విచారణ పేరుతో మీడియా మొఘల్ రామెూజీ గారిని ఆయన అనారోగ్యంగా ఉన్నా కూడా 5 గంటలు పాటు ప్రశ్నించారు సిఐడి అధికారులు. ఆయన కూడా ఆరోగ్య సమస్యలతో వాయిదా వేసుకునే అవకాశం ఉన్నా సాకులు చెప్పకుండా సర్జికల్ బెడ్ మీద నుంచే విచారణకు హాజరైయ్యారు. కావాలంటే మరోసారైనా విచారణకు రావడానికి సిద్దం అని చెప్పారు. ఆయనకు తన వ్యాపారాల నిబద్దత మీద ఉన్న ధైర్యం అది. తన సంస్థలు నమ్మకం మీద నడుస్తాయి తప్ప సూటేకేస్ కంపనీలు, క్విడ్ క్వో ప్రో వంటి వ్యవహారాలతో కాదని తమ ఖాతాదారులకు స్ప్రష్టమైన సందేశం పంపారు. ఇక రామెూజీ గారి పేరు వింటేనే నేనూ ఉన్నానని వచ్చే మాజీ యంపి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఊహించినట్టే ఎక్కువ వ్యవధి తీసుకోకుండా తెల్లవారేసరికే ప్రెస్ మీట్ పెట్టేసారు. ఎప్పటిలాగానే లాజిక్ తో చెప్పినట్టు మాట్లాడే అతితెలివి ప్రదర్శన, నేను మార్గదర్శి మీద కేసు వేయడంలో తప్పు లేదు అని చెప్పుకునే తాపత్రయం తప్ప ఎలాంటి కొత్త విషయాలు లేకుండానే ప్రెస్ మీట్ ముగించారు.
ఒక్క గంట పాటు ఆయన చెప్పిన విషయాలు చూస్తే, స్ధూలంగా తన కేసుల్లో జగన్ ఇంప్లీడ్ అయ్యాడు కనుక అతనిని విమర్శించను, జగన్ కేసులు, సత్యం కేసులు, అగ్రిగోల్డ్ కేసులు ఒక్కటే. అటు తిప్పి, ఇటు తిప్పి వీటికి సమర్దింపు వాదనలే. గత 17 ఏళ్ళుగా చెప్పినవే. ఆయన చెప్పిన వాదనలో ముఖ్యమైన విషయాలను తర్కిస్తే, “నాకు రెండు పార్టీ లు సమానం, నా కేసుల్లో జగన్ రెడ్డి ప్రభుత్వం తరపున ఇంప్లీడ్ అయ్యారు కనుక కృతజ్ఞత చూపించాలి కానీ అతన్ని ఎందుకు విమర్శించాలి” అంటారు. అంటే మీకు అనుకూలంగా ఉంటే కృతజ్ఞతగా ఉంటారు లేకపోతే కేసులు వేసి నెలకొక సారి ప్రెస్ మీట్ పెట్టి గోల చేస్తారా? అంటే మీ కళ్ళ ముందు ఒక దొంగ మీ పక్కింటిలో దోచుకుని, మీ ఇంటికి రాలేదు కనుక అతన్ని ఏమీ అనను, సాక్ష్యం చెప్పను, కృతజ్ఞత చూపిస్తా అంటారా?
“నేను ఇప్పుడు రాజకీయాల్లో లేను, నేనూ మీలా మామూలు పౌరుడిని, నేనెందుకు ప్రభుత్వాన్ని విమర్శించాలి” అని మరొక మాట. మరి గతంలో ఒక క్వార్టర్ బాటిల్ పట్టుకొని దాని ధర ఇది అంటూ, పోలవరంలో అవనీతి జరిగిపోయిందంటూ, అమరావతిలో అవనీతి అంటూ, ఇలా టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడూ మీరు రాజకీయాల నుంచి విరమించుకున్నాననే చెప్పారు, అప్పుడూ ఏ పదవిలో లేరు? అరి అప్పటికి, ఇప్పటికి తేడా ఏంటి? మీరు భక్తితో ప్రేమించే వైయస్ కుటుంబం అధికారంలో ఉండటమేనా?
“చంద్రబాబును విభజనపై నేను సుప్రీంలో వేసిన కేసులో ఇంప్లీడ్ అవ్వమని కోరినా ఎందుకో ఆయన చెయ్యలేదు, కానీ జగన్ ఇంప్లీడ్ అయ్యారు” అందుకే కృతజ్ఞతగా ఉంటాను అని మరొక మాట. రాష్ట్ర విభజన కోసం ఒక దశాబ్దం ఎలాంటి గొడవలు జరిగాయి, ఒకే జాతి ప్రజల మనస్సుల్లో ఎలాంటి విభజన వచ్చిందో చూసాక ప్రజల పట్ల, సమాజం పట్ల భాద్యత, కాస్త తెలివి ఉన్న ఏ నాయకుడూ చట్ట ప్రకారం విభజన జరిగి, రెండు రాష్ట్రాల్లో చట్టబద్ధమైన ప్రభుత్వాలు ఏర్పడ్డాక ఆ విభజన చెల్లదు అని కోర్టుకు వెళతాడా? కేవలం రాజకీయ ప్రయెూజనాల కోసం పబ్బం గడుపుకునే నాయకులు మాత్రం చేస్తారు. ఆరోజు చంద్రబాబు రెండు ప్రాంతాలకూ న్యాయం చెయ్యాలని పోరాటం చేస్తే, అప్పటి కాంగ్రేసు యంపిగా ఉన్న మీరు ఆయనకు ఎంత మద్దతు ఇచ్చారు? జగన్ రెడ్డి సమైఖ్య ఉద్యమం అంటూ చేసిన డ్రామాలకు అనుగుణంగా విభజన జరగదు అని జనాన్ని నమ్మించి ఆనక దుకాణం సర్దుకుని రాష్ట్రాన్ని నట్టేట ముంచిన పాపంలో సింహ భాగం మీది కాదా? అసలు సుప్రీంకోర్టులో కేస్ వేసా, విభజన ఆపేస్తా అన్నారు, దాని మీద ఒక పుస్తకం కూడా రాసి అమ్మేసుకున్నారు. ఇప్పటి వరకు కనీసం ఉద్యోగుల విభజన సమస్యలు కూడా తీరలేదు. వాస్తవాలు ఇలా ఉంటే అది చెప్పకుండా నేను చెప్తే టీడీపీ కేస్ వెయ్యలేదు, వైసీపీ వేసింది అంటారు ఏంటి? ఎందుకీ ఆత్మ వంచన?
“రామోజీ చట్టానికి అతీతం కాదు, వెంకటేశ్వర స్వామికే ఫైన్ వేసారు. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాలి” అని చెబుతున్నారు. రామెూజీ ఏమైనా నేను చట్టానికి అతీతం అని చెప్పారా? వైయస్ రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఖూనీ కేసులలో, జగన్ రెడ్డి అవినీతి కేసుల్లో న్యాయ పోరాటం చేసినట్టే ఆయన తమ సంస్థల మీద వేసిన కేసుల్లో న్యాయ పోరాటం చేస్తున్నారు. కనీసం జగన్ రెడ్డిలా నేను ముఖ్యమంత్రిని గనుక నేను చట్టానికి అతీతం గనుక నేను కోర్టు విచారణకు రాలేను అని చెప్పలేదు, వయెూభారంతో వచ్చే సమస్యలకు వైధ్యం చేపించుకుంటూనే విచారణకు వచ్చారు. మరి మీరు చెప్పే చట్టానికి అతీతం ఎక్కడ? వైఎస్ రాజారెడ్డి కుటుంబంపై దాదాపు 70 వరకు క్రిమినల్, సివిల్, ఫైనాన్షియల్ ఫ్రాడ్ లాంటి తీవ్ర నేరాలన్నా ఎవరికి శిక్షలు పడ్డాయి? వాళ్ల పంచెన ఎలా బతికారు? వాళ్ల కోసం ఈ ముసుగు పోరాటాలెందుకు? వాళ్ళేమైనా చట్టానికి అతీతమా?
“జస్టిస్ రమణ గారు రామెూజీ గారికి మంచి సంబంధాలున్నాయి కనుక ఆయనతో మార్గదర్శి తప్పు చెయ్యలేదు అని చెప్పించ గలరా అని” అడిగారు. రిటైర్ అయ్యిన జస్టిస్ రమణ గారికి ఈ విషయంతో ఏం సంబంధం? మీరూ లా చదివారు కదా మరి ఏ న్యాయస్ధానం, ఏ జడ్జీ ఇరు పక్షాల వాదనలు వినకుండా, సాక్ష్యాలు పరిశీలించకుండా తీర్పు చెప్పరనే ప్రాధమిక న్యాయ సూత్రం కూడా పట్టించుకోకుండా మీపాటికి మీ కబుర్లు చెప్పారు. మరి వైయస్ ప్రాపకంతో ఎదిగిన కిరణ్ రెడ్డికి వైయస్ కు మంచి సంబందాలున్నా ఆయనే జగన్ రెడ్డి అవనీతిపరుడని కేసులు పెట్టించారు, మీ వాదన ప్రకారం బాగా దగ్గరగా ఉన్న పెద్ద మనిషి చెబితే అది నిజం ఐతే, కిరణ్ రెడ్డి పెట్టిన కేసుల ప్రకారం జగన్ రెడ్డి దోషి అని ఒప్పుకుంటారా?
