హైదరాబాద్ మెట్రో నుంచి ఎల్&టి సంస్థ ఎందుకు తప్పుకుంది?నష్టాలు భరించలేక!దానిని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు తీసుకుంది? మెట్రో విస్తరణ కేంద్రం అనమతి ఇవ్వాలంటే తప్పదు కనుక! క్లుప్తంగా చెప్పుకుంటే ఇంతే!
కానీ దాని దుస్థితికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డిదే అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 2017లో ప్రారంభమైన హైదరాబాద్ మెట్రో, కరోనా, లాక్ డౌన్ కష్టనష్టాలను సైతం తట్టుకొని నిలబడింది.
కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ళకే మూతపడుతోందంటే అది ఆయన ప్రభుత్వానికి, రాష్ట్రానికి కూడా చాలా అప్రదిష్టేనన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి మొండితనం, అనాలోచిత నిర్ణయాలు, దురాశ వల్లనే వెళ్ళిపోతోందని కేటీఆర్ ఆరోపించారు.
తమ హయంలోనే శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో పొడిగించేందుకు కేసీఆర్ శంకుస్థాపన చేస్తే, రేవంత్ రెడ్డి రాగానే పనులు నిలిపివేశారు. ఎల్&టి ఎంత మొత్తుకున్నా రేవంత్ రెడ్డి అంగీకరించకపోవడంతో ఈ సమస్య మొదలైందన్నారు.
1. ఎల్&టి కంపెనీకి రేవంత్ రెడ్డి పొగపెట్టి పారిపోయేలా చేయడానికి కేటీఆర్ రెండు కొత్త కారణాలు చెప్పారు. కాళేశ్వరంతో తమకు చాలా మంచి పేరు లభిస్తునందునే, పిల్లర్లు క్రుంగిపోయానే వంకతో రేవంత్ రెడ్డి దానిని పాడుపెట్టేశారు. కానీ ఎల్&టి కంపెనీ వాటిని మరమత్తు చేయడానికి సంసిద్దత వ్యక్తం చేసింది. ఇది రేవంత్ రెడ్డికి ఆగహ్రం కలిగించి ఉండవచ్చన్నారు కేటీఆర్.
2. తమ ప్రభుత్వ హయంలో హైదరాబాద్ మెట్రో నిర్వహణ ఖర్చుల నిమిత్తం ఎల్&టి కంపెనీకి నగరంలో 269 ఎకరాలు ఇచ్చింది. వేలకోట్లు విలువైన ఆ భూములపై రేవంత్ రెడ్డి కన్ను పడింది. వాటిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని దురాలోచనతోనే ఎల్&టి కంపెనీకి పొగపెట్టి పంపించేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
కనుక కాళేశ్వరం ప్రాజెక్టుని పాడుబెట్టేసినట్లే ఏదో రోజు హైదరాబాద్ మెట్రోని కూడా రేవంత్ రెడ్డి మూయించేస్తారని కేటీఆర్ ఆరోపించారు.
కారణాలు ఏవైనప్పటికీ హైదరాబాద్ మెట్రో నుంచి ఎల్&టి కంపెనీ తప్పుకోవడం లేదా తప్పుకునేలా చేయడం వలన తెలంగాణ ప్రతిష్ట మంట కలిసిపోతుందని కేటీఆర్ ఆరోపించారు. సిఎం రేవంత్ రెడ్డి ఈవిదంగా పారిశ్రామిక వేత్తలను వేధిస్తూ ఒకటొకటి మూతపడేలా చేస్తుంటే ఇక రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ముందుకు వస్తారని కేటీఆర్ ప్రశ్నించారు.






