దేశ, రాష్ట్ర భవిష్యత్ యువతపైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా నేటి తరం యువత అన్ని రంగాలలో దూసుకుపోతున్నారు. కన్నవారికీ, రాష్ట్రానికి, దేశానికి మంచిపేరు తెస్తున్నారు.
కానీ అందరూ అలా ఉండరు. కొందరు దొంగతనాలు, దోపిడీలు, చైన్ స్నాచింగ్, హత్యలు, మానభంగాలు చేస్తూ సమాజానికి చీడపురుగుల్లా తయారవుతారు. అలాంటి ఇద్దరు యువకులే వీరిద్దరూ. ఓ వృద్ధుడు పెన్షన్ సొమ్ముని కొట్టేసి పారిపోయారు.
ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగింది. అమలాపురం మండలం కొంకాపల్లికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు చవటపల్లి సత్యనారాయణ (80) బ్యాంకు నుంచి రూ.20,000 పెన్షన్ సొమ్ము విత్ డ్రా చేసి ఇంటికి చేరుకున్నారు.
ఇద్దరు యువకులు బ్యాంకు నుంచి ఆయనను బైక్‌పై ఫాలో అవుతూ ఇంటి వరకు వచ్చారు. వారిలో ఒకడు వీధి చివర దిగిపోయి నడుచుకుంటూ వస్తుంటే, మరొకడు ఆ వృద్ధుడి ఇంటి గేటు ముందు బైక్‌పై నుంచి పడిపోతున్నట్లు నటించాడు.
ఇంట్లోకి వెళుతున్న ఆయన సాయం కోరాడు. వారు తన పెన్షన్ కాజేసేందుకు వచ్చిన దొంగలని తెలియక ఆయన వెళ్ళి బండి పైకి లేపేందుకు ఆ యువకుడికి సాయం పట్టారు.
ఆయన అలా వంగి ఉన్న సమయంలో నడుచుకుంటూ వచ్చిన రెండో యువకుడు ఆయన జేబులో నుంచి పెన్షన్ సొమ్ము కొట్టేశాడు! ఆ తర్వాత ఇద్దరూ బైక్‌పై అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
వారు వెళ్ళిన తర్వాత ఆ వృద్ధుడు జేబులో చూసుకుంటే డబ్బు లేదు. అప్పుడు కానీ ఆయనకు వారు దొంగలని అర్థం కాలేదు. ఆయన స్థానిక పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. వృద్ధుడి ఇంటి ముందున్న సిసి కెమెరాలలో రికార్డ్ అయిన వీడియో ఫుటేజ్ ఆధారంగా ఆ ఇద్దరు దొంగలను గుర్తించి వారి కోసం గాలిస్తున్నారు.
వయసులో ఉన్న యువకులు ఈవిధంగా దొంగతనాలు ఎందుకు చేస్తున్నారు? అదీ వృద్ధులనే కనికరం లేకుండా? అంటే ‘ఈజీ మనీ’ కోసమే అనుకోవాల్సి ఉంటుంది.
ఈరోజుల్లో ఉద్యోగాలు సంపాదించుకోవడం కంటే ఇలా సులువుగా డబ్బు సంపాదించడం మేలని వారు అనుకుని ఉండవచ్చు. లేదా వ్యసనాలు, విలాసాల కోసం కావచ్చు.
కానీ పనిచేసి సంపాదించుకోగల శక్తి, సామర్ధ్యం, వయసు అన్నీ ఉన్న యువత ఇలాంటి అడ్డు దారులు తొక్కుతుండటం చాలా ఆందోళనకరమే!
అంబేద్కర్ కోనసీమ:
అమలాపురంలో వృద్ధుడిని మోసగించి ఇరవై వేల రూపాయల పెన్షన్ సొమ్ము చోరీ చేసిన ఇద్దరు యువకులు…బ్యాంక్ నుండి పెన్షన్ సొమ్ము ఇరవై వేలు విత్ డ్రా చేసి ఇంటికి చేరుకున్న అమలాపురం మండలం కొంకాపల్లికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు చవటపల్లి సత్యనారాయణ (80)…
బ్యాంక్ నుండి… pic.twitter.com/I5ZyI6n6B8
— NTV Telugu (@NtvTeluguLive) March 5, 2026




