మద్యం మత్తు మనిషి విచక్షణను చంపేస్తుంది అనేదానికి వరంగల్ లో జరిగిన ఈ ఘటన ఒక ప్రత్యక్ష నిదర్శనం అనే చెప్పాలి. సామాన్య పౌరులు విచక్షణ మరిచి ప్రవర్తిస్తే మందలించాల్సిన పోలీసులే ఈ మద్యం మత్తులో విచక్షణ మరిచి వీధి రౌడీలా ప్రవర్తించడం విస్మయానికి గురిచేస్తుంది.
వరంగల్ ఉర్సుగుట్ట జంక్షన్ వద్ద బెటాలియన్ కానిస్టేబుల్ మనోజ్, విధుల్లో ఉన్న పీఎస్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి మధ్య జరిగిన ఈ వీరంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఉర్సుగుట్ట జంక్షన్ వద్ద ఉన్న ఒక బార్ వద్ద బెటాలియన్ కానిస్టేబుల్ మనోజ్ మద్యం తాగి రోడ్డు మీద న్యూసెన్స్ చేస్తున్నాడు.
అయితే ఈ విషయాన్ని బార్ సిబ్బంది స్థానిక పిఎస్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి కి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న సంతోష్, మనోజ్ ను వారించే ప్రయత్నం చెయ్యగా అందుకు మద్యం మత్తులో ఉన్న మనోజ్ ఏమాత్రం సహకరించకపోవడంతో సంతోష్, మనోజ్ చెంప పగలకొట్టారు.
దీనితో రెచ్చిపోయిన మనోజ్ తిరిగి సంతోష్ పై దాడికి దిగారు. దీనితో స్థానిక బార్ సిబ్బంది, సదరు కానిస్టేబుల్ సంతోష్ కలిసి మనోజ్ ను రోడ్డు మీద కర్రలతో చితకబాదారు. అయితే ఈ ఎపిసోడ్ మొత్తాన్ని స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా ఇప్పుడా వీడియో వైరల్ అవుతుంది.
మద్యం మత్తులో పోలీసులే ఇలా విచక్షణ మరిచి ప్రవర్తిస్తే ఎలా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అలాగే మద్యం మత్తులో ఉన్న సదరు వ్యక్తి పై ఇలా మరో పోలీస్ అధికారే విచక్షణ మరిచి కర్రలతో దాడి చెయ్యడం ఏంటంటూ అటు సంతోష్ రెడ్డి పై కూడా పెదద్ ఎత్తున విమర్శలు ఎదురవుతున్నాయి. ఏదేమైనా పోలీస్ డిపార్ట్మెంట్ కు ఇటువంటి ఘటనలు అప్రదిష్టను తీసుకురావడం మాత్రం ఖాయం.





