ఓ పక్క కూటమి ప్రభుత్వం-వైసీపీల మద్య కల్తీ నెయ్యి, కల్తీ మద్యంపై వాదోపవాదాలు, కేసులు నడుస్తుండగానే రాజమహేంద్రవరంలో కల్తీపాలు తాగి ఐదుగురు మరణించడంతో వాటి మద్య మరో కొత్త యుద్ధం మొదలైంది.
ఈ అంశంపై కూటమి ప్రభుత్వం చాలా చురుకుగాస్పందించింది. ముందుగా పోలీసులు కల్తీ పాలు అమ్మిన కోరుకొండ మండలం నరసాపురానికి చెందిన పాల వ్యాపారి గణేష్‌ని అరెస్ట్ చేశారు.
అతని డెయిరీలో కల్తీ పాలు తయారు చేసేందుకు వినియోగించిన రసాయనాలను, ఇతర సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతను సరఫరా చేసిన కల్తీ పాలు, అలాగే పాల సేకరణ చేస్తున్న ఆవులు, గేదెల రక్తం నమూనాలను సేకరించి సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.
అతను పాలు సరఫరా చేసిన ప్రాంతాలలో కుటుంబాలకు వైద్య పరీక్షలు, అవసరమైన వారికి అత్యవసర వైద్య చికిత్స అందించేందుకు వైద్య నిపుణులతో కూడా బృందాలను ఏర్పాటు చేసింది. సమస్య తీవ్రతను బట్టి బాధితులను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆ ప్రాంతంలో మొత్తం 64 కుటుంబాలకు అతను పాలు సరఫరా చేస్తున్నట్లు గుర్తించి, వారందరి రక్తం, మూత్రం సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు.
జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీ, ఏలూరు రేంజి ఐజీ, వైద్య ఆరోగ్యశాఖ కమీషనర్, ప్రముఖ నెఫ్రాలజిస్ట్ రవిరాజ్ తదితరులు పర్యవేక్షిస్తున్నారు.
ఈ ఘటనపై సిఎం చంద్రబాబు నాయుడు సోమవారం శాసనసభలో స్పందిస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాడ సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు పది లక్షలు చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారందరికీ చికిత్స ఖర్చులు ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించారు.
ఈ సమస్య శివరాత్రినాడు హటాత్తుగా పాలకు డిమాండ్ పెరగడంతో మొదలైనట్లు పోలీసులు గుర్తించారు. హటాత్తుగా పాలకు డిమాండ్ పెరగడంతో పాల వ్యాపారి గణేష్, అప్పటికప్పుడు అని పాలు సేకరించి సరఫరా చేయడం కష్టమని భావించి కల్తీ పాలు తయారు చేసి సరఫరా చేయడంతో అవి తాగినవారి కిడ్నీలు చెడిపోయాయి. వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. కల్తీ పాలని తెలియక పలు కుటుంబాలు వాటిని వాడటంతో సమస్య తీవ్రమైంది.
దీంతో ప్రభుత్వానికి ఎటువంటి సంబందమూ లేదు. కానీ ఫుడ్ సేఫ్టీ అధికారుల వైఫల్యం ఉంది. వారు ఎప్పటికప్పుడు తనికీలు నిర్వహిస్తే ఇలాంటి ఘటనలు జరిగేవి కావు.
కానీ మన దేశంలో, రాష్ట్రంలో వ్యవస్థలు.. వాటిలో అధికారులు ఇలాంటి ఘటనలు, ప్రమాదాలు జరిగిన తర్వాతే మేలుకుంటారు. కనుక ఇప్పుడూ ఆలాగే మేల్కొని పరుగులు తీస్తున్నారు.
ఈ ఘటనపై వైసీపీ అప్పుడే శవ రాజకీయాలు మొదలుపెట్టెసింది. ఆ పార్టీ నేతలు బాధిత కుటుంబాలను పరామర్శించి మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుంటే, వారి సొంత మీడియా, సోషల్ మీడియాలో ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం వల్లనే ఇలా జరిగిందంటూ కధనాలు వండి వార్చేస్తున్నాయి.
2016లో విజయవాడలోని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లాది విష్ణు కుటుంబానికి చెందిన బారులో కల్తీ మద్యం త్రాగి తొమ్మిది మంది చనిపోయారు. ఆ కేసులో నిందితుడుగా ఉన్న విష్ణుని వైసీపీలో చేర్చుకొని కాపాడింది. పదవులు కూడా ఇచ్చింది. అదే వైసీపీ ఇప్పుడు కల్తీ పాలు వ్యవహారంపై శవ రాజకీయాలు చేస్తోంది.




