అమెరికా ముందు భారత్‌తో సహా పలుదేశాలు మోకరిల్లాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు. కానీ దాంతో ట్రంప్ అహం సంతృప్తి చెంది ఉండవచ్చేమో కానీ అమెరికాకు కలిగిన లాభం సున్నా!
పైగా ప్రతీసారి విమర్శలు, నవ్వుల పాలవుతూనే ఉన్నారు. సుంకాల నిర్ణయాన్ని అమెరికా సుప్రీంకోర్టు కొట్టేయడమే ఓ తాజా ఉదాహరణ కాదా?
ఇప్పుడు ఇరాన్‌తో యుద్ధం చేస్తూ అమెరికాని ఏకాకిగా మార్చేశారు. ఇరాన్ అధ్యక్షుడుని, ఆయన కుటుంబ సభ్యులను చంపినందుకు ఇంటా, బయటా కొత్త శత్రువులను సృష్టించుకున్నారు. ఇరాన్‌తో యుద్ధం ఏదో రోజు ముగిసిపోవచ్చు. దీనిలో అమెరికా ఘన విజయం పొందవచ్చు కూడా. కానీ ఈ ఒకే ఒక్క యుద్ధంతో ప్రశాంతంగా ఉన్న అమెరికాకు ప్రమాదం తెచ్చిపెట్టారు. అమెరికాలో ‘స్లీపర్ సెల్స్’ ఉండి ఉంటే వాటితో అమెరికన్లకు అనుక్షణం గండమే కదా?
తాను చిటికేస్తే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీకి ఈ భూమ్మీద నూకలు చెల్లిపోయాయని ట్రంప్ గర్వంగా చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు అయన వారసుడు మొజ్తాబా ఖమేనీ ఎక్కడున్నారో కనిపెట్టలేక, అయన ఆచూకీ తెలిపినవారికి 10 మిలియన్ డాలర్లు (భారత్ కరెన్సీలో రూ.93 కోట్లు) బహుమతిగా ఇస్తామని సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇది ఆయనకూ, అమెరికాకు అవమానం కాదా?
రష్యా చమురు డబ్బుని ఉక్రెయిన్ యుద్ధంలో ఖర్చు చేస్తోందంటూ భారత్‌ని ట్రంప్ అడ్డుకున్నారు. కానీ ఇప్పుడే ఆయనే రష్యా నుంచి చమురు కొనుకునేందుకు భారత్‌ని అనుమతించారు!
ఇప్పుడు ఇరాన్ యుద్ధంతో చమురు సంక్షోభం ఏర్పడటంతో రష్యా చమురుకి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ట్రంప్ పుణ్యమాని అదిప్పుడు చమురు అమ్ముకుంటూ భారీగా ఆదాయం సంపాదించుకోగలుగుతోంది. ట్రంప్ కోరుకున్నదేమిటి? జరుగుతున్నదేమిటి? ఇప్పుడు రష్యాకు ఆయనే పరోక్షంగా సాయపడుతున్నారు కదా?
ట్రంప్‌కి దూరదృష్టి లేదనుకోవాలా లేక తన అహం కోసం దేనికైనా సై అంటున్నారనుకోవాలా?
భారత్-అమెరికా దౌత్యనీతి గురించి కూడా ఈ సందర్భంగా రెండు ముక్కలు చెప్పుకోవాలి. ఇప్పుడు రష్యా నుంచి భారత్ మళ్ళీ చమురు కొనుగోలు చేస్తోంది. వద్దన్న ట్రంపే అనుమతించారు. మరోపక్క ఇరాన్ సాయంతో భారత్ చమురు నౌకలు హోర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించి భద్రంగా భారత్ చేరుకుంటున్నాయి.
ట్రంప్ యుద్ధాలు చేస్తున్నా విజయాలు లభించడం లేదు. కానీ భారత్ యుద్ధం చేయకుండానే విజయం సాధిస్తోంది కదా? అటు రష్యా, అమెరికాలతో, ఇటు ఉక్రెయిన్, ఇరాన్‌లతో కూడా భారత్‌కు నేటికీ సత్సంబంధాలున్నాయి. అంటే భారత్ దౌత్యనీతి ముందు అమెరికా యుద్ధనీతి ఓడిపోయినట్లే కదా?




