టైగర్ రాంబాబుకి మరో ప్రమోషన్ పక్కా?

Ambati Rambabu amid YSRCP promotion speculation

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ గురించి మాట్లాడి చాలా కాలమే అయ్యింది. మొన్న ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సదస్సులో యూత్ కాంగ్రెస్‌ నాయకులు చొక్కాలు విప్పుకొని ప్లకార్డులతో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

దానిపై జగన్‌ స్పందిస్తూ, “రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ప్రపంచ దేశాల ముందు మనమందరం ఒక్కటిగా నిలవాలి. యూత్ కాంగ్రెస్‌ నాయకుల ప్రవర్తనతో మనం అందరి ముందు సిగ్గుతో తల దించుకునేలా చేశారు,” అని ట్వీట్ చేశారు.

ADVERTISEMENT

దానికి యూత్ కాంగ్రెస్‌ జవాబు: “మీ తండ్రిగారు, మేమందరం గర్వపడే నాయకుడు స్వర్గీయ వైఎస్సార్ తన జీవితాన్ని దేశానికి ధార పోశారు. మత విద్వేషాలు, సంఘ విద్రోహ శక్తులకు వ్యతిరేకంగా పోరాడారు. కానీ మీరు సీబీఐ, ఈడీ కేసుల్లో చిక్కుకున్నారు. కనీసం మీ తండ్రిగారి ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడరని ఆశిస్తున్నాము.”

ఇక్కడితో ఈ వాగ్వాదం అయిపోలేదు. ఇటీవల వైసీపీలో ‘టైగర్ రాంబాబు’గా ప్రమోషన్ పొందిన అంబటి రాంబాబు కూడా దీనిలోకి ఎంట్రీ ఇచ్చారు.

తనకు తెలుగు తప్ప మరో భాష రాదని మొహమాటపడకుండా ఇదివరకే చెప్పుకున్నారు. కనుక యూత్ కాంగ్రెస్‌కు సమాధానంగా ఎవరితోనో ఇంగ్లీషులో పెద్ద లేఖ వ్రాయించుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

క్లుప్తంగా దాని సారాంశం: జగన్‌ మీ పార్టీ విడిచి పెట్టినందునే మీ యూపీఏ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి ఆయనపై అక్రమంగా సీబీఐ, ఈడీ కేసులు పెట్టించింది. వైఎస్సార్ పేరుని ఛార్జ్ షీట్‌లో చేర్చింది కూడా మీరే కదా? కానీ మా పార్టీ ఎల్లప్పుడూ జాతీయ ప్రయోజనాలే ముఖ్యమనుకుంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వానికి అవసరమైనప్పుడల్లా అండగా నిలబడింది…” అంటూ చాలా పెద్ద లేఖే వ్రాయించి పెట్టారు.

సాధారణంగా ఇలాంటి సందర్భాలలో సజ్జల వంటి మేధావులు స్పందిస్తుంటారు. కానీ వారికి ఆ అవకాశం ఇవ్వకుండా టైగర్ రాంబాబు ముందుగా ఇంగ్లీషులో స్పందించారు. ఇలాంటి పోటీల్లో కూడా ఇంత స్పీడుగా ఉన్నారు. ముందున్నారు. కనుక వైసీపీ ప్రమోషన్ లిస్టులో ఆయన ర్యాంక్ పెరిగే అవకాశం ఉంటుంది. త్వరలోనే నం.2లోకి వచ్చేస్తారేమో?

కానీ ఆ స్థాయికి ఎదిగిపోతే తర్వాత షర్మిల, విజయసాయి రెడ్డిలా బయటకు వెళ్ళాల్సి రావచ్చు. కనుక కాపుల నాయకుడుగా కొత్త గుర్తింపుని బలోపేతం చేసుకుంటే ఒకవేళ భవిష్యత్‌లో ఎప్పుడైనా వైసీపీ నుంచి గెంటేసినా ఈ బ్రాండ్ ఇమేజ్ పనికి వస్తుంది కదా?

ADVERTISEMENT
Latest Stories