సాక్షి వాళ్ళది కాదట… రేపు వైసీపి మాది కాదంటారా?

sakshi-media-tv-building

జగన్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన కుటుంబానికి చెందిన సాక్షి మీడియాకు ఆర్ధిక లబ్ధి కలిగేలా చేశారని టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆరోపించేది. సంక్షేమ పధకాల ప్రకటనల పేరుతోనే సాక్షి మీడియాకు వందల కోట్లు ముట్టజెప్పారు.

అదీ సరిపోదన్నట్లు సాక్షి పేపర్ అమ్మకాలు పెంచేందుకు వాలంటీర్లకి నెలకి రూ.200 చొప్పున చెల్లించింది. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాలలో, వైసీపి కార్యాలయాలలో సాక్షి పేపర్ తప్పనిసరి.

ADVERTISEMENT

నష్టాలలో కూరుకుపోతున్న సాక్షి మీడియా జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోగానే ఈవిదంగా మంత్రదండం తిప్పిన్నట్లు లాభాలలోకి వచ్చేసింది.

తాజా మంత్రివర్గ సమావేశంలో ఇదే అంశంపై చర్చించి, విచారణకు ఆదేశించాలని నిర్ణయించగానే, సాక్షి మీడియాతో వైఎస్ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని, జగన్‌ సతీమణి వైఎస్ భారతి సాక్షి మీడియాకి ఛైర్ పర్సన్‌, డైరెక్టర్‌ కాదని సాక్షి తేల్చి చెప్పేసింది.

నేటి సాక్షి ఆన్‌లైన్‌ ఎడిషన్‌లో ‘సాక్షిపై చంద్రబాబు అక్కసు’ పేరుతో ఓ కధనం ప్రచురించింది. దానిలో వైఎస్ భారతి సాక్షి మీడియాకి ఛైర్ పర్సన్‌, డైరెక్టర్‌ కాదని చెప్పేసింది. చంద్రబాబు నాయుడు కేవలం అక్కసుతోనే సాక్షి మీడియాపై బురద జల్లెందుకు ప్రయత్నిస్తున్నారని దానిలో పేర్కొంది.

ఏబీసీ మార్గ దర్శకాల ప్రకారమే జగన్‌ ప్రభుత్వం అన్ని పత్రికలకు ప్రకటనలు ఇచ్చిందని వాటిలో సాక్షికి గత 5 ఏళ్ళలో రూ.371 కోట్లు, ఈనాడుకి రూ.243 కోట్లు లభించాయని పేర్కొంది. అంటే జగన్‌ హయాంలో సాక్షి మీడియాకి రూ.371 కోట్లు లబ్ధి కలిగిందని సాక్షి స్వయంగా అంగీకరిస్తోందన్న మాట.

అయితే సచివాలయాలు, వాలంటీర్ల పేరుతో సాక్షి అమ్మకాలు పెంచేందుకు జగన్‌ ప్రభుత్వం ఎందుకు ప్రజాధనం ఖర్చు చేసింది?అనే ప్రశ్నకు ఆ కధనంలో సమాధానం లేదు. అందుకోసం జారీ చేసిన జీవోల ప్రస్తావన కూడా లేదు.

కానీ ఇప్పుడు ఈ వ్యవహారంపై ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తోందని తెలియగానే సాక్షితో జగన్‌ కుటుంబానికి ఎటువంటి సంబందమూ లేదనే కొత్త విషయం చెపుతోంది. సాక్షి మీడియాని స్థాపించిందే జగన్మోహన్‌ రెడ్డి అని, దానికి ఆయన సతీమణి ఛైర్ పర్సన్‌ అని అందరికీ తెలుసు. నేటికీ సాక్షి కూడా జగన్‌, వైసీపిల ఆత్మసాక్షిగానే వ్యవహరిస్తోంది కదా?సాక్షితో జగన్‌ కుటుంబానికి సంబందం లేకపోతే మరెందుకు దానికి అంతగా లబ్ధి కలిగించారు?

ఇప్పుడు జగన్, భారతి దంపతులకు సాక్షితో సంబందం లేదని చెపుతున్నప్పుడు, రేపు వైసీపి చిక్కులో పడితే దాంతో కూడా తమకి సంబంధం లేదని తప్పుకుంటారా?

ADVERTISEMENT
Latest Stories