచ్చారని, ఆ సంస్థకు హెరిటేజ్ తో సంబంధం ఉందని ఆరోపించారు. రేట్లు పెంచి కట్టబెట్టారని కూడా విమర్శించారు.

ADVERTISEMENT

ఈ ఆరోపణలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు. నెయ్యి కొనుగోళ్లలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

నెయ్యి నాణ్యత కోసం ఎంఆర్‌ఎల్ స్కోర్ బోర్డు విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. అలాగే, సేకరణ పరిధిని 1500 కిలోమీటర్ల నుంచి 800 కిలోమీటర్లకు తగ్గించి క్వాలిటీ పెంచే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు.

ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్‌తో ఎలాంటి యాజమాన్య సంబంధం లేదని స్పష్టం చేశారు. హెరిటేజ్ సంస్థ ఇందాపూర్ నుంచి కేవలం చీజ్ మాత్రమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. గతంలో వైసీపీ ప్రభుత్వం టెండర్లు ఇచ్చిన అమూల్ కూడా ఇందాపూర్ నుంచే కొనుగోలు చేసిందని చెప్పారు.

నందిని డెయిరీని తొలగించారనే ఆరోపణల్ని కూడా టీటీడీ ఖండించింది. అవసరమైన సరఫరా చేయలేమని నందిని తెలిపిన నేపథ్యంలోనే ఇతర సంస్థలకు టెండర్లు ఇచ్చినట్టు పేర్కొన్నారు.

ప్రస్తుతం రెండు టెండర్లు ఇందాపూర్ డెయిరీకి, ఒకటి సంగం డెయిరీకి, రెండు మదర్ డెయిరీకి కేటాయించారని టీటీడీ వెల్లడించింది. అన్ని నిబంధనలు పాటిస్తూ టెండర్ ప్రక్రియ నిర్వహించామని తెలిపింది.

టీటీడీ ప్రకటనల మధ్య వైసీపీ మాత్రం ఆరోపణలను కొనసాగిస్తోంది. దీంతో తిరుమల నెయ్యి టెండర్ల అంశం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది.

ADVERTISEMENT
Latest Stories