పంచాయితీ, మున్సిపల్ ఎన్నికలు… అవసరమే!

AP Local Elections 2026

పంచాయితీ, మున్సిపల్ ఎన్నికలు… అవసరమే!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు మొదలుపెట్టింది.

ADVERTISEMENT

ముందుగా ఓటర్ల తుది జాబితాలు సిద్ధం చేసి మార్చి 9లోగా ప్రచురించాలని జిల్లా కలెక్టర్లని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నీలం సాహ్నీ ఆదేశించారు.

ఈ మేరకు శనివారం నోటిఫికేషన్లు జారీ చేసి, 2026 జనవరి 1ని కటాఫ్ తేదీగా ఖరారు చేశారు. ఆ రోజుకి ఓటు హక్కు కలిగిన వారిని గుర్తించి తుది జాబితా ప్రకటించాల్సి ఉంటుంది.

రాష్ట్రంలో 87 పురపాలక, నగర పాలక, నగర పంచాయితీల పాలక వర్గాల గడువు మార్చి 17తో ముగుస్తుంది. వివిధ కారణాల చేత మరో మరో 36 నగర పాలక, నగర పంచాయితీల ఎన్నికలు గతంలో నిర్వహించలేదు. వాటినీ కలుపుకుంటే మొత్తం 123 సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.

రాష్ట్రంలో 13,098 పంచాయితీ సర్పంచుల పదవీ కాలం ఏప్రిల్‌ 2తో ముగుస్తుంది. వివిధ కారణాల చేత మరో 253 పంచాయితీలకు గతంలో ఎన్నికలు నిర్వహించలేదు. వాటిని కూడా కలుపుకుంటే మొత్తం 13,351 పంచాయితీలకు ఎన్నికలు జరపాల్సి ఉంటుంది.

సెప్టెంబర్‌ 23,24 తేదీలలో రాష్ట్రంలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం ముగుస్తుంది. కనుక ఈ రెండు ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.

అంటే మార్చి నుంచి సెప్టెంబర్‌ నెలాఖరు వరకు వరుసగా ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగబోతోందన్న మాట.

గ్రామ స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు అభివృద్ధి పనులు సక్రమంగా జరగాలంటే స్థానిక సంస్థలన్నీ పనిచేయడం చాలా అవసరం. కనుక ఎన్నికల నిర్వహణ అనివార్యం. అంతేకాదు… రాజకీయంగా చూసినా ఈ ఎన్నికలు చాలా అవసరం.

ఏపీలో ఒకవైపు కూటమి ప్రభుత్వం, మరోవైపు వైసీపీలు ప్రతీ అంశంపై భిన్నవాదనలు వినిపిస్తూ, ప్రత్యర్ధుల వలన రాష్ట్రానికి, ప్రజలకు నష్టం కలుగుతోందని గట్టిగా వాదిస్తున్నాయి. ముఖ్యంగా కల్తీ నెయ్యి వివాదంతో ఇరు వర్గాల మద్య జరుగుతున్న యుద్ధాలు పతాకస్థాయికి చేరుకున్నందున వాటికి ప్రజాతీర్పు చాలా అవసరమే.

‘మరో 15 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటామని’ కూటమి నేతలు, ‘వచ్చే ఎన్నికలలో మళ్ళీ మేమే,’ అని వైసీపీ నేతలు బల్ల గుద్ది వాదిస్తున్నారు. కనుక వాటి బలాబలాలు తేల్చుకోవడానికి కూడా ఈ ఎన్నికలు చాలా అవసరం.

ADVERTISEMENT
Latest Stories