వైసీపీ మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రస్తుత ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నడిరోడ్డు మీద బూతులు తిట్టి ఆ తరువాత టీడీపీ శ్రేణుల బిపీలను ఎదుర్కొని అరెస్టై, 16 రోజులు జైలు జీవితాన్ని గడిపిన అంబటి ఒక్కసారిగా వైసీపీ కాపు లీడర్లలో హీరో అయిపోయారు.
లోకేష్ రెడ్ బుక్ కి తన కుక్క కూడా భయపడదు అంటూ పదేపదే అంబటి చేస్తున్న ప్రకటనలు ఆయనకు వైసీపీ లో క్రేజ్ ని పెంచుతున్నాయి. దానికి తోడు తగ్గేదెలా అంటూ కూటమి ప్రభుత్వం పై బాబు, లోకేష్ లపై ఆయన చేస్తున్న విమర్శలు సాక్షిలో హైలెట్ అవుతున్నాయి.
ఇక పార్టీ అధినేత జగన్ పరామర్శతో అంబటి కాపు టైగర్ గా ప్రమోషన్ పొందారు. అలాగే బెయిలు మీద బయటకొచ్చిన నాటి నుంచి నేటి వరకు అంబటిని పరామర్శించడం కోసం ఆయన ఇంటికి క్యూ కడుతున్న వైసీపీ లీడర్ల లిస్ట్ నానాటికి పెరుగుతూ పోతుంది.
కాపు నుంచి రెడ్డి గా మారిన ముద్రగడ నుంచి ఇన్నాళ్లు కలుగులో దాక్కున్న ఎలక మాదిరి గుట్టుచప్పుడు కాకుండా అజ్ఞాతంలో ఉంటున్న కొడాలి వరకు అందరు వైసీపీ నేతలు అంబటి కోసం గడప దాటుతున్నారు, అంబటి గడప తొక్కుతున్నారు.
అయితే నిత్యం ఏదొక వార్త తో అంబటి రాంబాబు మీడియాలో దర్శనమిస్తున్నారు. అయితే అంబటికి ఈ స్థాయి మీడియా అటెన్షన్ లభించడంలో జగన్ కీలక పాత్ర పోషించారనే చెప్పాలి. జగన్ ఆదేశాలు లేకుండా ఒక్క నాయకుడి కోసం ఇంతమంది నేతలు పరామర్శ యాత్రలకు ముందుకురారు.
ఇలా ఒకరకంగా వైసీపీ అంబటిని హీరో చేస్తే, ఈ ప్రక్రియలో మరోపక్క టీడీపీ కూడా తనవంతు పాత్ర పోషించిందనే చెప్పాలి. టీడీపీ నేతల బీపీలు ఆ పై జరిగిన పరిణామాలు ఒకరకంగా అంబటికి మీడియా అటెన్షన్ ను తెచ్చిపెట్టాయి. ఇక దానికి తోడు అంబటి అరెస్టు నుంచి బైలు వరకు జరిగిన అన్ని పరిణామాలు కూడా అంబటికి కొంత సానుభూతుని సాధించిపెట్టాయి.
ఇక ఇప్పుడు సత్తునపల్లి నియోజకవర్గానికి సంబంధించిన సుమారు 22 ఎకరాల అంబటి భారీ ఫామ్ హౌస్ భూములను సర్వ్ చేయాలంటూ అధికారులు అంబటికి నోటీసులు ఇవ్వడంతో కూటమి ప్రభుత్వం తన పై రాజకీయ కక్ష్య సాధింపులకు దిగుతుందని, బాబు, లోకేష్ కి పనిలేక ఇలా తన పై తప్పుడు ఆరోపణలు చేయిస్తూ తానూ చట్ట బద్దంగా కొనుగోలు చేసిన భూమి పై సర్వేలు అంటూ వేధింపులకు పాల్పడుతుందంటూ మీడియా ముందుకొచ్చారు.
అయితే ప్రభుత్వం సర్వేలు చేసి చట్ట వ్యతిరేకంగా ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవడం తప్పుకాదు, కానీ ఇలా అంబటి తన పై ప్రభుత్వం చేస్తున్న ప్రతి చర్యను తన పై వేధింపులుగా చిత్రీకరిస్తుంటే ఇటువంటి సమయంలో కూటమి అంబటి పై ఆరోపణలు కాదు ఆధారాలు ప్రజలకు చూపించాల్సి ఉంటుంది.
లేకుంటే వైసీపీ దీనిని కూడా కాపు కులం మీద దాడిగా, అంబటి మీద జరుగుతున్న రాజకీయ వేధింపులుగా ప్రచారం చేసే ప్రమాదం ఉంటుంది. ఇలా అటు వైసీపీ ఇటు కూటమి రెండు కలిసి అంబటిని నిత్యం వార్తలలో ఉంచుతూ తనకు తాను ఒక హీరోగా భావించుకునే స్థాయికి తీసుకెళ్లారు.




