ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ దేశ వ్యాప్తంగా ఎంత పెద్ద సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రజాక్షేత్రం నుండి వెల్లువెత్తిన అభిమానం మొదలుకుని, ప్రాంతీయ మీడియాలతో పాటు జాతీయ మీడియా సంస్థలు కూడా ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాయి. అంతేకాదు జోహో వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థలకు సంబంధించిన అధిపతులు కూడా ఈ సందర్భాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియా వేదికలుగా తమ మద్దతును చంద్రబాబుకు ప్రకటిస్తుండడం విశేషం.
ఇంత మద్దతు వెనుక చంద్రబాబు పడిన కష్టం, చేసిన కృషిని ఈ సందర్భంగా జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. 2018లో జొహో సీఈవో శ్రీధర్ తిరుపతికి విచ్చేసి పెట్టుబడులు పెట్టిన అంశం నేడు మరోసారి వినిపిస్తోంది. తాము తమిళనాడులో పెట్టుబడులు పెట్టే ఆలోచనలు చేశామని, కానీ చంద్రబాబు తమని ఏపీకి ఆహ్వానించారని.., నాడు స్వయంగా శ్రీధర్ తెలిపారు. నేడు చంద్రబాబు అరెస్ట్ పట్ల జోహో సీఈఓ శ్రీధర్ స్పందిస్తూ బాబు అరెస్ట్ తనను మిక్కిలి ఆశ్చర్యాన్ని కలిగించిందని., న్యాయమే గెలుస్తుందని..,సోషల్ మీడియా వేదిక గా చంద్రబాబు కి తన మద్దతుని తెలియచేసారు.
గడిచిన అయిదేళ్ల పాలనలో ఒక్క ప్రముఖ సంస్థను కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా ప్రోత్సహించలేని ముఖ్యమంత్రి వర్యులకు గానీ, వారి మద్దతు దారులకు గానీ చంద్రబాబు పడిన కష్టం విలువ తెలియకపోవచ్చు. ఒక కార్పొరేట్ సంస్థను తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని జరిపే చర్చల విలువ, అది ఎలా చేయాలో బహుశా చంద్రబాబుకు తెలిసినంతగా మరొకరికి తెలియదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ వేదికగా వెలసిన కంపెనీల జాబితా, అలాగే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న ప్రముఖ సంస్థల జాబితాలను పరిశీలిస్తే… చంద్రబాబు విజన్ కు అద్దం పడుతుంది. 90 దశకాలలో అర్ధరాత్రి సమయాలలో పెట్టుబడులకు సంబంధించిన ఫైల్స్ పట్టుకుని విదేశాలలో ఒక్కడే తిరిగి హైదరాబాద్ కు పెట్టుబడులను తీసుకువచ్చిన ఘనత, కృషి వల్లనే నాడు బిల్ గేట్స్ కూడా ఏపీకి విచ్చేసిన విషయం బహుశా నేటి తరానికి తెలిసి ఉండకపోవచ్చు.
ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు విదేశాలకు వెళ్లాలంటే, కోర్టు అనుమతి అనివార్యం అయితే, అదే విదేశీ సంస్థలను రాష్ట్రానికి రప్పించి, పెట్టుబడులు పెట్టించిన కీర్తి మాజీ ముఖ్యమంత్రి వర్యుల సొంతం. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంతర్జాతీయ వేదికలుగా అనేక సమ్మిట్స్ లో పాల్గొని రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చిన వారికి, అవే పెట్టుబడులను రాష్ట్రం నుండి వెళ్లగొట్టేవారికి ఉన్న విలువ ఏమిటో ఈ సందర్భంగా తేటతెల్లం అవుతోంది.



