కోటి సంతకాలే విజయానికి, వైఫల్యానికి నిదర్శనమైతే…

YSRCP leaders holding one crore signature campaign against medical college privatization in Andhra Pradesh

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ శ్రేణులు కోటి సంతకాల కార్యక్రమం పూర్తి చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం అయినందుకు జగన్‌ సంతోషం వ్యక్తం చేశారు.

కేవలం ఏడాదిన్నరలోనే ఏపీ జనాభాలో కోటి మంది చంద్రబాబు నాయుడు పాలన పట్ల వ్యతిరేకత తెలియజేశారని జగన్‌ అన్నారు.

ADVERTISEMENT

కోటి సంతకాలు వైసీపీ విజయానికి, చంద్రబాబు నాయుడు పాలన వైఫల్యానికి నిదర్శనమని జగన్‌ చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది.

వీటిని పిపిపి పద్దతిలో నిర్మించి, నిర్వహించినప్పటికీ ఇవన్నీ ప్రభుత్వ యాజమాన్యం కిందే ఉంటాయని, ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం నడుచుకుంటాయని సిఎం చంద్రబాబు నాయుడు నిన్న మరోసారి స్పష్టం చేశారు.

దేశంలో మెడికల్ కాలేజీలతో సహా వివిధ రంగాలలో వేగంగా అభివృద్ధి సాధించడానికి ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో ముందుకు సాగడం మంచిదని పార్లమెంట్‌ స్టాండింగ్ కమిటీ విస్పష్టంగా చెప్పింది. ఇదే విధానం దేశమంతా అవలంభించడం చాలా అవసరమని చెప్పింది. అంటే మెడికల్ కాలేజీల విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయం సరైనదని స్పష్టమవుతోంది.

కానీ జగన్‌ ఇది తప్పని వితండవాదం చేస్తూ కోటి సంతకాల కార్యక్రమం మొదలుపెట్టించారు. ఓ రాజకీయ పార్టీ కోటి సంతకాలు సేకరించడం పెద్ద కష్టమేమీ కాదు. వాటిలో ప్రజలు చేసిన సంతకాలెన్ని? దొంగ సంతకాలెన్ని?అని ఎవరూ ప్రశ్నించరు.. తనికీ చేయలేరు కూడా. కనుక వాటిని ప్రజాభిప్రాయానికి ప్రామాణికంగా భావించలేము.

కానీ ఈ కార్యక్రమంతో వైసీపీ నేతలందరినీ జగన్‌ ఇళ్ళలో నుంచి బయటకు రప్పించగలిగారు. నేతలు, కార్యకర్తలు కలిసి పనిచేసేలా చేశారు. కనుక ఇది వైసీపీ శ్రేణులకు చేతి నిండా పని కల్పించి వారిలో ఉత్సాహం నింపడానికి బాగా పనికొచ్చిందని చెప్పవచ్చు.

చంద్రబాబు నాయుడు ఏడాదిన్నర పాలనకు సాక్ష్యాలుగా అమరావతిలో జోరుగా సాగుతున్న నిర్మాణ పనులు కనిపిస్తున్నాయి.

లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. రాష్ట్రంలో శంకుస్థాపనలు జరుపుకొని నిర్మాణాలు జరుగుతున్న పరిశ్రమలు కనిపిస్తున్నాయి. ప్రారంభోత్సవాలు జరుపుకుంటున్న ఐటి కంపెనీలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది జూన్-జూలై నెలల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం కాబోతోంది.

మెగా డీఎస్సీలో 16,000 మంది ఉపాధ్యాయుల నియామకాలు జరిగాయి. పోలీస్ కానిస్టేబుల్స్‌గా ఎంపికైన 5,757 మందికి నేడు మంగళగిరిలో సిఎం చంద్రబాబు నాయుడు స్వయంగా నియామక పత్రాలు అందించబోతున్నారు.

ఇవన్నీ కేవలం 17 నెలల్లోనే జరిగాయి కదా? జగన్‌ 5 ఏళ్ళ పాలనలో వీటిలో ఎన్ని చేయగలిగారు? అని ప్రశ్నించుకుంటే ఇద్దరి పాలనలో తేడా స్పష్టంగా కనిపిస్తుంది.

సిఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నా 2019 ఎన్నికలలో ఓడిపోయారు. ఆ ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచిన జగన్‌ 2024 ఎన్నికలలో ఎందువల్ల అంత ఘోరంగా ఓడిపోయారు?2019లో సిఎం చంద్రబాబు నాయుడు కాదన్న ప్రజలే 2024లో ఆయనకు మళ్ళీ పట్టం కట్టారు. ఎందుకు?

ఈ ప్రశ్నలకు సమాధానాలు ప్రజలందరికీ తెలుసు. వైసీపీ నేతలకి… వారి అధినేత జగన్‌కి కూడా తెలుసు. కానీ తెలియనట్లు నటిస్తున్నారు!

ఈ కోటి సంతకాలు ప్రజా వ్యతిరేకతకి నిదర్శమని చెప్పుకోవడం జగన్‌ ఆత్మవంచన చేసుకుంటూ ప్రజలను, పార్టీ శ్రేణులను కూడా భ్రమింపజేసే ప్రయత్నమే.

జగన్‌ శాసనసభకు, ప్రజల మధ్యకు వెళ్ళకుండా తాడేపల్లి ప్యాలస్‌ కూర్చొని అందరినీ ఇలా భ్రమింపజేయాలనుకుంటే మళ్ళీ వైసీపీ నష్టపోతుంది. కనుక ఇప్పటికైనా మేల్కొని ప్రజల సమస్యలు, ఆకాంక్షలను గుర్తించి పనిచేస్తే వారికే మంచిది.

ADVERTISEMENT
Latest Stories