ఏ రాష్ట్రంలోనైనా అవినీతి కేసుల్లో చిక్కుకున్న ప్రభుత్వ ఉద్యోగులపై వెంటనే సస్పెన్షన్, విచారణ, శిక్షలు అమలవుతుంటాయి. కానీ ఇదే నియమాలు మన రాజకీయ నాయకులకు వర్తించవు.
అధికారంలో ఉన్నవారికి అవినీతికి లైసెన్స్ లభించడమే కాకుండా పాత అవినీతి కేసుల నుంచి పూర్తి మినహాయింపు కూడా లభిస్తుంది. “ప్రతిపక్ష నేతలపై కూడా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వెంటనే ‘రాజకీయ కక్ష’ అంటూ అరుపులు మొదలవుతాయి.”
కేసులు నమోదు చేస్తే అది రాజకీయ కక్ష సాధింపేనంటూ వితండవాదం మొదలుపెడతారు. అరెస్ట్ చేస్తే సానుభూతి ఓట్లు రాల్చుకుంటారు. అంతేకాదు… అవినీతికి పాల్పడినవారే తమని అరెస్ట్ చేసుకోమని సవాళ్ళు విసురుతుంటారు. కానీ రాజకీయ లాభనష్టాల లెక్కల కారణంగా వారిని అరెస్ట్ చేయలేని నిసహాయ స్థితిలో ఉన్నాయి మన ప్రభుత్వాలు.
ఒకవేళ కేసులు నమోదు చేసినా అవి ఏళ్ళ తరబడి సాగుతుంటాయే తప్ప ఎవరికీ శిక్షలు పడవు. ఇదంతా విజయవంతంగా అమలవుతున్న ఓ రాజకీయ ఫార్ములాగా మారిపోయింది. కనుక అధికారంలో ఉన్నవారు విచ్చలవిడిగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు.
ఉదాహరణకు జగన్ అక్రమాస్తుల కేసులు, వివేకా హత్య కేసు, ఏపీలో మద్యం కుంభకోణం కేసు, పరకామణి ఇలా చెప్పుకుంటూపోతే ఒక్క ఏపీ జాబితాలో కనీసం ఓ 40-50 కేసులు కనిపిస్తాయి. ఇదేవిధంగా తెలంగాణ జాబితాలో ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఎఫ్-1 రేసింగ్ తదితర కేసులున్నాయి.
ఈ కేసుల విచారణ పేరుతో ఏళ్ళ తరబడి రాజకీయ కాలక్షేపం సాగుతుంది. తప్ప ఏ కేసులో ఎవరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోలేరు.
“ఇది ‘రాజకీయ సంస్కృతి’ మారిందా? లేక వ్యవస్థలు బలహీనపడ్డాయా?” లేదా మన ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థలు, దర్యాప్తు సంస్థల అసమర్ధత, నిస్సహయత అనుకోవాలా?
సామాన్య ప్రజలు పొరపాటున ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే జరిమానా వసూలు చేస్తారు. విద్యుత్ బిల్లు, ఇంటి పన్ను చెల్లించడం ఆలస్యమైతే వడ్డీలు, జరిమానాలు వసూలు చేస్తారు.
నిరుపేద ప్రజలు తప్పుడు పనులు చేయడం ఇష్టం లేక కుటుంబాన్ని పోషించుకోవడానికి తోపుడు బళ్ళపై అమ్ముకుంటే వారినీ వేదిస్తుంటారు.
కానీ రాష్ట్రాలకు, దేశానికి ధర్మకర్తలుగా, ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ నాయకులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు.
వారు అవినీతికి పాల్పడ్డారని తెలిసి ఉన్నప్పటికీ వారికే పోలీసులు భద్రత లభిస్తుంది. వారికే సమాజంలో గౌరవమర్యాదలు లభిస్తాయి. వారే ప్రజలను పాలిస్తుమ్తారు. వారినే ప్రజలు మళ్ళీ మళ్ళీ ఎన్నుకోవలసివస్తోంది.
వారి ధీమాకు రెండు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. మన వ్యవస్థలు దాదాపు నిర్వీర్యంగా మారడం. 2. అవినీతి వ్యవస్థీకృతం అవడం. అందువల్లే రాజకీయ నాయకులకు చట్టం, కేసులు, శిక్షలు అంటే భయం పోయిందని చెప్పవచ్చు.
పాలకులు, రాజకీయ నాయకులు ఈవిధంగా తయారవడం వల్లనే ప్రజలకు ఈ ప్రభుత్వాలపై, వ్యవస్థలపై నమ్మకం రాన్రాను సన్నగిల్లుతోంది.
కానీ ప్రజల సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది. పాలకులు, ప్రతిపక్ష నాయకులు ఇలాగే చెలరేగిపోతుంటే ఏదో రోజు ప్రజలు తిరగబడటం ఖాయం.
బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక తదితర దేశాలలో జరిగిన ప్రజా తిరుగుబాట్లు అందరం చూశాము. కనుక ప్రజలు మేల్కొనేలోగానే రాజకీయ నాయకులు కూడా మేల్కొనడం మంచిది.
“ప్రజలు ఎప్పటికైనా మేల్కొంటారు. ఆ రోజు వచ్చినప్పుడు లెక్కలు రెండు కాదు, ఒకటే – ప్రజల తీర్పు. ఆ తీర్పు ముందు పెద్ద పెద్ద నాయకులకూ దిక్కూ దిశా కనబడదు.”






