గంగ చంద్రముఖిగా మారి గజ్జెలు కట్టుకొని డాన్స్ చేసినట్లుగానే అంబటి రాంబాబు ‘టైగర్ రాంబాబు’గా మారి చాలా హడావుడి చేస్తున్నప్పుడు ఆయన కుమార్తె మౌనిక మీడియా ముందుకు వచ్చి తండ్రిలాగే ధాటిగా మాట్లాడుతూ అందరి దృష్టిని ఆకర్షించారు.
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో “మీరు కాపులు. మరి కమ్మ కులానికి చెందిన వ్యక్తిని ఎందుకు పెళ్ళి చేసుకున్నారు?” అనే ప్రశ్నకు ఆమె సూటిగా, చక్కగా సమాధానం చెప్పారు. “ఓ వ్యక్తిని, అతని వ్యక్తిత్వాన్ని చూసి మేము (ఆడవాళ్ళు) పెళ్ళి చేసుకుంటాము తప్ప అతని కులాన్ని చూసి కాదు. మేము ఆ వ్యక్తిని చేసుకుంటాము తప్ప అతని కులాన్ని కాదు.
ఒకవేళ పవన్ కళ్యాణ్ కాపు కాకపోతే చంద్రబాబు నాయుడు ఆయనతో ఎన్నికల పోట్టుపెట్టుకొని ఉండేవారా?” అని సూటిగా ప్రశ్నించారు. చాలా మంచి ప్రశ్నే… కానీ సమాధానం కాస్త పెద్దది.
పెళ్ళికి కులం, మతం పట్టింపులు ఉంటాయి. ఇప్పుడా పట్టింపులు తగ్గిపోతున్నాయి. సంతోషమే. కానీ పెళ్ళిళ్ళలో జనాలు కులమతాలను పక్కన పెడుతున్నారు. కానీ రాజకీయాలలో కాదు. అవే మన రాజకీయాలను శాశిస్తు న్నాయి.
కులమతాల ఆధారంగా పార్టీల ఏర్పాటు మొదలు కులమతాల వారీగా ఓటు బ్యాంకులు, టికెట్లు, పొత్తులు, పదవులు, ప్రాధాన్యతల వరకు ప్రతీ చోట అవే కనిపిస్తాయి. అవే శాసిస్తున్నాయి. వీటిని రాజకీయాల నుంచి ఎవరూ విడదీయలేరు కూడా.
కనుక రాజకీయాలను కులమతాలు శాశిస్తున్నప్పుడు, పదవి అధికారం చేజిక్కించుకోవాలనుకునేవారు గిరి గీసుకు కూర్చోలేరు. కూర్చుంటే (2019 ఎన్నికలలో జనసేన పార్టీ) ఎదురు దెబ్బలు తప్పవు.
ఈ జ్ఞానోదయం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ టీడీపితో చేతులు కలిపారు. అప్పుడు 175/175 పతాకం రధంపై రెపరెపలాడుతుంటే సజ్జల, ఐప్యాక్ శల్యసారధ్యంలో సింగిల్ సింహం జగన్ గర్జిస్తూ మీదకు వస్తుంటే ఎవరూ ఎదురు వెళ్ళి బలై పోవాలనుకోరు కదా?
వారిది డెడ్లీ కాంబినేషన్ అని, వాటితో తలపడితే ఓటమి తప్పదని జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. కనుక కుల సమీకరణాల లెక్కల చూసుకునే బరిలో దిగారు. మత పరంగా క్రీస్టియన్, కులం పరంగా రెడ్డి అయిన జగనే కులాల లెక్కలు చూసుకునప్పుడు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చూసుకోకుండా ఉంటారా? ఉండరు. కనుక చేతులు కలిపారు. పద్మవ్యూహం రచించారు. అది తెలిసి కూడా జగన్ తాను అభిమన్యుడు కాదు బలైపోవడానికి… గాండీవం ధరించిన అర్జునుడిని అంటూ దానిలోకి ఎంటర్ అయిపోయి అభిమాన్యుడులా బలైపోయారు.
ఓ ఓటమి, ఓ గెలుపు నుంచి టీడీపి, జనసేనలు మంచి పాఠాలు నేర్చుకున్నాయి. కనుక జగన్ నేర్చుకోలేదు. అది వేరే విషయం. పదవి., అధికారం కావాలంటే కలిసి ఉండటం, కలిసే ముందుకు సాగడం చాలా అవసరమని టీడీపి, జనసేనలు గ్రహించాయి. కనుక బ్రేకప్ చెప్పుకోకుండా తమ మద్య చిచ్చు పెడుతున్న వైసీపీ పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.
కానీ జగన్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడులా వాటి బ్రేకప్ కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఒకవేళ బ్రేకప్ చేయలేకపోతే ప్లాన్-బీ అవసరం. కనుక కాపులకు కొత్త నాయకుడుగా అంబటి రాంబాబుని ప్రజెంట్ చేశారు. గంగ చంద్రముఖిగా మారి గజ్జెలు కట్టుకొని డాన్స్ చేసినట్లుగానే, అంబటి రాంబాబు ‘టైగర్ రాంబాబు’గా మారి చాలా హడావుడి చేశారు.
అదే సమయంలో ఆయన కుమార్తె మౌనిక ఈ ప్రశ్న అడిగారు. ఆమెకు సమాధానం చెప్పినట్లే కదా?




