అవును బీసీలు వైసీపీకి బ్యాక్ బోనే… జగన్‌ చెప్పేశారు!

YS-Jagan-BC-Welfareఇంతకాలం సంక్షేమ పధకాలను నమ్ముకొన్న వైసీపీ ప్రభుత్వానికి హటాత్తుగా బీసీల మీద ప్రేమ పుట్టుకువచ్చి ‘జయహో బీసీ’ అంటూ ఈరోజు విజయవాడలో భారీ బహిరంగసభ నిర్వహిస్తోంది. ఈ సభలో ప్రసంగించిన సిఎం జగన్మోహన్ రెడ్డి బీసీల గురించి తన మనసులో మాట చెప్పేశారు.

“బీసీ లంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు… బ్యాక్ బోన్ క్లాస్. బీసీలంటే వెనుకబడిన కులాలు కావు… వెన్నెముకగా నిలిచే కులాలు. బీసీ అంటే శ్రమ… పరిశ్రమ. నా మనసులో మీరు… మీ అందరి మనసుల్లో నేను,” అంటూ బీసీలకు తమ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తోందో, వారి కోసం ఎన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందో సిఎం జగన్‌ చెప్పుకొచ్చారు. కనుక తమ కంటే మరే పార్టీ బీసీలను ఉద్దరించలేదు కనుక వచ్చే ఎన్నికలలో వైసీపీకే ఓట్లు వేయాల్సిన బాధ్యత మీకుందని గుర్తుచేశారు.

ADVERTISEMENT

బీసీలంటే బ్యాక్ బోన్ అని సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన మనసులో మాట అక్షరాల వాస్తవం. రాష్ట్ర జనాభాలో 50 శాతం ఉన్న వారు ఏ పార్టీకి అండగా నిలబడితే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. కనుకనే వారు తమ పార్టీకి వెన్నెముకగా నిలవాలని బహిరంగంగానే విజ్ఞప్తి చేశారు. అంటే ఓ పక్క జయహో బీసీలు అంటూనే వారిని తమ పార్టీకి ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని సిఎం జగన్‌ తాపత్రయపడుతున్నట్లు అర్దమవుతోంది.

వైసీపీకి బీసీల మీద హటాత్తుగా ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చిందంటే, వారు టిడిపి, జనసేనలవైపుకి మొగ్గుచూపుతారనే భయం కావచ్చు లేదా టిడిపి, జనసేనలు వారిని తమవైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నందున కావచ్చు. ఒకవేళ ఆ రెండు పార్టీలు బీసీలకు దూరంగా ఉండి ఉంటే, వైసీపీ కూడా నేడు జయహో బీసీ అంటూ హడావుడిగా ఈ సభ నిర్వహించేదే కాదని చెప్పవచ్చు.

తమ ప్రభుత్వంలో బీసీలకు మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఛైర్మన్‌ పదవులు ఇచ్చి వారిని గౌరవించామని సిఎం జగన్‌ గర్వంగా చెప్పుకొన్నారు. నిజమే. అయితే పదవులు పొందిన సదరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీసీల కోసం సంక్షేమ పధకాలు తప్ప ఏం చేశారు? ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించారు?ఎంతమంది తమ కాళ్ళపై తాము నిలబడేలా చేశారు?అంటే సమాధానం దొరకదు.

అందుకే పవన్‌ కళ్యాణ్‌ ఇటీవల మంగళగిరిలో బీసీ నేతలతో సమావేశమైనప్పుడు, “మీలో ఒకరో ఇద్దరో పదవులు పొంది బాగుపడినంత మాత్రన్న మీరందరూ బాగుపడినట్లు కాదు కనుక మీలో వీలైనంత ఎక్కువమంది నేతలుగా ముందుకు వస్తే మీకు కావాల్సినవి మీరే సాధించుకోవచ్చు. ఎవరినీ ప్రాధేయపడక్కర లేదు. బీసీలందరూ సంఘటితంగా నిలిచి మీకు మేలు చేస్తారనుకొనే వ్యక్తులనే ముందు నిలబెట్టి వారినే గెలిపించుకోండి తప్ప ఇప్పటికే పదవులు, అధికారం అనుభవిస్తూ వేలకోట్లు ఆర్జించుకొని విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నవారిని కాదు,” అని స్పష్టంగా చెప్పారు.

కనుక జయహో బీసీ అని నినాదాలు చేసినందుకో లేదా పదవులు చేపట్టి మరొకరి చెప్పుచేతల్లో విధేయంగా మెసులుకొనే వారినో ఎన్నుకొన్నా బీసీలకు ఎటువంటి ప్రయోజనం ఉండదు.

ADVERTISEMENT
Latest Stories