న్యాయరాజధాని గురించి కర్నూలు సభలో మాట్లాడగలరా?

YS Jagan Kurnool Judicial Capital

మూడు రాజధానులలో భాగంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి న్యాయ రాజధానిగా చేస్తాం… దాంతో సీమ జిల్లాలన్నీ అభివృద్ధి చెందుతాయంటూ ఇంతకాలం వైసీపి ప్రభుత్వం సీమ ప్రజలను మభ్యపెట్టింది. కానీ ఆ తర్వాత మార్చిలో జరిగిన పారిశ్రామిక వేత్తల సదస్సులో ‘త్వరలో విశాఖ షిఫ్ట్ అయిపోతున్నాను. ఇక్కడి నుంచే రాష్ట్రాన్ని పాలిస్తానని’ జగన్‌ చెప్పారు. తర్వాత ‘దసరాకి విశాఖ వస్తున్నా’ అని చెప్పారు. ఇప్పుడు డిసెంబర్‌లో వస్తారని చెప్పించి ఈ ఏడాదికి విశాఖ రాజధాని కధ ముగించేశారు.

ADVERTISEMENT

ఒకవేళ వైసీపి ప్రభుత్వానికి కర్నూలుని న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలనే చిత్తశుద్ధి ఉండి ఉంటే, హైకోర్టు తరలింపుకు కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టుల అనుమతి పొందేందుకు ప్రయత్నించి ఉండేది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టి ఉండేది. కానీ అవేమీ చేయకుండా వైసీపి నేతలే ప్రజలను రెచ్చగొట్టి ర్యాలీలు చేయించడం అందరూ చూశారు.

కనుక ఈరోజు కర్నూలులో బటన్ నొక్కుడు సభకు వస్తున్న సిఎం జగన్‌ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని ధైర్యంగా చెప్పగలరా?అంటే అసలు ఆ ప్రస్తావనే రాకుండా పవన్‌ కళ్యాణ్‌ మూడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతారేమో?

మూడు రాజధానుల కధలో ‘మూడు’ సైలంట్ అనే విషయం అర్దం కావడానికి జనాలకు చాలా సమయం పట్టింది. మళ్ళీ దానిలో ‘అమరావతి సైలంట్’ అనే విషయం మొదటే తేల్చి చెప్పేసింది. ఇప్పుడు విశాఖ రాజధాని విషయంలో కూడా సైలంట్ అంటే జనాలకు, ప్రతిపక్షాలకు సంజాయిషీలు చెప్పుకోవడం చాలా కష్టం. కనుకనే విశాఖలో హైవే విస్తరణ, ఫ్లైఓవర్లు నిర్మాణం అంటూ హడావుడి చేస్తోంది.

అంటే విశాఖను రాజధాని చేయాలంటే ముందుగా నగరాన్ని అందుకు తగ్గట్లుగా అభివృద్ధి చేయాలని గుర్తించిన్నట్లే కదా?మరి ఈ నాలుగున్నరేళ్ళలో ఈ పనులన్నీ పూర్తిచేయవచ్చు కదా?కానీ ఎందుకు చేయలేదు?అంటే వైసీపి దృష్టిలో విశాఖ రాజధాని అనేది ఓ రాజకీయ ఎత్తుగడ మాత్రమే కనుక. ఈ ప్రతిపాదనతో ఉత్తరాంధ్ర ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకొనేందుకే కనుక.

అయినా విశాఖకు మకాం మార్చడానికే జగన్‌ వెనకాడుతున్నప్పుడు ఇక విశాఖ నుంచి రాష్ట్రాన్ని ఎలా పాలించగలరు?అని ఆలోచిస్తే వాస్తవ పరిస్థితి ఏమిటో అర్దమవుతోంది.

కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకి చర్యలు చేపట్టకుండా, విశాఖలో రాజధాని ఏర్పాటుకి నగరాభివృద్ధి చేయకుండా నాలుగున్నరేళ్ళు వైసీపి ప్రభుత్వం కాలక్షేపం చేసేసింది. కనుక కనీసం ఇప్పటికైనా ఈ డ్రామాలన్నీ కట్టిపెట్టి అమరావతిని రాజధానిగా ఒప్పుకొని నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేయాలని సీపీఐ రామకృష్ణ హితవు పలికారు. కానీ హితోక్తులు వినే పరిస్థితిలో వైసీపి ప్రభుత్వం ఉందా?

ADVERTISEMENT
Latest Stories