“మార్గదర్శిలా, అగ్రిగోల్డుకు కూడా ఒక ఆరు నెలలు సమయం దొరికితే ఆస్తులు అమ్మి అప్పులు తీర్చేవారు, అలా దొరకకపోవడం వల్ల ఆ భూములు విలువ రూపాయిది పావలాకు పడిపోయి వాళ్ళు కట్టలేకపోయారని” మరో అడ్డగోలు వాదనతో రెండిటిని ఒకే గాటన కట్టే ప్రయత్నం. అగ్రిగోల్డు తన ఖాతాదారులకు తిరిగి చెల్లించకపోవడం వల్ల వాళ్ళు ఖాతాదారులు పెట్టిన కేసులతో దాని యాజమాన్యాన్ని విచారణ, అరెస్టులు చేసారు. కానీ మార్గదర్శి విషయంలో కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితం, ఒక్క ఖాతాదారుడూ ఫిర్యాదు చెయ్యలేదు, ఆందోళనతో డిపాజిట్లు అడిగిన ప్రతి ఒక్కరికీ నయా పైసాతో సహా చెల్లించారు. కేసుల్లో విచారణ చేసారు, అవకతవకలు, మెూసాలు లేవు గనుక అరెస్టు చెయ్యలేదు. ఇంకొక పచ్చి అబద్దం మార్గదర్శికి టైం ఇవ్వడం వల్ల అప్పులు తీర్చగలిగింది అనేది. మీరు మార్గదర్శి ఫైనాన్స్ ను రాజకీయం చేయడం వల్ల వాళ్లు ఆ వ్యాపారంలో తరువాత డిపాజిట్లు తీసుకోలేదు, ఖాతాదారులందరికీ డబ్బు తిరిగి ఇచ్చేస్తాం అని చెప్పారు, దానికోసం తమ సంస్థలో వాటాలు అమ్మకానికి పెట్టారు, 2016 డిసెంబరులో వాటిని కొనడానికి ముందుకు వచ్చిన బ్లాక్ స్టోన్ కంపనీకి వైయస్ ప్రోద్భలంతో కేంద్రంలో మీ ప్రభుత్వం ఎన్ని రకాల అడ్డంకులు కలిపించి వెనక్కి పంపిన విషయం అప్పటి మీ సహచరులను ఎవరిని అడిగినా కదలు కదలుగా చెబుతారు. చివరికిఏజు సంవత్సరాల తరువాత 2013 లో రిలయన్స్ గ్రూప్ ఈటివి నెట్వర్క్ ని కొనడం నిజంకాదా? మరి ఏడు సంవత్సరాలు మీ ప్రభుత్వం అ సంస్థని ఆర్ధికంగా దిగ్బందనం చేసి, మార్గదర్శికి టైం వచ్చిందని అంత పచ్చి అబద్దాలు ఎలా చెబుతారు?
మీరు కేసు వేసి 20 యేళ్లు అవుతుంది? అప్పటి నుండి కేంద్రంలో నాలుగు ప్రభుత్వాలు మారాయి, ఇంకా రిజర్వ్ బాంక్ కి ఎంత మంది గవర్నర్ లు వచ్చారు? అందులో ఎంత మంది మార్గదర్శి గురించి మాట్లాడారు? అర డజను మంది గవర్నర్ లు గా పని చేస్తే అందులో ఎవరో ఒక రెడ్డి గారు తన పుస్తకంలో రాశారని, దానిని చూపిస్తూ మార్గదర్శిది తప్పని చెబుతున్నారు.ఇలా పనికిరాని వాదనలు తెస్తూ, కాలక్షేపం కబుర్లు చెబుతూ మభ్య పెట్టే రాష్ట్రం ముక్కలు చేశారు కదా? మీ అల్పప్పయెూజనాల కోసం ఇంకెంత నాశనం చేస్తారీ రాష్ట్రాన్ని? గతం లో మీరోసారి చెప్పుకున్నారు నేను వాచ్ డాగ్ ని అని. మరి మీకు ఎప్పుడూ వైయస్ కుటుంబ అవనీతి, అరాచకాలు వాసన రాలేదా లేకపోతే ఆ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసంలో మీరీరోజు చెప్పినట్టు కృతజ్ఞత చూపుకుంటున్నారా?
ఇలా ఈ గంటలో మీరు చెప్పిన ప్రతి విషయం మసిపూసి మారేడుకాయ చేసి వైయస్ కుటుంబం మంచిది, వారి రాజకీయ ప్రత్యర్థులు కూడా చెడ్డవాళ్లు అని మీరు చూపించే తాపత్రయం వెనక మీ కంటూ ఒక గుర్తింపు, ఒక ప్రమోషనల్ వాల్యూ కేవలం రామోజీ రావు ని విమర్శించినప్పుడు మాత్రమే వస్తాయి అనే అతి తెలివి కనపడుతుంది. ఆంధ్ర రాష్ట్ర విభజన లో మీ కంటూ మీరు చూపిన అతి తెలివి కి చెప్పిన మభ్య పెట్టే కథల కి చరిత్ర లో మీకు వున్న స్థానం అగ్రగామి ఆంధ్ర ద్రోహుల లో ఒకరి గా. రెండోది రామోజీ గారి చరిత్ర లో ఒక జోరీగ లా మాత్రమే అని అనుకోవడం లో తప్పు లేదు మీ లాంటి వాళ్ళు ఒక తరానికే కాదు ఆంధ్ర జాతి కే ద్రోహులు



