ఏబీఎన్ మీడియాలో ‘కొత్త పలుకు’ పేరిట ఏపీలో కల్తీ నెయ్యి, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులపై వచ్చిన కధనం ఆసక్తికరంగా ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ని దోషిగా నిరూపించడం సాధ్యం కాకపోవచ్చని పేర్కొన్నారు.
ఎందుకంటే ఆయన సిఎంగా ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేయమని ఆదేశించే ఏ ఫైలు మీద నేరుగా సంతకం చేయరు. ఎవరికీ నేరుగా ఆదేశాలు జారీ చేసి ఉండరు. కనుక దోషిగా నిరూపించడం కష్టమే అని కొత్త పలుకు పలికారు. ఈ పలుకు సహేతుకంగానే కనిపిస్తోంది.
కాస్త ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళితే, కాళేశ్వరంలో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజ్ క్రుంగిపోయి కళ్ళెదుటే ఉంది. కనుక ఆ ప్రాజెక్టులో అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం ఘోష్ కమీషన్ చేత విచారణ జరిపించి నివేదిక సిద్ధం చేసుకుంది. కానీ దానిలో అనేక ఆర్ధిక, సాంకేతిక అంశాలున్నాయి.
కనుక ఒకవేళ ఈ కేసుతో ప్రభుత్వం కోర్టుకు వెళ్ళినా వాటన్నిటిపై న్యాయస్థానంలో వాదించి అవకతవకలు జరిగాయని నిరూపించడం దాదాపు అసంభవమే. ఈ కేసుతో సమయం, డబ్బు వృధా చేసుకోవడం కంటే నోటీసులు, విచారణ పేరుతో ప్రభుత్వం రాజకీయ అస్త్రంగా వాడుకోవడానికే ఇది బాగా పనికి వస్తుంది.
బహుశః అందుకే కేంద్రం కూడా దీనిపై సీబీఐ విచారణ జరిపించేందుకు ఆసక్తి చూపి ఉండకపోవచ్చు.
కానీ ఫోన్ ట్యాపింగ్ కేసు అటువంటిది కాదు. న్యాయమూర్తులు మొదలు కేసీఆర్ కుమార్తె కవిత వరకు అనేక మంది బాధితులున్నారు. వారి వాంగ్మూలాలు ఉన్నాయి. కాల్ రికార్డ్స్, సాంకేతిక ఆధారాలు ఉన్నాయి. అయినా ఈ కేసులో కూడా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్‌ని టచ్ చేయలేదని వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకు వినిపించారు.
మళ్ళీ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళితే, ఇదివరకు చంద్రబాబు నాయుడుపై కూడా కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ అస్త్రం సందించి దొరికిపోయారు. అప్పుడే ఇది ఎంత ప్రమాదకరమైనదో కేసీఆర్ గ్రహించే ఉంటారు. కనుక మళ్ళీ మరోసారి దానిలో చిక్కుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునే ఉంటారు. ఆర్కే కొత్త పలుకులో ఇదే చెప్పారనుకోవచ్చు.
ఒకవేళ ఆర్కే వాదన నిజమైతే, ఈ కేసు కూడా తెలంగాణ ప్రభుత్వానికి కేవలం ఓ రాజకీయ అస్త్రంగా మాత్రమే ఉపయోగపడవచ్చు.






