ప్రకాశం బ్యారేజీ గేట్లు… బోట్లు… కుట్ర జరిగిందా?

Vijayawada Floods Three Boats

గతవారం కృష్ణనది ఉదృతంగా ప్రవహిస్తున్నప్పుడు నదిలో 5 మరబోట్లు కొట్టుకురాగా వాటిలో రెండు, గేట్ల గుండా దిగువకు వెళ్ళిపోయాయి. కానీ మూడు బోట్లు గేట్లని ఢీకొని అక్కడే ప్రవాహానికి అడ్డంగా నిలిచిపోయాయి. అవి ఢీకొనడం వలన రెండు గేట్ల కౌంటర్ వెయిట్స్ దెబ్బ తిన్నాయి.

ADVERTISEMENT

అవి లేకుండా గేట్లు ఆపరేట్ చేయడం సాధ్యపడదు. కనుక అప్పటికప్పుడు కన్నయ్య నాయుడు అధ్వర్యంలో రెండు కౌంటర్ వెయిట్స్ తయారు చేయించి, నది ఉదృతంగా ప్రవహిస్తున్నప్పుడే వాటిని అమర్చారు.

వారం రోజుల క్రితం కృష్ణానది ప్రవాహం 11.43 లక్షల క్యూసెక్కులు ఉండేది. ఇప్పుడది 2 లక్షలకు తగ్గడంతో, ప్రకాశం బ్యారేజీలో 68,69 నంబర్ గేట్లని మూసి వేసి, ఆ మూడు బోట్లని బయటకు తీస్తున్నారు. దీని కోసం ఒక్కోటి 50 టన్నుల సామర్ధ్యం గల రెండు భారీ క్రేన్లను ఉపయోగిస్తున్నారు.

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొనడం యాదృచ్ఛికంగా జరిగినది కాదని, ఇది ఖచ్చితంగా వైసీపి కుట్రే అని హోం మంత్రి అనితా వంగలపూడి సంచలన ఆరోపణలు చేశారు. అందుకు ఆమె బలమైన కారణాలు కూడా చెప్పారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లని ఢీకొన్న మూడు బోట్లలో ఇసుక నింపి ఉందని, మూడు బోట్లు విడిపోకుండా బలమైన తాడుతో కట్టి ఉన్నాయన్నారు.

కనుక ఇసుక నింపిన బరువైన బోట్లతో ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీకొట్టించి విరిగిపోయేలా చేస్తే, విజయవాడని వరద ముంచెత్తుందని వైసీపి నేతలు కుట్ర పన్నారని హోం మంత్రి అనితా వంగలపూడి ఆరోపించారు. ఇప్పటికే పోలీసులు ఆ బోట్ల యజమానులను గుర్తించి, అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారని ఆమె చెప్పారు. వైసీపి ఇటువంటి నీచమైన పనులు చేస్తుందని ఊహించలేకపోయామని హోం మంత్రి అనితా వంగలపూడి అన్నారు.

ఒకవేళ ఆమె ఆరోపించిన్నట్లు దీని వెనుక వైసీపి హస్తం ఉందని తేలితే, నీచ రాజకీయాలకు ఇది పరాకాష్టగా చెప్పుకోవచ్చు. కానీ ఈ ఆరోపణలని నిరూపించలేకపోతే ప్రభుత్వమే నవ్వులపాలయ్యే అవకాశం కూడా ఉంటుందని మరిచిపోకూడదు.

ADVERTISEMENT
Latest Stories