కూటమి వైసీపీ ట్రాప్ లో పడిందా.?

Tirumala laddu controversy

ఒక్క లడ్డు ప్రసాదం…చుట్టూ ఎన్నో వివాదాలు, అంతులేని చర్చలు, ఆగిపోనీ విమర్శలు ప్రతి విమర్శలు. ఇలా తిరుమల ప్రసాదం కేంద్రంగా కూటమి – వైసీపీ మధ్య సాగుతున్న ఈ రాజకీయం చూస్తుంటే అధికార కూటమి విపక్ష వైసీపీ ట్రాప్ లో పడిందా.? అన్న సందేహం కలుగుతుంది.

అయితే గతంలో కూడా వైసీపీ ఇలానే టీడీపీ ని తన ట్రాప్ లోకి తెచ్చుకుని బీజేపీ కి టీడీపీ కి ఉన్న రాజకీయ బంధాలను విచ్ఛిన్నం చేసింది. 2019 ఎన్నికలకు ముందు రాష్ట్ర విభజన హామీలో ఒకటైన ‘ప్రత్యేక హోదా’ విషయంలో వైసీపీ, టీడీపీ ని తన రాజకీయ ట్రాప్ లోకి లాగగలిగింది.

ADVERTISEMENT

ఫలితంగా అప్పటి వరకు కలిసి ప్రభుత్వాన్ని నడిపించిన టీడీపీ – బీజేపీల మధ్య హోదా చిచ్చు మొదలయ్యి అది చివరికి 2019 లో వైసీపీ గెలుపు వరకు వెళ్ళింది. ఇక ఆ తరువాత జగన్ బాబాయ్ ‘వైఎస్ వివేకా దారుణ హత్య’ ఘటన లో కూడా వైసీపీ చాల వ్యూహాత్మకంగా టీడీపీ కి ఆ రక్తపు మరకలు అంటించగలిగింది.

ఇక విశాఖలో వైఎస్ జగన్ పై జరిగిన ‘కోడికత్తి’ దాడి కి సైతం టీడీపీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఇలా నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ నాలుగు దశాబ్దాల వయసున్న జగన్ రాజకీయ ట్రాప్ లో చిక్కుకుని ఎప్పటికపుడు రాజకీయంగా ఎదురుదెబ్బలు తింటూనే వస్తుంది.

ఇక తాజాగా ఇప్పుడు ‘తిరుమల కల్తీ’ నెయ్యి అంశంలో కూడా వైసీపీ అదే వ్యూహంతో ముందుకెళ్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. రాష్ట్రంలో రాజధాని పురోగతి నుంచి ఉద్యోగాల కల్పన వరకు, ఐటీ అభివృద్ధి నుంచి క్వాంటం వ్యాలీ నిర్మాణం వరకు ఇలా ప్రభుత్వం సాధించిన ప్రగతి ఎంతో ఉంది.

ప్రభుత్వం ఇలా ప్రజలకు వివరించాల్సిన చాల ముఖ్యమైన అభివృద్ధి అంశాల నుంచి కూటమి ని కల్తీ నెయ్యి వైపుకు వైసీపీ మళ్లిస్తుందా.? ఈ అభివృద్ధి పై ప్రజలలో చర్చ జరిగితే అది వైసీపీ 2.0 కి అత్యంత ప్రమాదమని ఊహించే వైసీపీ ఈ తిరుమల కల్తీ వివాదాన్ని రోజుకో రూపంలో చర్చకు తెచ్చి టీడీపీ అండ్ కో ని తన ట్రాప్ నుంచి బయటకుపోకుండా వ్యూహత్మకంగా అడుగులేస్తుందా.?

అందులో భాగంగానే ‘అంబటి’ ద్వారా కుల రాజకీయాలకు తెరలేపిందా.? ఆ ఏడుకొండలవాడిని చట్టసభలకు తెచ్చి ఈ వివాదాన్ని ఆరని జ్యోతి మాదిరి మండిస్తూనే ఉంటుందా.? ఇక ఇప్పుడు హిందూ – క్రిస్టియన్ అంటూ చట్టసభలలో ప్రభుత్వ పెద్దలు చేసిన, చేస్తున్న ప్రకటనలతో మత రాజకీయాలకు భీజం వేస్తుందా.? ఆ ప్రక్రియలో భాగంగానే భూమన కరుణాకర రెడ్డిని తెరమీదకు తెచ్చిందా.?

భూమన వ్యాఖ్యలతో ఇక ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ మత రాజకీయాలకు అంకురార్పణ చేయబోతున్నట్టు కనిపిస్తుంది. నాడు అంబటి ద్వారా ‘కాపు – కమ్మ’ అంటూ మొదలుపెట్టిన వైసీపీ ఇప్పుడు ‘హిందూ – క్రిస్టియన్’ అంటూ కూటమి పై మరోకొత్త వ్యూహాన్ని సిద్ధం చేసినట్టుంది.

మరి కూటమి వైసీపీ వేస్తున్న ఈ ట్రాప్లలో చిక్కుకుని అటు వైసీపీ కి ఇటు ప్రజలకు సంజాయిషీలు ఇచ్చుకునే స్థాయికి పడిపోతుందా.? లేదా ఆ పద్మవ్యూహాలను ఛేదించి అర్జునుడి మాదిరి బయటపడుతుందా.? అనేది చూడాలి..!

ADVERTISEMENT
Latest Stories