అలనాడు దేవతలు, రాక్షసులు అమృతం కొరకు సాగర మధనం చేస్తే ‘హాలాహలం’ పుట్టుకొచ్చింది. దానిని స్వీకరించడానికి ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు శివుడు దానిని స్వీకరించి కడుపులోకి వెళ్ళకుండా గొంతులోనే నిలిపివేశాడు. నాడు ఆ కాలకూటవిషం స్వీకరించేందుకు శివుడు వచ్చాడు.
కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం-వైసీపీ కలిసి కల్తీ నెయ్యి మధనం చేస్తుంటే దానిలో నుంచి ‘మత చిచ్చు’, ‘కుల చిచ్చు’ మొదలయ్యాయి. వాటిని ఆర్పేందుకు ఎవరున్నారు? అంటే జవాబు చెప్పడం కష్టం.
ఏపీలో ఇప్పటికే కులాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు కాపుల పేరుతో జరుగుతున్నరాజకీయాలతో ఈ కులచిచ్చు దావాగ్నిలా ఇతర కులాలకు కూడా వ్యాపిస్తే అందరూ మాడి మసైపోతారు. గతంలో ఇలాగే కులాల పేరుతో జరిగిన పోరాటాలలో సామాన్యులు మొదలు ప్రముఖుల వరకు ప్రాణాలు కోల్పోయారు కదా?
కల్తీ నెయ్యి పేరుతో చేస్తున్న రాజకీయాలతో తిరుమల ప్రతిష్టకు భంగం కలుగుతుంది. హిందువుల మనోభావాలు దెబ్బ తింటున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో మత విద్వేషాలు పెరగకుండా ఉంటాయా? ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల,మతాల చిచ్చు రాజేసే ప్రయత్నం దేనికి? అంటే సమాధానం అందరికీ తెలుసు.
రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ని చక్కదిద్దుకొని వేగంగా అభివృద్ధి చేసుకోవడంపై అందరూ దృష్టి పెట్టాలి. కూటమి ప్రభుత్వం ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడు, వైసీపీ కల్తీ నెయ్యి పేరుతో మత చిచ్చు, కాపుల పేరుతో కుల చిచ్చు రగిలించేందుకు ప్రయత్నిస్తోంది. దాని ప్రయత్నాలను ప్రజలందరూ నిశితంగా గమనిస్తూనే ఉన్నారు.
అయితే ఎన్నికల వరకు ప్రజలు నిస్సహాయంగా చూడటం తప్ప ఏమీ చేయలేరు. కానీ కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది? వైసీపీ వ్యూహాలు ఏవిధంగా సాగుతున్నాయో, అవి దేనికో, వాటి పర్యవసానాలు ఏవిధంగా ఉంటాయో స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వం నిస్సహాయంగా చూస్తే ఎలా?




