ఏపీలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై పోరాటానికి సిద్దం అవుతున్నారు. ఆదివారం విజయవాడలో ఏపీ జేఏసీ అమరావతి అధ్వర్యంలో సమావేశమై మార్చి 9వ నుంచి ఏప్రిల్ 5వరకు తొలిదశ ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు.
ఈ సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, “మంత్రుల సబ్ కమిటీ చర్చల పేరుతో ఉద్యోగ సంఘాలతో నిర్వహిస్తున్న భేటీలు కేవలం ‘ఛాయ్ బిస్కట్ సమావేశాలు’ గానే మిగిలిపోతున్నాయి. ఇలాగ ఛాయ్ బిస్కట్ సమావేశాలతో ఇంకెంతకాలం మమ్మల్ని మభ్యపెడతారు?ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఇంతకాలం చాలా సహనంగా ఎదుచూశాము. కానీ సకాలంలో జీతాలు కూడా చెల్లించకుండా ప్రభుత్వం మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతోంది. 11వ పీఆర్సీ విషయంలో ఓసారి మోసపోయాము. మళ్ళీ మరోసారి మోసపోయేందుకు మేము సిద్దంగా లేము.
కర్నూలులో మూడో రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలలో మా డిమాండ్లపై చర్చించి వాటిని సీఎస్‌కి అందించాము. వాటిని పరిష్కరించవలసిందిగా మేము విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. కనుక ఇకపై దశలవారీగా ఆందోళనలు ఉదృతం చేయాలని నిర్ణయించుకొన్నాము. ఇంకా చర్చల పేరిట ఛాయ్ బిస్కట్ సమావేశాలకు రమ్మనమని ఆహ్వానిస్తే మేము అంగీకరించము,” అని హెచ్చరించారు.
నిన్న ఆదివారమే గుంటూరులోని మల్లయ్యలింగం భవన్‌లో ఎస్టీయు అధ్వర్యంలో మరో సమావేశం జరిగింది. దానిలో ఎస్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్.తిమ్మన మాట్లాడుతూ, “రాష్ట్రంలో రెండు లక్షల మంది ఉపాధ్యాయులు ఎన్నడూ లేనివిదంగా తీవ్ర ఆందోళనతో పనిచేస్తున్నారు. నెలనెలా జీతాలు ఎప్పుడు పడతాయో తెలీదు కానీ పని, డ్యూటీ టైమింగ్స్ విషయంలో మాత్రం అధికారులు ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ముఖ్యంగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ నిరంకుశవైఖరితో ఉపాధ్యాయులు తీవ్ర అభద్రతాభావానికి గురవుతున్నారు. ఎపుడు ఎవరిని ఎందుకు సస్పెండ్ చేస్తారో అని భయం భయంగా జీవిస్తున్నారు. ఉపాధ్యాయులపై ఒత్తిడి చేస్తుంటే వారు విద్యార్థులకు పాఠాలు ఎలా చెప్పగలరు? ఉత్తీర్ణత శాతం ఎలా పెరుగుతుంది?
ఉపాధ్యాయులని వేదిస్తున్న అధికారులు ఇంతవరకు 11వ పీఆర్సీ బకాయిలు రూ.1800 కోట్లు, ఇతర బకాయిలు రూ.3,000 కోట్లు ఎందుకు చెల్లించలేదో… ఇంకా ఎప్పుడు చెల్లిస్తారో చెప్పగలరా? ఉపాధ్యాయులని ఇలాగే వేధిస్తుంటే ఏదో ఓ రోజున అధికారులపై తిరుగుబాటు చేయాల్సి వస్తుంది. ఇకనైనా రాష్ట్రంలో 13 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారులకి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాము. లేకుంటే త్వరలో కార్యాచరణ ప్రకటించాల్సి వస్తుంది,” అని హెచ్చరించారు.



