ఈరోజు విజయవాడలో వైసీపీ అధ్వర్యంలో జరిగిన జయహో బీసీ మహాసభలో సిఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ల నామస్మరణ చేసుకొని వారిపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు రాజకీయ అనుభవమంత వయసున్న తాను ఒంటరిగా పోటీ చేస్తుంటే, నేటికీ చంద్రబాబు నాయుడు ఒంటరిగా పోటీ చేస్తానని ధైర్యంగా చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. తన పార్టీ, మ్యానిఫెస్టో ఆత్మ బీసీలదే అని, వారికీ జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారం కల్పించి న్యాయం చేశానని చెప్పారు.
బడుగు బలహీనవర్గాల సాధికారత కోసం రూ. 3,19,228 కోట్లు ఈ మూడున్నరేళ్లలో ఖర్చు చేశామని చెప్పారు. బీసీలకు మేలు చేయబోతే చంద్రబాబు నాయుడు కోర్టులలో కేసులు వేయించి అడ్డుపడుతున్నారని సిఎం జగన్ ఆరోపించారు. తమ హయాంలో బీసీలకు ఏం చేశారో చెప్పలేకనే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, తన బాకా మీడియా అండతో ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారని సిఎం జగన్ ఆరోపించారు. అయితే వారు ఎన్ని మాయలు చేసినా చంద్రబాబు నాయుడుకి ఇవే చివరి ఎన్నికలని సిఎం జగన్ అన్నారు.
ఇప్పుడు వాస్తవాలను పరిశీలిస్తే, టిడిపి హయాంలోనే తొలిసారిగా బీసీలకి రాజ్యాధికారం దక్కిందనే విషయం అందరికీ తెలుసు. అంతేకాదు… వారికి ఏదో మొక్కుబడిగా మంత్రి పదవులు అప్పగించి, సిఎం జగన్మోహన్ రెడ్డిలాగా అధికారాలన్నీ తన వద్ద పెట్టుకోకుండా చంద్రబాబు నాయుడు వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు కూడా. కానీ వైసీపీ ప్రభుత్వంలో కీలకపదవులన్నీ రెడ్డి సామాజికవర్గానికే కట్టబెట్టారు. చివరికి టీటీడీలో కూడా వారితోనే నింపేశారు.
ఇక సంక్షేమ పధకాల పేరుతో రూ. 3,19,228 కోట్లు ఈ మూడున్నరేళ్లలో పంచిపెట్టేశామని సిఎం జగన్ గర్వంగా చెప్పుకొన్నారు. సంతోషమే! కానీ అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా వారి జీవితాలలో మార్పు వచ్చిందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే నేటికీ సంక్షేమ పధకాల సొమ్ము కోసం అందరూ ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నారు. అదే… రూ.3,19,228 కోట్లతో అనేక విద్యాసంస్థలు, ఆసుపత్రులు, చిన్నా,పెద్ద, భారీ పరిశ్రమలు, ఐటి కంపెనీలు ఏర్పాటు చేసి ఉండి ఉంటే, వారందరికీ శాస్వితంగా మేలు కలిగి ఉండేది. వారి జీవితాలలో తప్పక గుణాత్మక మార్పు కనబడేది.
కానీ వారు బాగుపడాలని కాక వారి ఓట్లు వైసీపీకే వేయాలనే ఆలోచనతో డబ్బులు పంచడం వలన అన్ని లక్షల కోట్లు ఎట్లో పిసికిన చింతపండు అయ్యింది. కానీ సంక్షేమ పధకాల కోసం చేసిన, ఇంకా చేస్తున్న అప్పులు, వడ్డీల భారం మిగిలిన ప్రజలతో పాటు లబ్ధిదారులు కూడా మోయక తప్పడం లేదిప్పుడు.
వైసీపీకి 175 సీట్లు వచ్చేస్తాయని సిఎం జగన్ నమ్మకంగా చెప్పుకొంటున్నప్పుడు టిడిపి ఒంటరిగా పోటీ చేస్తేనేమీ, జనసేనతో పొత్తులు పెట్టుకొని పోటీ చేస్తేనేమి?ఒక్క ఛాన్స్ ఇస్తేనే ప్రభుత్వోద్యోగులకు, ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు కూడా చెల్లించలేని దుస్థితి ఏర్పడింది. మరో ఛాన్స్ ఇస్తే ఏమవుతుందో వారూ భయపడుతున్నారు. కనుక వచ్చే ఎన్నికలు ఎవరికి చివరి ఎన్నికలవుతాయో తెలుసుకోవాలని ఆతృతగా ఉంటే ముందస్తుకి వెళ్ళిపోవడమే మంచిది. ఎందుకంటే వైసీపీకి 175 సీట్లు వచ్చేస్తాయనే నమ్మకం ఉంది కదా?



