ఇలా అడిగితే వైసీపీలకి చాలా కోపం వస్తుంది. కానీ వారి అధినేత జగన్మోహన్ రెడ్డితో కలిసి పని చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు.. సినీ పరిశ్రమలో ప్రముఖులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఎంత మంది జైలుకి వెళ్ళారు?అంటే సమాధానం చెప్పడం కష్టం.
కానీ ఎంత మంది పోలీస్ స్టేషన్లు, కేసులు, కోర్టులకు దూరంగా ఉండగలిగారు?అంటే వేళ్ళపై లెక్కించి చెప్పవచ్చు.
అక్రమాస్తుల కేసులు, మైనింగ్ కుంభకోణంలో చిక్కుకొని పలువురు మంత్రులు, ఐఏఎస్ అధికారులు చంచల్ గూడా జైలుకి వెళ్ళి వచ్చారు. అప్పటికి వైసీపీ ఏర్పడలేదు కూడా.
జగన్ సిఎం అయిన తర్వాత చంద్రబాబు నాయుడుతో సహా పలువురు టీడీపి సీనియర్ నేతలను జైలుకి పంపించి వారిపై కూడా ‘జైలు ముద్ర’ పడేలా చేశారు. కనుక ఆ లెక్క సరి చేసేందుకు కూటమి ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తే అందరూ తప్పక వేలెత్తి చూపేవారు.
కానీ వేలకోట్ల మద్యం కుంభకోణం, మద్యం రవాణా, భూకబ్జాలు, టీడీపి కార్యాలయాలపై దాడులు, శవాలు డోర్ డెలివరీ వంటి కేసులలో చిక్కుకొని జైలు పాలవుతున్నారు.
నాడు వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి, కార్పోరేషన్ చైర్మన్ పదవులకు పలువురితో పోటీ పడి సంపాదించుకోవడం గొప్ప విషయమే. కానీ నాడు పదవులు పొందినవారు నేడు మూల్యం చెల్లిస్తుంటే, ఆ పోటీలో ఫెయిల్ అయినవారు నేడు హ్యాపీగా జీవిస్తున్నారు.
మద్యం రవాణా కుంభకోణంలో ఈడీ అధికారులు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకి తరలించడం ఇందుకు తాజా ఉదాహరణగా కనిపిస్తోంది.
ఒకవేళ ఈ కేసులో సిట్ అధికారులు ఆయనని అరెస్ట్ చేస్తే ‘కక్ష సాధింపు’ లేబుల్ పెట్టుకొని రాజకీయ మైలేజ్ పొందవచ్చు. కానీ కేంద్రం అధీనంలో పని చేసే ఈడీ అధికారులు కారుమూరిని అరెస్ట్ చేశారు. అలాగని కేంద్రాన్ని వైసీపీ విమర్శించలేదు కనుక చంద్రబాబు నాయుడుని విమర్శిస్తున్నారు.
వైసీపీ హయంలో ఆయన, కొడుకు సునీల్ కలిసి మద్యం రవాణా కాంట్రాక్టులతో కోట్లాది రూపాయలు నొక్కేసినందుకు ఈడీ అరెస్ట్ చేసింది. కనుక అవినీతికి పాల్పడలేదని వాదించే అవకాశం కూడా లేదు.
కనుక జగన్ వలన కొందరు సమస్యలలో చిక్కుకొని జైలు పాలవుతుంటే, మరికొందరు ఈవిధంగా బుక్ అవుతున్నారు. ఏతావాతా తేలేది ఏమిటంటే, వైసీపీతో కలిసి ప్రయాణించడం అంటే పులి మీద సవారీ చేయడమే అనిపిస్తోంది.





