ఏపీలో రోడ్లపై సభలు, ర్యాలీలు, రోడ్ షోలని నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్:1పై హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వులని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం విశేషం. ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాది విజ్ఞప్తి మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం గురువారం విచారణ చేపట్టేందుకు అంగీకరించిన్నట్లు సమాచారం.
ఏపీలో ప్రజలకి భద్రత కల్పించేందుకే ఈ జీవోని తెచ్చామని రాష్ట్ర ప్రభుత్వ వాదనని హైకోర్టు తిరస్కరించిన విషయం, అలాగే ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉండే కొన్ని కేసులని హైకోర్టు బెంచ్ తీసుకోకుండా ప్రభుత్వం ఒత్తిళ్ళు చేస్తోందనే హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు రేపు సుప్రీంకోర్టు విచారణలో ప్రస్తావనకి రాకుండా ఉండవు. వస్తే కనుక జీవో నంబర్: 1 విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నందుకు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలూ తప్పకపోవచ్చు.
ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవోని సుప్రీంకోర్టు సమర్ధిస్తే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించుకోవడం ప్రశ్నార్ధకంగా మారుతుంది. కనుక ఇదేమీ అత్యవసరంగా విచారించాల్సిన విషయం కాదంటూ ఈ వ్యవహారాన్ని హైకోర్టులోనే తేల్చుకోమని చెప్పి పంపించేయవచ్చు లేదా హైకోర్టు ఈ కేసు విచారణ జరుపుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తమని ఆశ్రయించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టవచ్చు లేదా హైకోర్టు ఉత్తర్వులని సమర్ధించి దీనిపై తదుపరి విచారణ అవసరమే లేదని చెప్పినా ఆశ్చర్యం లేదు.
రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయసలహాలు ఇచ్చేందుకు అనేకమంది న్యాయ నిపుణులు, అడ్వకేట్ జనరల్ తదితరులు చాలామందే ఉన్నప్పటికీ ప్రతీ చిన్న విషయానికి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎదురుదెబ్బలు ఎందుకు తింటోందో అర్దం కాదు.



