ఐటి కంపెనీలు, ఐటి రంగానికి ఓ పేరు పెట్టదలిస్తే ‘చంద్రబాబు నాయుడు’ అని పెట్టుకోవచ్చు. ఆయన అధికారంలో ఉంటే వాటి గురించే ఆలోచిస్తుంటారు. వాటిని రప్పించేందుకు ఎంతైనా శ్రమ పడతారు. ఎవరితోనైనా పోటీ పడతారు. ఇందుకు తాజా నిదర్శనం అమరావతిలో ఏర్పాటవుతున్న క్వాంటం వ్యాలీ.
విశాఖకు గూగుల్ వంటి ఐటి దిగ్గజాలు వస్తున్నాయి. వాటితో పాటు పరిశ్రమలను కూడా రప్పిస్తూ పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అదెలాగో చూద్దాం.
ముందుగా అనకాపల్లి రాంబిల్లి మండలంలోని పారిశ్రామికవాడలో బ్లూజెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ పరిశ్రమకు మంత్రి నారా లోకేష్ నేడు శంకుస్థాపన చేయడం గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది.
రూ.2,300 కోట్లు పెట్టుబడితో 102.48 ఎకరాలలో దశలవారీగా ప్లాంట్స్ ఏర్పాటు చేయబోతోంది. దీనిలో ప్రత్యక్షంగా 1,750 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. పరోక్షంగా మరో 400-500 మందికి ఉపాధి లభిస్తుంది. వచ్చే ఏడాది డిసెంబర్‌లోగా నిర్మాణ పనులు పూర్తిచేసుకొని 2028-29 ఆర్ధిక సం.లో ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
ఏపీలో పారిశ్రామికాభివృద్ధి ప్లాన్ ఇలా… శ్రీకాకుళంలో సంతబొమ్మాళి మండలంలోని మూలపేట వద్ద పోర్టు, దానికి అనుబంధంగా పారిశ్రామికవాడ. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఓ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కూడా ఏర్పాటవుతున్నాయి.
ఇప్పటికే శ్రీకాకుళం-విశాఖ మద్య రణస్థలం వద్ద పలు ఫార్మా కంపెనీలు ఏర్పాటయ్యాయి. కాస్త ముందుకు వస్తే విశాఖలో ఐటి కంపెనీలు వస్తున్నాయి. వాటి ద్వారా సుమారు లక్షమందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయి.
విశాఖ-అనకాపల్లి దారిలో ఆటోనగర్ పారిశ్రామికవాడలో అనేక మద్యతరహా, చిన్న పరిశ్రమలున్నాయి. వాటికి సమీపంలోనే స్టీల్ ప్లాంట్, ఎన్టీపీసీ వంటి భారీ పరిశ్రమలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అక్కడి నుంచి అనకాపల్లి వైపు ముందుకు సాగితే అచ్యుతాపురం వద్ద మళ్ళీ అనేక పరిశ్రమలున్నాయి.
ఇప్పుడు అనకాపల్లి జిల్లాకి ఆర్సల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇంకా పలు పరిశ్రమలు వస్తున్నాయి. ఇప్పుడీ ఫార్మా దిగ్గజం వస్తోంది. ఇది వస్తే, ఫార్మా కంపెనీలు క్యూకట్టడం ఖాయం. ఈవిధంగా శ్రీకాకుళం నుంచి అనకాపల్లి వరకు, అటు చిత్తూరు, కర్నూలు, కడప, నెల్లూరు వరకు కూటమి ప్రభుత్వం ఓ ప్రణాళిక ప్రకారం పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేస్తూ లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చాలా భారీగా ప్లాన్ చేస్తోంది. కనుక మరో 5 ఏళ్ళలో ఇవన్నీ కార్యకలాపాలు మొదలుపెడితే పారిశ్రామిక, ఐటి రంగాలలో నం.1 స్థానంలో ఉంటుంది.
అనకాపల్లి జిల్లాలో Blue Jet Healthcare కు @naralokesh భూమిపూజ.#Anakapalli #NaraLokesh #BlueJetHealthcare pic.twitter.com/lGCu7tKiyR
— M9 NEWS (@M9News_) February 28, 2026




