హైదరాబాద్‌లో 125 అడుగుల డా.అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరించినప్పుడు ఇది కేవలం విగ్రహం కాదు విప్లవం అంటూ కేసీఆర్ చెప్పారు. నిజమే.. జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించి ప్రధాని పదవి చేపట్టాలని తహతహలాడుతున్న కేసీఆర్, అందుకోసం చేస్తున్న ఈ రాజకీయ పోరాటాన్నే విప్లవం అనుకొంటున్నారేమో?
ఈ విగ్రహావిష్కరణ తెలంగాణతో సహా దేశంలో బడుగు బలహీనవర్గాల ప్రజల ఆకాంక్షలకు ప్రతీక అని కేసీఆర్ చెప్పుకొన్నారు. అయితే ఈ విగ్రహావిష్కరణ గుఎరించి బిఆర్ఎస్ సొంత పత్రిక ‘నమస్తే తెలంగాణ’ నేడు అసలు విషయం బయటపెట్టేసింది. దేశవ్యాప్తంగా జాతీయ మీడియాలో ‘కేసీఆర్ దేశంలోకెల్ల ఎత్తైన డా.అంబేడ్కర్ విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఆవిష్కరించారనే వార్తలు వచ్చాయని నమస్తే తెలంగాణ ప్రత్యేకంగా ఓ కధనం ప్రచురించింది. అంటే ఈ విగ్రహావిష్కరణతో కేసీఆర్ జాతీయ స్థాయిలో తన ఉనికిని చాటుకొని, గుర్తింపు సంపాదించుకొన్నారని ‘నమస్తే తెలంగాణ’ చెప్పకనే చెప్పింది. అంటే కేసీఆర్ తాపత్రయం దళితుల కోసమా లేక ఆ పేరుతో జాతీయస్థాయి నాయకుడిగా ఎదగడం కోసమా? అనే సందేహం కలుగుతుంది.
కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ప్రవేశించే ముందే, “ఇప్పటి వరకు ఢిల్లీ కేంద్రంగా జాతీయ రాజకీయాలు నడుస్తున్నాయి. కానీ ఇకపై హైదరాబాద్ కేంద్రంగా నడిపిస్తాను,” అని చెప్పారు. ఆ తర్వాత వివిద రాష్ట్రాల నుంచి నేతలు ప్రగతి భవన్‌కు వచ్చి బిఆర్ఎస్ కండువలు కప్పించుకొని వెళుతుండటం, ఇప్పుడు ఈ విగ్రహావిష్కరణ గమనిస్తే కేసీఆర్ ఎంత ముందుచూపుతో ఆ మాట అనగలిగారో అర్దం అవుతుంది. ఆయన దూరదృష్టికి ఆశ్చర్యం కూడా కలుగుతుంది.
తనను తాను ‘హైలైట్’ మరియు ‘ఎలివేట్’ చేసుకోవడం ఎలాగో కేసీఆర్‌కి బాగా తెలుసు. ఈ విషయంలో కేసీఆర్‌తో పోటీ పడగల ఏకైక వ్యక్తి ప్రధాని నరేంద్రమోడీ మాత్రమే. అది అప్రస్తుతం. ఇప్పుడు డా.అంబేడ్కర్ విగ్రహావిష్కరణ ద్వారా కేసీఆర్ ఆ రెండు పనులు చేసి చూపించారు. మళ్ళీ ఈ నెల 30న తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం చేసినప్పుడు ఎలాగూ జాతీయ మీడియాలో మంచి కవరేజ్ లభిస్తుంది. ఇలాంటి ఐడియాలు కేసీఆర్ వద్ద కోకొల్లలు ఉన్నాయి… ఉంటాయి. వాటిని ఆయన ఎప్పుడు ప్రయోగిస్తారో ఎవరూ ఊహించలేరు. కనుక ఇప్పుడు ఆలోచించుకోవలసింది కాంగ్రెస్, బిజెపిలే!



