సమైక్యరాగంతో వైసీపీ ఏం డైవర్ట్ చేయాలనుకొంటోందో?

Botsa Satyanarayana  ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వ్యాఖ్యలను పట్టుకొని వైసీపీ నేతలు సమైక్యరాగం ఆలపిస్తుండటం అనుమానం కలిగిస్తోంది. ప్రభుత్వ మీడియా సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాలు కలిసే అవకాశం వస్తే తప్పకుండా స్వాగతిస్తామని చెప్పగా, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా దానిని స్వాగతిస్తామని చెపుతూనే అదిప్పుడు సాధ్యం కాదు కనుక కేవలం విభజన హామీల అమలు గురించి మాట్లాడితే సరిపోతుందన్నారు. సుప్రీంకోర్టు మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాలని కలిసిపొమ్మని చెపుతుందేమోననే ఊహాజనితమైన అంశంపై చర్చించి ప్రయోజనం ఉండదని అన్నారు.

ఉండవల్లి వ్యాఖ్యలు పట్టుకొని వైసీపీ నేతలు సమైక్య రాష్ట్రం ఏర్పాటు గురించి మాట్లాడటం సహజమైన రాజకీయ ప్రతిక్రియగానే పైకి కనిపిస్తున్నప్పటికీ, వారు ఏదో సమస్యపై నుంచి దీంతో ప్రజల దృష్టి మళ్ళించడానికి ప్రయత్నిస్తున్నట్లుంది. నిన్న విజయవాడలో వైసీపీ నిర్వహించిన ‘జయహో బీసీ మహాసభ’ ని విజయవంతం చేయడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ శ్రమించి జనసమీకరణ చేసినప్పటికీ వారి సంఖ్య 80,000 దాటకపోవడం, ఆ వచ్చినవారిలో కూడా చాలామంది సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగానే లేచి వెళ్ళిపోయిన వార్తలు మీడియాలో ప్రధానంగా వచ్చాయి. బహుశః దాంతో పోయిన పరువుని కవర్ చేసుకొనేందుకో లేదా ప్రభుత్వోద్యోగులకు, ఉపాధ్యాయులకి, పెన్షనర్లకి సకాలంలో జీతాలు, పెన్షన్లు చెల్లించలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నందున వాటిపై నుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికో వైసీపీ నేతలు సమైక్యరాగం ఆలపిస్తున్నారేమో?ఇవేవీ కాకపోయినా ఏదో బలమైన కారణం లేకుండా వైసీపీ నేతలు ఇటువంటి ‘అసందర్భ మాటలు’ మాట్లాడారని చెప్పవచ్చు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories