వైఎస్ షర్మిల… ఎవరు వదిలిన బాణమో?

YS Sharmila KCR Telangana 2023 Electionsఒకప్పుడు జగనన్న బాణమని గర్వంగా చెప్పుకొని తిరిగిన వైఎస్ షర్మిలని ఇప్పుడు బిజెపి వదిలిన బాణమని టిఆర్ఎస్‌ నేతలు వాదిస్తున్నారు. ‘తెలంగాణలో ఆరెంజ్ ప్యారెట్’ అని కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు కూడా. ఆమె సమైక్యవాదులు వదిలిన బాణమని గుత్తా సుఖేందర్ రెడ్డి వంటి మరికొందరు టిఆర్ఎస్‌ నేతలు వాదిస్తున్నారు. ప్రశాంతంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రంలో చిచ్చు పెట్టేందుకే ఆమె పాదయాత్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

“కాదు…కాదు… ఆమె కేసీఆర్‌ వదిలిన బాణమే” అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అంటున్నారు. ఎందుకంటే ఆమె చేస్తున్న హడావుడితో అంతిమంగా రాజకీయ లబ్ది పొందేదీ టిఆర్ఎస్‌ పార్టీయే అని ఆయన అన్నారు.

ADVERTISEMENT

కనుక ఇదెవరి బాణమో… ఎవరికీ గుచ్చుకొంటుందో తెలియాలంటే ఫ్లాష్ బ్యాక్‌తో మొదలుపెట్టకతప్పదు.

ఆమె నిజంగా అన్నతో విబేదించి ఉంటే ఏపీలోనే రాజకీయ పార్టీ పెట్టుకొని ఉండేవారు. లేదా ఏపీలోనే ఏదో ఓ పార్టీలో చేరి ఉండేవారు. కానీ ఏపీలో ‘ఒక్క ఛాన్స్’తో ముఖ్యమంత్రి అయిన అన్నకి దాంతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతాయి. కనుక బహుశః అన్న సలహాతోనే ఆమె తెలంగాణకు వెళ్ళి సొంత కుంపటి పెట్టుకొని ఉండవచ్చు.

ఆమె తెలంగాణలో పార్టీ స్థాపించినప్పుడు టిఆర్ఎస్‌లో ఎవరూ వ్యతిరేకించలేదు! ఇంతకాలంగా ఆమె పాదయాత్రలు చేస్తూ కేసీఆర్‌, కేటీఆర్‌,మంత్రులు, ఎమ్మెల్యేలని, పేరు పెట్టి విమర్శిస్తున్నా ఎవరూ స్పందించలేదు! కనీసం పట్టించుకోలేదు! పైగా ఆమె పాదయాత్రకు పోలీసులు అనుమతిస్తూనే ఉన్నారు! ఎక్కడా ఆటంకం లేకుండా సహకరిస్తూనే ఉన్నారు! అంటే ఆమెకి టిఆర్ఎస్‌ ప్రభుత్వం అన్ని విదాలా సహకరిస్తోందని స్పష్టమైంది.

తమ అధినేతని ఎవరైనా ఓ మాటంటే సహించని టిఆర్ఎస్‌ నేతలు ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉండిపోయారు?ఇప్పుడు హటాత్తుగా ఆమెపై మూకుమ్మడి విమర్శలు ఎందుకు చేస్తున్నారు?అంటే అప్పుడు కేసీఆర్‌ రెడ్ సిగ్నల్ వేసి ఉంచారు కనుక ఇప్పుడు ‘తగిన సమయం’ వచ్చిందని భావించి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారు కనుకనే!

ఆమె సిఎం కేసీఆర్‌ని, టిఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని తిడుతుంటే, తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తుంటే టిఆర్ఎస్‌ ప్రతిష్ట మసకబారుతుంది కదా?అంటే తెలంగాణలో ఆమె మాటలను ఎవరూ నమ్మబోరని కేసీఆర్‌కి బాగా తెలుసు కనుకనే పట్టించుకోలేదని చెప్పవచ్చు. పైగా ఆమె కేసీఆర్‌, తెలంగాణ ప్రభుత్వం గురించి ఎంత తప్పుగా మాట్లాడితే అంతా ప్రజలలో కేసీఆర్‌ పట్ల సానుభూతి పెరుగుతుందే తప్ప తగ్గదు.

ఇక ఇప్పుడు ఆమెని ఎదుర్కోవడానికి ‘సరైన సమయం’ వచ్చిందని కేసీఆర్‌ ఎందుకు భావించారు?అంటే 1. రాష్ట్రంలో బిజెపి హడావుడిని తగ్గించి చూపడానికి కావచ్చు. 2. ఐ‌టి, ఈడీ, సీబీఐ దాడులతో టిఆర్ఎస్‌ ప్రభుత్వం దద్దరిల్లిపోతోందని లేదని కూలిపోయే పరిస్థితిలో ఉందని భావిస్తున్న ప్రజల దృష్టిని మళ్లించడానికి కావచ్చు. 3. అన్నిటి కంటే అతి ముఖ్యమైనది మళ్ళీ ప్రజలలో బలంగా తెలంగాణ సెంటిమెంట్ రగిలించడానికి కావచ్చు.

సమైక్యవాదులు రాష్ట్రంపై మళ్ళీ దాడి చేస్తున్నారంటూ టిఆర్ఎస్‌ నేతలు చేస్తున్న వాదనలు, నమస్తే తెలంగాణ పత్రికలో వస్తున్న కధనాలు కూడా ఇదే సూచిస్తున్నాయి. కనుక వైఎస్ షర్మిల టిఆర్ఎస్‌ని మళ్ళీ గెలిపించి అధికారంలోకి తెచ్చేందుకు ప్రయోగించిన బాణమే అని చెప్పుకోవచ్చు. ఇకపై టిఆర్ఎస్‌ నేతలకి, ఆమెకి మద్య జరుగబోయే యుద్ధాలతో ఈ వాదన నిజమని నిరూపితమవుతుంది. రాసి పెట్టుకోవచ్చు!

ADVERTISEMENT
Latest Stories