జయహో బీసీ… నినాదాలతో జీవితాలు బాగుపడతాయా?

YSRCP Jayaho BC Meetingఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని 5 ఏళ్ళు పాలించమని ప్రజలు జగన్‌ సర్కారుకి ఒక్క ఛాన్స్ ఇస్తే, తొలిరోజు నుంచే 5 ఏళ్ళ తర్వాత వచ్చే ఎన్నికల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టడం విశేషం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపాలని ప్రజలు కోరుకొని అధికారం కట్టబెడితే, సంక్షేమ పధకాల పేరుతో డబ్బులు పంచుతూ వారి జీవితాలలో వెలుగులు తెస్తున్నానని వాదిస్తున్నారు. అయితే ఒక్క సంక్షేమ పధకాలతోనే రాబోయే ఎన్నికలలో గట్టెక్కలేమనే విషయం ఆలస్యంగా గ్రహించినట్లుంది. అందుకే ఓటర్లలో బీసీ ఓటర్లు వేరయా అంటూ ‘జయహో బీసీ మహాసభ’ పేరుతో నేడు విజయవాడలో భారీ బహిరంగసభ నిర్వహించబోతోంది.

ఓ పక్క ఉద్యోగులు, ఉపాధ్యాయులు 7వ తేదీ వచ్చినా ఇంకా జీతాలు పడలేదని, పెన్షనర్లు పెన్షన్లు పడలేదని పెన్షనర్లు ఆవేదన చెందుతుంటే, సంబందిత శాఖల మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఈ జయహో సభకి ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైపోయారు. చుట్టుపక్కల జిల్లాల నుంచి భారీగా బీసీలను సమీకరణ చేసి వందలాది ఆర్టీసీ బస్సులలో విజయవాడ తరలిస్తున్నారు. ఈ సభలో ప్రసంగించబోయే సిఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ఏం చెపుతారో అందరికీ తెలుసు.

ADVERTISEMENT

తమ ప్రభుత్వం ఈ మూడున్నరేళ్ళలో బీసీలకు రూ.1.37 లక్షల కోట్లు పధకాల ద్వారా అందించిందని, బీసీలకు పదవులు ఇచ్చి గౌరవించిందని కానీ టిడిపి హయాంలో బీసీలను అణగద్రొక్కేసిందని, టిడిపి, జనసేనలు బీసీలను మళ్ళీ మాయమాటలతో మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పబోతున్నారు.

బీసీల జీవితాలు మెరుగుపడాలంటే వారికి ఉద్యోగాలు కల్పించాలి. అందుకు పరిశ్రమలను, ఐ‌టి కంపెనీలను రాష్ట్రానికి రప్పించాలి. కానీ వారికి ఏడాదికి ఓ లక్షో రెండు లక్షల చొప్పున పంచిపెడితే అది ఖర్చవుతుంటుంది తప్ప వారి జీవితాలలో ఎలా మార్పు వస్తుంది?

బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా భావిస్తుండటం వలననే ప్రభుత్వం వారిని సంక్షేమ పధకాలతో ప్రలోభపెట్టాలని ప్రయత్నిస్తోందని అర్దం అవుతూనే ఉంది. తద్వారా వారు ఎప్పటికీ తమ కాళ్ళపై తాము నిలబడనీయకుండా ప్రభుత్వం మీద ఆధారపడేలా మార్చేస్తోంది కూడా. పైగా ఇతర పార్టీలు కూడా తలకి మించిన ఈ సంక్షేమ పధకాలను అమలుచేస్తామని ప్రకటించక తప్పని పరిస్థితులు కల్పిస్తూ రాజకీయంగా వాటిని బ్లాక్ మెయిల్ చేస్తోంది కూడా.

పొరుగు రాష్ట్రం తెలంగాణలో కూడా సంక్షేమ పధకాలు అమలుచేస్తోంది. కానీ వాటి కంటే ఎక్కువ అభివృద్ధికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులు ఆ రాష్ట్రానికి వలసలు పోతున్నారు. వారిలో బీసీలు కూడా ఉన్నారని వేరే చెప్పక్కరలేదు. వైసీపీ ప్రభుత్వం బీసీలను ఉద్దరిస్తున్నట్లయితే మరి వారు ఇరుగు పొరుగు రాష్ట్రాలకి వలసలు ఎందుకుపోతున్నారు?

రోగం వస్తే మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్‌కే వెళ్ళి చికిత్స చేయించుకొంటున్నారంటే ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి ఏవిదంగా ఉందో అర్దం చేసుకోవచ్చు. కనుక జయహో బీసీ అనే నినాదంతో బీసీలకి ఒరిగేదేమీ ఉండదు. ఈరోజు సభ బీసీల ఓట్ల కోసమే వైసీపీ నిర్వహిస్తోందని చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories