ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అమెరికా-రష్యా-ఉక్రెయిన్ మద్య జరుగుతున్న స్టోరీలు అందరూ చూస్తూనే ఉన్నారు. వాటితో భారత్‌కు ఎటువంటి సంబంధమూ లేదు. కానీ ట్రంప్ రష్యా చమురుతో భారత్‌కి లంకె వేశారు.
అప్పటి నుంచి ‘సుంకాల ఎపిసోడ్స్’ చాలా నెలలు సాగాయి. అమెరికా నుంచి భారత్ సుమారు రూ.800 కోట్లు పైగా విలువగల ఆయుధాలు కొనుగోలు చేసేందుకు అంగీకరించడంతో ఆ ఎపిసోడ్స్ కొలిక్కి వచ్చినట్లే ఉన్నాయి. కానీ నేటికీ హెచ్-1బీ వీసాల ఎపిసోడ్స్ నడుస్తూనే ఉన్నాయి.
రష్యా అధ్యక్షుడు పుతిన్ రెండు రోజుల పర్యటన కోసం నేడు ఢిల్లీ వస్తున్నారు. ఈ సందర్భంగా రష్యాతో భారత్ రక్షణ ఒప్పందం చేసుకోబోతోంది. అంటే రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయబోతోందన్న మాట!
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయకుండా ట్రంప్ ఆపించేశారు. కానీ భారత్ మళ్ళీ రష్యాతో వందలో వేలో కోట్ల విలువైన ఆయుధాల ఒప్పందం చేసుకుంటే అది ట్రంప్‌కి అసహనం, ఆగ్రహం కలిగించవచ్చు.
కనుక మళ్ళీ భారత్-రష్యా-అమెరికా సంబంధాల సరికొత్త సీజన్… సరికొత్త ఎపిసోడ్స్ మళ్ళీ ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
అప్పుడు ట్రంప్ మళ్ళీ మోడీని, భారత్‌ని తిట్టి పోయొచ్చు. హెచ్-1బీ వీసాలలో కొత్త మెలికలు పెట్టొచ్చు. తర్వాత మళ్ళీ ‘మోడీ నా ఆప్తమిత్రుడు’ అనొచ్చు. వైట్‌హౌస్‌కి ఆహ్వానించి మరికొన్ని ఆయుధ ఒప్పందాలపై ఆయన ఆటోగ్రాఫ్ తీసుకోవచ్చు.
ఆలోగా రష్యా-ఉక్రెయిన్ మద్య రాజీ కుదిర్చేందుకు పుతిన్‌ని ఆహ్వానించినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఎందుకంటే తనకు యుద్ధాలు ఆపడం అంటే చాలా ఇష్టం అని ట్రంప్ స్వయంగా చెప్పుకున్నారు. నోబుల్ శాంతి బహుమతి మిస్ అయిన ట్రంప్ దాని కోసం కాకపోయినా శాంతి స్థాపన కోసం ఆ మాత్రం కష్టపడగలరు కనుక!
ఈ నేపధ్యంలో చూస్తే, ట్రంప్, పుతిన్, మోడీ ముగ్గురికీ ఒకరిపై మరొకరికి ఎటువంటి అభిప్రాయాలున్నాయి? వారి మద్య సంబంధాలు ఎలా ఉన్నాయి? వారు ముగ్గురూ మిత్రులా శత్రువులా?అనే సందేహం కలుగుతుంది. కానీ ముగ్గురూ ఓ ‘క్రాస్ వర్డ్ ఫజిల్’లా మారారని చెప్పవచ్చు. ఈరోజు ఓ ఫజిల్ పూర్తి చేస్తే రేపు మరో కొత్త ఫజిల్ రెడీ చేస్తారు కనుక!






