తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ విషయంపై కేంద్రమంత్రులు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. టిడిపి కూటమి ప్రభుత్వం ఇప్పటికే దీనిపై విచారణకి ఆదేశించి పలు చర్యలు చేపడుతోంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీని కోసం నేటి నుంచి 11 రోజుల పాటు ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు.
హిందుత్వ అజెండాతో పనిచేసే బీజేపీ ఇటువంటి అస్త్రం దొరికితే ప్రత్యర్ధులపై చెలరేగిపోతుంటుంది. అయితే ఇంత జరుగుతున్నా రాష్ట్రంలో బీజేపీ నేతలకు అసలు ఈ విషయమే తెలియన్నట్లు మౌనంగా ఉండిపోవడం ఆలోచింపజేస్తోంది. ఈ కోణంలో ఆలోచిస్తే కొన్ని సందేహాలు కలుగుతాయి.
· బీజేపీ అధిష్టానానికి నేటికీ జగన్మోహన్ రెడ్డి పట్ల ఎక్కడో మమకారం ఉండటం వలననే రాష్ట్ర బీజేపీ నేతలను ఈ అంశంపై మాట్లాడకుండా కట్టడి చేస్తోందా?
· రాష్ట్రంలో ఎప్పటికైనా జనసేనతో కలిసి అధికారంలోకి రావాలనే ఆలోచన ఉన్నందునే, ఇప్పుడు బీజేపీ వెనక్కు తగ్గి పవన్ కళ్యాణ్ లీడ్ తీసుకునేందుకు ప్రోత్సహించిందా?
· నాడు చంద్రబాబు నాయుడుని జగన్ అరెస్ట్ చేసి జైల్లో పెడితే మౌనంగా ఉండిపోయిన్న జగన్ నిర్ణయానికి పరోక్షంగా మద్దతు ఇచ్చిన్నట్లే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్ దెబ్బ తీస్తుంటే మౌనంగా ఉండిపోయి చంద్రబాబు
నాయుడుకి మద్దతు ఇస్తోందా?
· చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పరస్పరం దెబ్బ తీసుకుని బలహీనపడితే బీజేపీకి మేలు కలుగుతుందని ఎదురుచూస్తోందా?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఏది ఏమైనప్పటికీ మతపరమైన ఇటువంటి అంశంపై ఏపీ బీజేపీ మౌనం వ్యూహాత్మకమే అని భావించవచ్చు.




