బాబాయ్ కేసు పక్క రాష్ట్రానికి బదిలీ… తలెక్కడ పెట్టుకొంటావు?

YS-Vivekananda-Reddy-Avinash Reddy- Jaganదివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సోదరుడు, ప్రస్తుత ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డికి స్వయాన్న బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురై మూడేళ్ళు గడిచినా ఇంతవరకు ఆ కేసు కొలిక్కి రాలేదు. దీంతో వివేకా భార్య, కుమార్తెలు సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఈ కేసు తదుపరి విచారణను హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకి బదిలీ చేయించుకొన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసింది. సుప్రీం తీర్పుపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, “సొంత బాబాయ్ హత్య కేసు విచారణ పొరుగు రాష్ట్రానికి బదిలీ. అది కూడా నువ్వు సిఎంగా ఉండగా! తలెక్కడ పెట్టుకొంటావ్ సిఎం జగన్‌ రెడ్డీ?” అని ట్వీట్ చేశారు.

టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ స్పందిస్తూ, “బాబాయ్ హత్య కేసు పక్క రాష్ట్రానికి… అబ్బాయ్ చంచల్‌గూడ జైలుకి..” అని ట్వీట్ చేశారు.

ADVERTISEMENT

దీనికి నైతిక బాధ్యత వహిస్తూ సిఎం జగన్మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. తన సొంత బాబాయ్ అత్యంత కిరాతకంగా హత్యకు గురైతే మరొకరు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఉంటే జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపీ నేతలు ఇదే డిమాండ్ చేసి ఉండేవారు. కానీ ఈ కేసులో వైసీపీ ముఖ్య నేతల హస్తం ఉన్నందునే కేసును పక్కదారి పట్టిస్తున్నారని వివేకా కుమార్తె సునీతారెడ్డి ఆరోపిస్తున్నారు. మరి అటువంటప్పుడు తెలంగాణకి ఈ కేసు బదిలీ అయినందుకు ఎందుకు సిగ్గుపడతారు?ఎందుకు రాజీనామా చేస్తారు?

అయితే తెలంగాణ ప్రభుత్వంతో కూడా వైసీపీ నేతలకు బలమైన సంబంధాలు ఉన్నందున, హైదరాబాద్‌ సీబీఐలో కూడా నిష్పక్షపాత విచారణ జరపడం కష్టమని కనుక ఈ కనుక బెంగళూరు సీబీఐ కోర్టుకి బదిలీ చేయాలని సీబీఐ కోరింది. అంటే సీబీఐ కోర్టుల మీద కూడా ప్రభుత్వాల ఒత్తిడి ఉంటుందని చెప్పకనే చెప్పింది. సాధారణంగా న్యాయస్థానాలు నిందితులకు బెయిల్‌ మంజూరు చేస్తున్నప్పుడు సాక్షులను ప్రభావితం చేయరాదనే షరతుతో మంజూరు చేస్తుంటారు. కానీ కోర్టులను, కోర్టులలో విచారణలను కూడా నిందితులు ప్రభావితం చేయగలరని నిన్న సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు, ఈ కేసుని బెంగళూరుకి బదిలీ చేయాలని సీబీఐ కోరడాన్నిబట్టి అర్దమవుతోంది. ఈ కేసును బెంగళూరుకి బదిలీ చేయాలని సీబీఐ కోరినప్పటికీ సుప్రీంకోర్టు హైదరాబాద్‌ సీబీఐకే బదిలీ చేసింది. కనుక హైదరాబాద్‌ సీబీఐ కోర్టులో విచారణ ఏవిదంగా సాగుతుందో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.

ADVERTISEMENT
Latest Stories