ఆంధ్రప్రదేశ్‌లో కోనసీమకు దశాబ్ధాలుగా ప్రత్యేక గుర్తింపు ఉంది. కోనసీమ పేరు తలుచుకోగానే పాడిపంటలతో కళకళలాడే పచ్చటి పల్లెలు కళ్ల ముందు కదలాడుతాయి. కోనసీమలో రాజకీయ చైతన్యం ఎక్కువే అయినప్పటికీ ప్రశాంత వాతావరణం నెలకొని ఉండేది. కనుక ప్రత్యేక జిల్లాగా ప్రకటించడానికి దశాబ్ధాల క్రితం నుంచే కోనసీమకు ఓ ప్రత్యేక గుర్తింపు కలిగి ఉంది.
అటువంటి పచ్చటి కోనసీమలో చిచ్చు రగిల్చింది ఎవరు?అంటే వైసీపీ మంత్రులు అలవాటు ప్రకారం టిడిపి, జనసేనలే అని వాదిస్తున్నారు. అయితే కోనసీమ పేరుతో జిల్లాను ఏర్పాటు చేసిన వైసీపీ ప్రభుత్వం దానికి హటాత్తుగా డా.అంబేడ్కర్ పేరును ఎందుకు జోడించింది?అంటే టిడిపి, జనసేనల వైపున్న బీసీలను ప్రసన్నం చేసుకొని వారిని తమవైపు తిప్పుకోవాలనే ఆలోచనతోనే కదా?
కోనసీమను జిల్లాగా ప్రకటించినప్పుడు ఎవరూ ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు అందరూ స్వాగతించారు కూడా. అయితే జిల్లా పేరును మార్పు చేసినప్పటి నుంచే ప్రశాంతంగా ఉండే కోనసీమలో ఆందోళనలు మొదలయ్యాయి. ఇక్కడ గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆ ఆందోళనకారులలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. కానీ వారు కూడా తమ జిల్లాకు ప్రత్యేక గుర్తింపును ఇస్తున్న కోనసీమ పేరు మాత్రమే చాలని వాదిస్తున్నారు.
తమ హక్కుల కోసం పోరాడిన రాజ్యాంగ నిర్మాత డా.బాబా సాహెబ్ అంబేడ్కర్ అంటే చాలా గౌరవం ఉందని, కానీ ఆయనను గౌరవించుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఆశయాల ప్రకారం నడుచుకొంటే బాగుంటుంది తప్ప ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఆయన పేరును ఇలా వాడుకోవాలనుకోవడం సరికాదని కోనసీమ జిల్లా పరిరక్షణ సమితి వాదిస్తోంది.
కానీ వైసీపీ ప్రభుత్వం వారి అభ్యంతరాలను పట్టించుకోకపోవడంతో నిన్న ప్రశాంతంగా మొదలైన ర్యాలీ అదుపు తప్పి ఈ విధ్వంసానికి దారి తీసింది. ఈ అల్లర్ల వెనక ఎవరున్నారో తెలుసుకొనేందుకు పోలీసులు ఇంకా దర్యాప్తు మొదలుపెట్టక మునుపే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు టిడిపి, జనసేనలున్నాయని ప్రకటించడం గమనార్హం. ప్రభుత్వం ఈవిదంగా భావిస్తోంది కనుక దర్యాప్తు కూడా అదే కోణంలో జరుగుతుందని వేరే చెప్పక్కరలేదు.
ప్రతిపక్షాల సమ్మతితోనే కోనసీమ జిల్లా పేరును మార్చినట్లు మంత్రులే చెపుతున్నారు. కానీ మళ్ళీ అదే నోటితో ఈ అల్లర్ల వెనక ప్రతిపక్షాలే ఉన్నాయని ఆరోపిస్తుండటం ఆశ్చర్యకరం. జిల్లా పేరు మార్పుకు ప్రతిపక్షాలు అంగీకరించినప్పుడు అవి ఎందుకు అల్లర్లను ప్రోత్సహిస్తాయి?
గత మూడేళ్ళుగా వైసీపి రాజకీయ కక్ష సాధింపులతో సతమతమవుతున్న ప్రతిపక్షాలు, ఇటువంటి అల్లర్లను ప్రోత్సహిస్తే తామే సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని వాటికి తెలియదా? ఒకవేళ ఈ అల్లర్ల వెనుక తాము ఉన్నట్లు బయటపడితే తామే రాజకీయంగా నష్టపోతామని, ప్రజల దృష్టిలో చులకన అవుతామని వాటికి తెలియకనే ఈ అల్లర్లను ప్రోత్సహించాయనుకోవాలా? అంటే రాజకీయ జ్ఞానం లేనివారు కూడా కాదనే చెపుతారు.
కనుక ఈ అవాంఛనీయ ఘటనలపై రాజకీయాలు చేస్తూ ప్రతిపక్షాలను దెబ్బ తీయాలని ప్రయత్నించే బదులు కోనసీమ ప్రజల ఆకాంక్షల ప్రకారం నడుచుకొంటే మంచిది కదా?



