ముందస్తు ఎన్నికల ప్రిపరేషన్ మొదలైనట్లే కానీ…

YSR Congress early elections in APఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు 2024 మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో జరుగుతాయి. అంటే సుమారు రెండేళ్ళ సమయం ఉందన్న మాట! కానీ వైసీపీ ప్రభుత్వం హడావుడి చూస్తుంటే మరో రెండు మూడు నెలల్లోనే ఎన్నికలన్నట్లుంది.

ఈ నెల 10వ తేదీ నుంచి వైసీపీ నేతలందరూ గడప గడపకూ అంటూ జనాల వద్దకు వస్తున్నారు. త్వరలో జరుగబోయే నాలుగు రాజ్యసభ స్థానాలలో రెండు బీసీలకు కేటాయించి, ఈ విషయం గట్టిగా చాటింపు వేసుకోవడం కూడా ఎన్నికల కోసమేనని వేరే చెప్పక్కరలేదు.

ADVERTISEMENT

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో బీసీలను ప్రసన్నం చేసుకొనేందుకు కోనసీమ జిల్లా పేరును మార్చి డా.బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రేపు ప్రాధమిక నోటిఫికేషన్‌ జారీ చేయబోతోంది.

టిడిపి నేతలు ముందస్తు ఎన్నికలు జరుగబోతున్నాయంటే “అదేమీ లేదు… చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలనుకొంటే అప్పుడు ఎన్నికలు జరుగుతాయేమిటి?”అని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తుండగానే మరో పక్క వైసీపీలో ఈ హడావుడి మొదలైపోయింది.

ముందస్తుకు వెళితే ఆ మేరకు ప్రతిపక్షాలకు ఎదురుచూపులు తగ్గుతాయి కనుక వాటికి లాభం. కానీ ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఎన్నికైన వైసీపీ ఎమ్మెల్యేలకు రెండేళ్ళ ముందుగానే ఎన్నికలంటే చాలా నష్టం. ముఖ్యంగా కొత్తగా మంత్రి పదవులు చేపట్టినవారికి ఆ ముచ్చట తీరకుండానే ఎన్నికలకు వెళ్లవలసివస్తే అంతకంటే బాధాకరమైనది మరొకటి ఉండదు.

ఇక ఎన్నికల గంట కొడితే మళ్ళీ టికెట్ల బాధ ఒకటుంటుంది. మంత్రివర్గం నుంచి బయటకు పంపేసినవారిలో ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చాయో ఇంకా తెలీదు. కనుక వాటి ఆధారంగా ఎవరెవరికి టికెట్లు వస్తాయో ఎవరెవరిని జగనన్న పక్కన పెడతారో తెలీదు. వైసీపీ ఎమ్మెల్యేలకు, తాజా మాజీలకు ఇప్పుడు ఇదో టెన్షన్. కనుక తమ అధినేత ఎన్నికలకు ఎప్పుడు గంట కొట్టేస్తారో అని ఎమ్మెల్యేలు, మంత్రులు ఆందోళన చెందడం సహజమే. కానీ రోట్లో తలపెట్టి రోకలిపోటుకి భయపడితే ఎలా?

ADVERTISEMENT
Latest Stories