వైసీపీలో అందరూ అమరావతే కోరుకొంటున్నారేమో?

YS_Jagan_YSRCP_Ministers_MLAతెలుగులో ఏ ఎండకు ఆ గొడుగు… ఏ రోటికాడ ఆ పాట… అనే నానుడులు తరచూ వినబడుతుంటాయి. వైసీపీలో ఉన్నప్పుడు అందరూ తమ అధినేత ఇచ్చిన పాటనే పాడాలి… ఎలా పాడమంటే అలానే పాడాలి… ఇందులో రహస్యమేమీ లేదు. దాదాపు అన్ని పార్టీలలో ఇదే పద్దతి.

కనుక మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ నాలుగేళ్లుగా మూడు రాజధానుల పాట కోరస్‌గా పాడుతున్నారు. అయితే ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఇద్దరూ వైసీపీ నుంచి బయటపడగానే ‘జై అమరావతి’ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉంటుందని చెపుతున్నారు.

ADVERTISEMENT

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈరోజు ఉదయం మందడం గ్రామంలో అమరావతి కోసం 1200 రోజులుగా ధర్నా చేస్తున్న రైతులను కలిసి సంఘీభావం ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “వచ్చే ఎన్నికలలో అమరావతిని వ్యతిరేకించే శక్తులన్నీ కొట్టుకుపోతాయి. అమరావతి రధ చక్రాల కింద వైసీపీ నేతలందరూ నలిగిపోతారు. ఆనాడు అమరావతిని రాజధానిగా ఒప్పుకొన్న జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి కాగానే ఎందుకు వద్దంటున్నారు?ఇప్పటికైనా ఆయన అమరావతిని రాజధానిగా అంగీకరించడం మంచిది.

ప్రధాని నరేంద్రమోడీ అనుమతిలేనిదే అమరావతి నుంచి ఒక్క ఇటుక కూడా కదపలేమని సిఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే గ్రహించి ఉండాలి. దేశంలో మిగిలిన ప్రధాన నగరాలతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పోటీ పాడాలంటే అమరావతి వంటి గొప్ప రాజధానిని నిర్మించుకోవలసిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు చాలా దూరదృష్టితో ఆలోచించి నిర్ణయం తీసుకొన్నారు. కానీ సిఎం జగన్మోహన్ రెడ్డి ఆయనపై కక్షతో అమరావతిని పాడుబెట్టేసి రాష్ట్రానికి తీరని నష్టం కలిగించారు. అమరావతి సమస్య కేవలం 29 గ్రామాలది కాదు. యావత్ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలది, కోట్లాది తెలుగువారిది. రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం రైతులు తమ భూములను త్యాగం చేయడమే కాకుండా అమరావతి కోసం 1200 రోజులుగా పోరాడవలసి రావడం సిగ్గుచేటు,” అని అన్నారు.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీదేవి ఇద్దరూ వైసీపీలో నుంచి బయటకు వచ్చారు కనుక రాజధాని గురించి తమ అభిప్రాయాన్ని ధైర్యంగా బయటపెట్టారు. ఒకవేళ ఇంకా పార్టీలోనే ఉండి ఉంటే వారు మూడు రాజధానులు పాటే పాడుతుండేవారని వేరే చెప్పక్కరలేదు. అంటే వైసీపీలో ఉన్నమిగిలినవారిలో చాలా మంది మనసులో అమరావతి రాజధాని కావాలని కోరుకొంటున్నా తమ అధినేతకు వ్యతిరేకంగా మాట్లాడలేక ఆయన పాడమన్నట్లు మూడు రాజధానుల పాట పాడుతున్నారని భావించవచ్చు.

కనీసం పార్టీలో అందరి అభిప్రాయాలు తెలుసుకోకుండా, రాష్ట్రంలో ప్రజలందరూ మూడు రాజధానులు కోరుకొంటున్నారని వారి చేత సిఎం జగన్మోహన్ రెడ్డి పాట పాడిస్తుండటం విడ్డూరంగా ఉంది కదా?

విశాఖ రాజధాని వద్దని విశాఖ టిడిపి నేతలు చెప్పాలని సవాలు విసురుతున్నట్లే, కృష్ణ, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఆళ్ళ రామకృష్ణా రెడ్డి తదితరులచేత “అమరావతి మాకు వద్దు” అని బహిరంగ ప్రకటన చేయించగలరా?

ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి మనసులో ఏముందో బయటపెట్టారు. మిగిలినవారు వైసీపీలో ఉన్నందున మనసులో మాట బయటపెట్టలేకపోతున్నారనుకోవచ్చు. కానీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పిన్నట్లు అమరావతిని వ్యతిరేకించేవారందరూ రాబోయే ఎన్నికలలో ప్రజాగ్రహానికి బలికాక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories